Lakshmi Puja: లక్ష్మీదేవి కటాక్షం లభించాలంటే ఈ శక్తివంతమైన పరిహారాన్ని మీ ఇంట్లో చేయండి
08 December 2023, 17:54 IST
- Lakshmi Puja: లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటేనే ఇంట్లో సకల సౌభాగ్యాలు కలుగుతాయి.
లక్ష్మీదేవి
Lakshmi Puja: లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే ఇల్లు సకల సౌభాగ్యాలతో, ధన వస్తు వాహనాలతో కళకళలాడుతుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఒక శక్తివంతమైన పరిహారం ఉంది. దీన్ని ఇంట్లోనే ఎవరికి వారు చేసుకోవచ్చు. పచ్చ కర్పూరానికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. విష్ణుమూర్తికి పచ్చ కర్పూరం అంటే ఎంతో ప్రీతి. అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా పచ్చ కర్పూరం అంటే ఎంతో ప్రీతి. అందుకే విష్ణుమూర్తికి లేదా వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే ఆర్థికంగా కలిసి వస్తుందని, సమస్యలు తొలగిపోతాయని చెబుతారు. కోర్టుపరమైన సమస్యలతో, భూ సంబంధ లేదా గృహ సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారు పచ్చ కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి, విష్ణుమూర్తికి హారతి ఇస్తే త్వరగా బయటపడతారు.
లేటెస్ట్ ఫోటోలు
లక్ష్మీదేవి పూజ ఇలా..
అలాగే ఇంట్లో సకల సంపదలు కలగాలంటే లక్ష్మీదేవిని పూజించాలి. ఓ శక్తివంతమైన పరిహారాన్ని లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయాలి. బుధవారం లేదా శుక్రవారం ఈ పరిహారాన్ని చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇందుకోసం ముందుగా మీరు పసుపు రంగులో ఉన్న ఒక వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ వస్త్రంలో పచ్చ కర్పూరాన్ని వేయాలి. దాన్ని మూటలా కట్టి మీ పూజా మందిరంలో ఉత్తర దిక్కులో ఉంచాలి. ప్రతిరోజూ దానికి ధూపం వేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ధనాభివృద్ధి జరుగుతుంది.
పచ్చకర్పూరం కట్టిన ఈ మూటను ఇంట్లోని కుబేర స్థానమైన ఉత్తర దిక్కులో ఉంచితే మంచిది. చిన్న పీఠం వేసి కాస్త ఎత్తులో దీన్ని ఉంచాలి. లేదా ఉత్తర దిక్కులో ఉన్న పూజ గదిలో ఉంచిన మంచిదే. పూజ గదిలోనే ఈ మూటని పెడితే మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది ఇంట్లో ఆనందాన్ని తెస్తుంది.
వ్యాపారాలు చేసే వారికి ఈ పరిహారం బాగా కలిసి వస్తుంది. మీ వ్యాపార సంస్థల్లో క్యాష్ బాక్స్ ఉన్నచోట ఈ పచ్చ కర్పూరాన్ని పసుపు రంగు వస్త్రంలో మూటలా కట్టి ఉంచితే మంచిది. అది కూడా బుధవారం పూట చేస్తే వ్యాపారం విరాజిల్లుతుంది.
కేవలం పచ్చ కర్పూరమే కాదు గంధంతో కూడా ఓ శక్తివంతమైన పరిహారం ఉంది. శుక్రవారం రోజు 8 రూపాయల బిళ్లలు తీసుకోవాలి. ఒక రాగి పళ్ళెం గాని ఇత్తడి పళ్లెంగానీ తీసుకుని... ఆ పళ్లెంలో కొద్దిగా నీళ్ళు పోయాలి. ఆ నీళ్లల్లో మంచి గంధాన్ని కలపాలి. ఆ నీళ్లల్లో రూపాయి బిళ్ళలను ఉంచాలి. ఆ రూపాయి బిళ్ళలకు మంచిగంధం అతుక్కునేలా చూడాలి. ఆ పళ్లాన్ని పూజ గదిలో ఉంచి ప్రతిరోజూ పూజ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది. ఈ పరిహారాలను ఇంట్లోనే చాలా సులువుగా చేసుకునేవి. కాబట్టి ప్రతి ఒక్కరూ పాటిస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.