Peepal tree: రావి చెట్టు కింద దీపం ఎందుకు వెలిగిస్తారు? ఏరోజు వెలిగించాలి? దీని ప్రాముఖ్యత ఏంటి?-why do you light a lamp under the peepal tree what is the significance ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Peepal Tree: రావి చెట్టు కింద దీపం ఎందుకు వెలిగిస్తారు? ఏరోజు వెలిగించాలి? దీని ప్రాముఖ్యత ఏంటి?

Peepal tree: రావి చెట్టు కింద దీపం ఎందుకు వెలిగిస్తారు? ఏరోజు వెలిగించాలి? దీని ప్రాముఖ్యత ఏంటి?

Gunti Soundarya HT Telugu
Jul 22, 2024 11:02 AM IST

Peepal tree: రావిచెట్టు దేవతా వృక్షంగా పిలుస్తారు. సకల దేవతలు నివసిస్తారని చెప్తారు. అయితే రావి చెట్టు కింద దీపం ఎందుకు వెలిగిస్తారు. ఏ రోజు వెలిగించాలి? ఇలా వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

రావి చెట్టు కింద దీపం ఎందుకు వెలిగిస్తారు?
రావి చెట్టు కింద దీపం ఎందుకు వెలిగిస్తారు? (Unsplash)

Peepal tree: సనాతన ధర్మంలో రావి చెట్టును చాలా పవిత్రమైనదిగా, దైవ వృక్షంగా భావిస్తారు. అందుకే ఎల్లప్పుడూ ఈ చెట్టుని పూజిస్తారు. రావిచెట్టు విష్ణువు, లక్ష్మీదేవి నివాసం అని పురాణాలు చెబుతున్నాయి. రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని పిలుస్తారు. పురాణాలలో దీని గురించి ప్రస్తావన ఉంది.

రావి చెట్టులో త్రిమూర్తులు, సకల దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు. అలాగే రావి చెట్టు కింద పూర్వీకులు నివసిస్తారని దాని చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల అనేక విధాలుగా మేలు జరుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి.

రావి చెట్టు కింద దీపాలు వెలిగించడం వల్ల దేవతల ఆరాధన జరిగినట్లు భావిస్తారు. ఇలా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి సుఖసంతోషాలు ప్రసాదిస్తుందని నమ్ముతారు. రావి చెట్టు కింద నిత్యం దీపం వెలిగించడం వల్ల జీవితంలో డబ్బుకు ఆహారానికి కొదవ ఉండదని భావిస్తారు. ముఖ్యంగా సాయంత్రం పూట రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల పితృదేవతలు ప్రశాంతంగా ఉండి కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ఆశీర్వదిస్తారని విశ్వసిస్తారు.

శనివారం ఎందుకు దీపం వెలిగిస్తారు

శనివారం రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించడం చాలా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఆవనూనె దీపం వెలిగించడం వల్ల శని దోషం ముగుస్తుందని నమ్ముతారు. నిజానికి రావి చెట్టును శనిదేవుని చిహ్నంగా భావిస్తారు. జాతకంలో శనిదోషం ఉన్నవాళ్లు ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించడం మంచిది. ఏలినాటి శని ప్రభావంతో బాధపడే వాళ్ళు శనివారం రావి చెట్టును పూజించి దాని కింద దీపం వెలిగించడం మంచిది.

రావి చెట్టును పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు

రావి చెట్టుకి శనివారాల్లో నీరు పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. కానీ పొరపాటున కూడా ఆదివారం రావి చెట్టుకు నీరు సమర్పించకూడదు, తాకకూడదు. బ్రహ్మపురాణం ప్రకారం రావి చెట్టును పూజించడం వల్ల త్రిమూర్తులను పూజించిన ఫలితం లభిస్తుంది. అలాగే బృహస్పతి అనుగ్రహం కూడా లభిస్తుంది. రావి చెట్టుకు పూజ చేస్తే శుభం కలుగుతుంది.

శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. అంటువ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణుడు రావి చెట్టులో నివసిస్తుంటాడని అంటారు. అందుకే ఈ చెట్టును ఆరాధించడం వల్ల కృష్ణుడి కరుణాకటాక్షాలు పొందుతారని చెబుతారు. ఈ చెట్టు నీడన కూర్చుని గాయత్రీ మంత్రం జపించడం వల్ల నాలుగు వేదాలు చదివిని పుణ్యం లభిస్తుందని విశ్వాసం.

వినాయకుడికి రావి ఆకులు ఎంతో ప్రీతికరం. హిందూ ఆచారాల ప్రకారం అధ్యాత్మికతను పెంచి ప్రశాంతతను కలిగించే అద్భుతమైనదిగా ఈ చెట్టును భావిస్తారు. సంతాన ప్రాప్తి కోసం ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ముడుపులు కట్టడం చేస్తారు. భర్తకు దీర్ఘాయువు ఇవ్వమని కోరుకుంటూ పెళ్ళైన స్త్రీలు రావి చెట్టుకు చుట్టూ రక్షా సూత్రాన్ని కడతారు. ఇలా చేయడం వల్ల వివాహిత సౌభాగ్యం కలకాలం ఉంటుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner