తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Weather Update Today : వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి.. తెలంగాణ సహా ఈ రాష్ట్రాలకు రెడ్​ అలర్ట్​!

Weather update today : వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి.. తెలంగాణ సహా ఈ రాష్ట్రాలకు రెడ్​ అలర్ట్​!

Sharath Chitturi HT Telugu

27 April 2024, 8:10 IST

google News
    • Telangana heat wave alert : ఏప్రిల్ 30 వరకు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
తెలంగాణకు వడగాల్పుల హెచ్చరికలు..
తెలంగాణకు వడగాల్పుల హెచ్చరికలు..

తెలంగాణకు వడగాల్పుల హెచ్చరికలు..

Telangana heat wave today : భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. బయట అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. భారత వాతావరణశాఖ మరో ఆందోళనకర వార్త చెప్పింది. ఏప్రిల్ 30 వరకు దేశంలోని తూర్పు, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది.

పశ్చిమ్​ బెంగాల్​లోని గంగా నది తీర ప్రాంతం, ఒడిశాతో పాటు కొన్ని రాష్ట్రాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది.

రానున్న నాలుగు రోజుల్లో బీహార్, ఝార్ఖండ్​, తెలంగాణ, రాయలసీమ, ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, తూర్పు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. 26-28 మధ్య కేరళ -మాహే; 2024 ఏప్రిల్ 28-29 తేదీల్లో కొంకణ్, గోవా, 28-30 తేదీల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని హెచ్చరించింది.

ముంబై- థానేలో వడగాల్పులు...

మహారాష్ట్రలోని థానే, రాయ్గఢ్ జిల్లాలు, ముంబైలోని కొన్ని ప్రాంతాలకు ఏప్రిల్ 27 నుంచి 29 వరకు వడగాల్పుల హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. ఏప్రిల్ 27, 28 తేదీల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. గురువారం మహారాష్ట్రలోని జల్గావ్లో 42.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

Telangana heat wave alert : ఇక ఝార్ఖండ్​లోని చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్​కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏప్రిల్ 29 వరకు కొల్హాన్, సంతాల్, ఉత్తర ఛోటానాగ్పూర్ డివిజన్లలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఈ ప్రాంతాల్లో వర్షాలు..

జమ్ముకశ్మీర్-లద్దాఖ్​-గిల్గిట్-బాల్టిస్థాన్-ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్​లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఏప్రిల్ 26-29 వరకు ఉత్తరాఖండ్​లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఏప్రిల్ 27-29 తేదీల్లో ఈ ప్రాంతాల్లో, 2024 ఏప్రిల్ 29న హిమాచల్ ప్రదేశ్​లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

26-28 వరకు పంజాబ్, హర్యానా-చండీగఢ్-ఢిల్లీలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

AP heat wave alert : ఏప్రిల్ 27న మధ్యప్రదేశ్, మరాఠ్వాడా, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్​గఢ్ లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈశాన్య భారతంలో ఏప్రిల్ 28న సిక్కింలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు.. ఏప్రిల్ 28, 30 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

హిమాచల్ ప్రదేశ్ లో 26 నుంచి 28 వరకు, ఉత్తరాఖండ్ లో ఏప్రిల్ 28, 29 తేదీల్లో, పంజాబ్, హర్యానా, పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్ లలో ఏప్రిల్ 27న వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఏపీలో భానుడి భగభగలు..

Hyderabad heat wave alert : ఏపీలో భానుడి భగభగలు ఎక్కువగా ఉన్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగతుండటంతో…జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవాళ ఏపీలోని 64 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 183 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. రేపు 49 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 88 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించింది. ఇవాళ శ్రీకాకుళం 15 , విజయనగరం 22 , పార్వతీపురంమన్యం 13 , అల్లూరిసీతారామరాజు 3, అనకాపల్లి 6, తూర్పుగోదావరి 2, ఏలూరు 2 కాకినాడ ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం