Lord shiva: శివుడి తల మీద చంద్రుడు ఎందుకు ఉంటాడు? దీని వెనుక ఉన్న ఈ కథలు తెలుసా?
Lord shiva: పరమేశ్వరుడు ఆభరణాలు అంటే మెడలో పాము, తల మీద చంద్రుడు, చేతిలో ఢమరుకం. ఇవి పెట్టుకోవడం వెనుక ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంది. చంద్రుడు తల మీద ఉండటం వెనుక ఉన్న రెండు కథలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Lord shiva: ఆదిదేవుడు, సృష్టికర్త ఆ పరమేశ్వరుడే. గంగాజలంతో అభిషేకం చేసి బిల్వపత్రం సమర్పిస్తే చాలు ప్రసన్నుడు అయిపోతాడు పరమేశ్వరుడు.
దేవుళ్ళు, దేవతలు అందరూ విభిన్నమైన నగలతో అందంగా అలంకరించుకొని కనిపిస్తారు. కానీ శివుడు మాత్రం కేవలం మెడలో పాము, తల మీద చంద్రుడు, శరీరాన్ని కప్పుకునేందుకు పులి చర్మం, ఒంటినిండా భస్మంతో కనిపిస్తాడు. శివుడు ధరించే ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే శివుడు తల మీద చంద్రుడిని ఎందుకు ధరించాడు అనే దాని వెనుక పురాణాల ప్రకారం రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
విష ప్రభావం తగ్గించేందుకు
క్షీరసాగర మథనం చేసే సమయంలో విషం కూడా బయటకి వచ్చింది. దాన్ని తీసుకోవడానికి అటు దేవతలు ఇటు అసురులు భయపడిపోయారు. సృష్టిని సైతం నాశనం చేయగల శక్తి ఆ విషానికి ఉంది. దీంతో దేవతలు కాపాడమని పరమశివుడిని శరణుకోరారు. సృష్టికార్యం కోసం శివుడు ఆ విషయాన్ని మింగి తన గొంతులో ఉంచాడు. అందుకే ఆయన కంఠం నీలంగా మారిపోయింది. నీలంగా ఉన్న కంఠం ఉండటం వల్ల పరమేశ్వరుని నీలకంఠుడు అని కూడా పిలుస్తారు.
విష ప్రభావంతో శివుడి శరీరం మరింత వేడిగా మారడంతో దేవతలు అందరూ విస్తు పోయారు. ఆ ప్రభావం తగ్గించడం కోసం చంద్రుడు తనని తల మీద ఉంచుకోవాల్సిందిగా వేడుకున్నాడు. అందుకు మొదట శివుడు మొదట అంగీకరించలేదు. కానీ తర్వాత తెలుపు రంగు, చల్లటి ప్రభావం కారణంగా విష ప్రభావం కొంతవరకైనా తగ్గుతుందని దేవతలు ఒప్పించడంతో అంగీకరించాడు. అప్పటి నుంచి శివుడి తల మీద చంద్రుడు ఉండిపోయాడు. అలా చంద్రుడు ప్రభావంతో శివుడికి విష ప్రభావం తగ్గింది.
మరొక కథ
పురాణాల ప్రకారం దక్షుడికి 27 మంది కుమార్తెలు. వారిని అనసూయ దేవి కుమారుడైన చంద్రుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. చంద్రుడు తన 27 మంది కుమార్తెలను సమానంగా చూసుకుంటాడని దక్షుడు భావించాడు. అయితే 27 మంది భార్యలు ఉన్నా సరే వారిలో ఒక్క రోహిణితో మీద మాత్రమే చంద్రుడు ఎక్కువ ప్రేమ చూపిస్తూ మిగతా వారిని పట్టించుకోవడం మానేశాడు. దీంతో 26 మంది కుమార్తెలు దక్షుడి దగ్గరికి వెళ్లి తమ గోడు వెళ్ళబోసుకున్నారు.
అందరిని సమానంగా చూసుకోమని దక్షుడు చంద్రుడిని హెచ్చరించినా పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన దక్షుడు చంద్రుని శపిస్తాడు. రోజురోజుకీ వెలుగు తగ్గిపోతూ చివరికి మొత్తానికి అంతమవుతావు అంటూ శపించడంతో చంద్రుడు భయపడిపోయాడు. శాప విమోచనం కలిగించాలని బ్రహ్మ, విష్ణువులని వేడుకున్నాడు. తమ వల్ల కాదని పరమశివుడిని అనుగ్రహం కోసం తపస్సు చేయమని చెప్తారు.
చంద్రుడు శివుడి అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. తపస్సుకి మెచ్చిన శివుడి ప్రత్యక్షమై చంద్రుడి శాపం గురించి తెలుసుకుంటాడు. అప్పటికే శాప ప్రభావం ఉండటంతో లోక కళ్యాణం కోసం 15 రోజులకు క్షీణించి తిరిగి 15 రోజులు వెలుగుగా ఉంటావని మహాశివుడు ఆశీర్వదిస్తాడు. అలా పౌర్ణమి, అమావాస్య వచ్చాయని చెప్తారు. శంకరుడు చంద్రుడు భక్తికి మెచ్చి తన తల మీద స్థానం ఇచ్చాడని అంటారు. తల మీద చంద్రుడు ఉండటం వల్ల శివుడిని చంద్రశేఖరుడు అని కూడా పిలుస్తారు.