తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Masa Shivaratri: శివుడికి ప్రీతికరమైన ఈరోజు ఇలా చేయండి.. ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది

Masa shivaratri: శివుడికి ప్రీతికరమైన ఈరోజు ఇలా చేయండి.. ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది

Gunti Soundarya HT Telugu

02 August 2024, 6:00 IST

google News
    • Masa shivaratri: ప్రతినెల శివరాత్రి వస్తుంది. దీన్ని మాస శివరాత్రి అంటారు. ఆగస్ట్ 2వ తేదీ ఆషాడ మాస శివరాత్రి వచ్చింది. శివుడికి ఎంతో ఇష్టమైన ఈరోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. 
మాస శివరాత్రి పరిహారాలు
మాస శివరాత్రి పరిహారాలు (pinterest)

మాస శివరాత్రి పరిహారాలు

Masa shivaratri: ప్రతినెల శివరాత్రి వస్తుంది. దీన్ని మాస శివరాత్రి అంటారు. ఆషాడమాసంలో ఆగస్ట్ 2వ తేదీ మాస శివరాత్రి వచ్చింది. ఇది శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఈరోజు కొన్ని పరిహారాలు పాటించడం మంచిది.

మాస శివరాత్రి వచ్చిన మూడు రోజుల తర్వాత నుంచి శివుడికి ఎంతో ప్రీతికరమైన శ్రావణమాసం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో శివరాత్రి రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఆర్థిక ఇబ్బందులను అధిగమించవచ్చు. సంపద పెరుగుతుంది. శివుని ఆశీస్సులు లభిస్తాయి.

మాస శివరాత్రి పరిహారాలు

మాస శివరాత్రి రోజు నల్ల నువ్వులను గంగాజలంలో కలిసి శివలింగానికి అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. మాస శివరాత్రి శుక్రవారం రావడం వల్ల దీని ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఈ రోజు ఆరుద్ర నక్షత్రం, సర్వార్ధ సిద్ధియోగం వల్ల శివుని ప్రత్యేక అనుగ్రహం పొందేందుకు శుభ సమయంగా పరిగణిస్తారు.

మాస శివరాత్రి రోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివలింగం దగ్గర నెయ్యి దీపం వెలిగించి ఆర్థిక పురోభివృద్ధి కోసం శివుడిని ప్రార్థించాలి. దీపం పూర్తిగా కొండెక్కేంత వరకు శివలింగం దగ్గర ఉండటం మంచిది. ఇలా చేయడం వల్ల పనుల్లో విజయం లభిస్తుందని భక్తుల విశ్వసిస్తారు.

ఆర్థిక పురోభివృద్ధి కోసం

మాస శివరాత్రి రోజు గోధుమలు, బార్లీని దానం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు శివలింగానికి బార్లీ కలిపిన నీటితో అభిషేకం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పనుల్లో ఆటంకాలు తొలగి ఇంట్లో ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమవుతుంది.

అలాగే కుటుంబ శ్రేయస్సు కోసం శివరాత్రి రోజున శివుడికి లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సంతోషం కలుగుతుంది. సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది. సమస్యలు తొలగిపోయి అందరూ సంతోషంగా జీవిస్తారు.

శివలింగంపై తెల్ల గంధాన్ని రాసి మీ నుదుటిపై అదే గంధంతో త్రిభుజ వేసుకోవాలి. ఈ సమయంలో ఓం నమః శ్శివాయ అనే మంత్రాన్ని జపించాలి. అక్షతలు, ఉమ్మెత్త పువ్వులు, స్వీట్లు, తమలపాకు, బిల్వ పత్రాలు మొదలైన వాటిని శివుడికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడని ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.

సంపద ప్రయోజనాలు పొందడం కోసం మాస శివరాత్రి రోజు పంచామృతంతో అభిషేకం చేయాలి. ఈ సమయంలో ఓం నమః శ్శివాయ మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. శివుని అనుగ్రహంతో జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి.

శని దుష్ప్రభావాలు తగ్గించుకునేందుకు

మాస శివరాత్రి రోజు శని ప్రభావాలు తగ్గించుకునేందుకు ఉత్తమమైన రోజు. ప్రస్తుతం మీన రాశిపై ఏలినాటి శని మొదటి దశ, కుంభరాశి పై రెండవ దశ, మకర రాశి పై మూడో దశ కొనసాగుతోంది. అలాగే కర్కాటకం, వృశ్చిక రాశి మీద అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. అందువల్ల ఈ రాశుల వాళ్ళు దుష్ప్రభావాలు తగ్గించుకునేందుకు ఈ పరిహారాలు పాటించడం మంచిది.

సడే సతితో బాధపడేవాళ్లు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు, ఇనుప పాత్రలు లేదా పెసరపప్పు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు సంతోషిస్తాడు. అలాగే శివరాత్రి రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి ప్రదక్షణలు చేయాలి. ఆవనూనె దీపం వెలిగించడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది.

శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు నల్ల నువ్వులు లేదా పిండి, పంచదార మిశ్రమాన్ని తయారుచేసి చీమలకు వేయాలి. అలాగే నల్ల నువ్వులు శివుడికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శని దేవుని అశుభ్రభావాలు తగ్గుతాయి. ఓం శనీశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం వల్ల శనీశ్వరుడు ప్రసన్నుడు అవుతాడు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

 

 

 

తదుపరి వ్యాసం