తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rang Panchami: రంగ్ పంచమి రోజు ఈ పరిహారాలు పాటించారంటే లక్ష్మీదేవి కటాక్షం పొందుతారు

Rang Panchami: రంగ్ పంచమి రోజు ఈ పరిహారాలు పాటించారంటే లక్ష్మీదేవి కటాక్షం పొందుతారు

Gunti Soundarya HT Telugu

27 March 2024, 11:48 IST

google News
    • Rang panchami: హోలీ జరిగిన ఐదు రోజుల తర్వాత రంగ్ పంచమి వేడుకలు జరుపుకుంటారు. ఆరోజు దేవతలు భూమి మీదకు వచ్చి హోలీ ఆడతారని నమ్ముతారు. రంగ్ పంచమి రోజు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. 
రంగ్ పంచమి పరిహారాలు
రంగ్ పంచమి పరిహారాలు (pixabay)

రంగ్ పంచమి పరిహారాలు

Rang panchami: హిందూ క్యాలెండర్ ప్రకారం హోలీ తర్వాత ఐదో రోజున రంగ్ పంచమి వేడుకలు జరుపుకుంటారు. ఈ వేడుకతో హోలీ పండుగ సంబరాలు పూర్తవుతాయి. ఈ ఏడాది రంగ్ పంచమి మార్చి 30 శనివారం వచ్చింది. పంచమి తిథి వచ్చిన రోజు రంగ్ పంచమి జరుపుకుంటారు.

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో రంగ్ పంచమి ఘనంగా జరుపుకుంటారు. శోభాయాత్రలు నిర్వహిస్తారు. రంగ్ పంచమి రోజు ప్రతికూల శక్తుల కంటే దైవశక్తులు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు. బర్సానాలో రాధాకృష్ణుల ఐక్యతకు గుర్తుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీలలు చేసిన రోజుని కూడా రంగ్ పంచమిగా జరుపుకుంటారని ప్రతీతి.

రంగ్ పంచమి శుభ సమయం

పంచమి తిథి ప్రారంభం మార్చి 29 రాత్రి 8.20 గంటల నుంచి పంచమి తిథి ముగింపు మార్చి 30 రాత్రి 9.13 గంటల వరకు ఉంటుంది.

ప్రజలు రంగ్ పంచమి రోజు కూడా హోలీ జరుపుకుంటారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ అభినందనలు తెలుపుకుంటారు. ఆ రోజు రాధాకృష్ణులకు గులాల్ సమర్పిస్తారు.

రంగ్ పంచమి ప్రాముఖ్యత

పురాణాల ప్రకారం రంగ్ పంచమి రోజు దేవతలకు అంకితం చేసిన రోజు. ఆరోజు రంగులతో హోలీ జరుపుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందని నమ్ముతారు. ఆకాశంలోకి రంగులు విసరడం వల్ల దేవతలు ఆకర్షితులై వారి ఆశీర్వాదాలను మన మీద కురిపిస్తారని అంటారు. రంగ్ పంచమి రోజు దేవతలు భూమి మీదకు వచ్చి రంగులతో హోలీ ఆడుకుంటారని చెప్తారు.

రంగ్ పంచమి ప్రత్యేక పరిహారాలు

రంగ్ పంచమి రోజున లక్ష్మీదేవి, విష్ణుమూర్తిని పూజించాలి. ఐశ్వర్యం, సంపద, సౌభాగ్యం ఇచ్చే దేవతగా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. పూజ సమయంలో లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి ఎరుపు రంగు గులాల్ సమర్పించాలి. ఆరాధన సమయంలో కనకధారా స్తోత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు.

రంగ్ పంచమి రోజు రాధాకృష్ణులను పూజిస్తారు. వారికి గులాల్ సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. ప్రేమ బంధాలు బలంగా ఉంటాయి. దంపతుల జీవితంలో సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తలు కలిసి ఈ పూజ చేయాలి.

రంగ్ పంచమి రోజున ఒక నాణెం, ఐదు పసుపు కొమ్ములు తీసుకొని పసుపు రంగు వస్త్రంలో కట్టి పూజ స్థలంలో ఉంచాలి. ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజించి నెయ్యి దీపం వెలిగించాలి. ఆ మూటను సేఫ్ లాకర్ లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల సంపద పెరెట్టింపు అవుతుంది. కొత్త ఆర్థిక మార్గాలు తారసపడతాయి.

రంగ్ పంచమి రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఫలప్రదంగా ఉంటుంది. పూజ సమయంలో లక్ష్మీదేవికి ఇష్టమైన ఖీర్ వంటి తెల్లని స్వీట్లు నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది.

రంగ్ పంచమి రోజు ఇష్ట దైవాలను మనస్పూర్తిగా, హృదయ శుద్ధితో ఆరాధించడం వల్ల భక్తుల కోరికలను తీర్చేందుకు దేవతలు భూమి మీదకు దిగి వస్తారని పురాణ కాలం నుంచి వస్తున్న నమ్మకం. పురాతన కాలం నుంచి ఈ రంగ్ పంచమి వేడుకలు జరుపుకుంటూ వస్తున్నారు. దేవతలకు రంగులు రాయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజిస్తారు. అమ్మవారి ఆశీర్వాదంతో ఇంట్లో డబ్బుకు ఇటువంటి కొరత ఉండదని విశ్వాసం. రజో గుణం, తమోగుణం వంటి అలవాట్లు కూడా నాశనం అవుతాయని జీవితం శాంతితో నిండిపోతుందని భావిస్తారు.

తదుపరి వ్యాసం