Lord Shiva: గుడిలో శివుడికి, నందికి మధ్య ఎప్పుడూ నిలబడకండి? ఎందుకంటే…
Lord Shiva: ఎంతోమంది ప్రతిరోజూ శివాలయాలకు వెళుతూ ఉంటారు. శివుడి ముందు నంది కచ్చితంగా ఉంటుంది. కొంతమంది తెలియక శివుడికి, నందికి మధ్యలో నిలబడుతూ ఉంటారు. అలా చేయకూడదు.
Lord Shiva: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శివాలయాలు ఉన్నాయి. ఆ శివాలయాల్లో శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువు దీరుతాడు. శివుడు శక్తివంతమైన స్వరూపం. నిత్యం లోతైన ధ్యానంలో ఉన్నట్టు కనిపిస్తాడు. శివుని సన్నిధికి వెళ్లే దారిలో కాపలాగా ఉంటాడు నందీశ్వరుడు. శివుడుని ఎవరు కలుసుకోవాలన్న ముందుగా నందీశ్వరుడిని దాటి వెళ్ళాలి.
శివుడు నివాసంలోకి లేదా సన్నిధిలోకి ఎవరు ప్రవేశించవచ్చో నిర్ణయించే శక్తి నందీశ్వరుడికి ఉంది. పురాతన కథల ప్రకారం నంది శిలాద మహర్షి కుమారుడు. శిలాధ మహర్షి తీవ్రమైన యజ్ఞం చేయగా ఆ యజ్ఞం నుండే ఈ నంది ఉద్భవించినట్టు చెబుతారు. నందికి శివుని పట్ల అచంచలమైన భక్తి ఉంటుంది. అతను పెరిగే కొద్దీ శివుడి భక్తితో నిండిపోతాడు. ఆ భక్తే అతనిని శివునికి దగ్గర చేసింది. ద్వారపాలకుడిగా మార్చింది.
ఏ ఆలయానికి వెళ్లినా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువుదీరుతాడు. ఎంతో మంది భక్తులు తెలియక శివుడికి, నందికి మధ్య నిల్చుని నమస్కరిస్తూ ఉంటారు. అలా చేయకూడదు. శివుడికీ, నందికీ మధ్య ఎవరూ నిల్చోకూడదు. నంది దృష్టి, చూపు ఎప్పుడూ శివుని పైనే ఉంటుంది. వ్యక్తులు శివునికి, నందికి మధ్య నిలబడటం వల్ల నంది దృష్టి నుండి శివుడిని మరల్చినట్టు అవుతుంది. ఇది వారిద్దరి మధ్య భక్తికి అంతరాయం కలిగించడానికి కారణం అవుతుంది. నంది శివుడుని చూస్తూ పూర్తి ధ్యానంలో ఉంటాడు. అతని ముఖం ప్రకాశవంతంగా, నిర్మలంగా ఉంటుంది. శివుని నుంచి వస్తున్న కాంతి ప్రకాశానికి అతను ధ్యానముద్రలో ఉండిపోతాడు. ఎప్పుడైతే ఎవరైనా వారి మధ్య నిలబడతారో నంది ధ్యానానికి ఆటంకం ఏర్పడుతుంది. ఇలా చేయడం చాలా తప్పు.
దేవాలయాల్లో హారతి ఇచ్చే సమయంలో పురోహితులు ఎన్నోసార్లు నంది, శివునికి మధ్య ఎవరైనా నిలిచి ఉంటే అలా నిల్చోవద్దని పక్కకు వెళ్ళమని చెబుతూ ఉంటారు. నంది మాత్రమే శివుడుని, అతని మహిమను నేరుగా చూడగలడని ఎంతో మంది నమ్మకం. శివుడు, నంది మధ్య ఉన్న విలువైన బంధం వారి మధ్య ఎవరిని నిలబడనీయకుండా చేస్తుంది. ఇది ప్రేమ, విశ్వాసంతో కూడిన బంధం.