Uber horror: ‘‘ఇప్పుడు నిన్ను రేప్ చేస్తే, మీ అమ్మ వచ్చి కాపాడుతుందా?’’- యువతిపై ఉబర్ డ్రైవర్ దౌర్జన్యం
26 October 2024, 18:31 IST
Uber horror: దేశ రాజధాని ఢిల్లీలో రాత్రి 10 దాటిన తరువాత డిన్నర్ ముగించుకుని ఉబర్ ట్యాక్సీలో ఇంటికి వెళ్తున్న ఒక యువతికి భయంకరమైన అనుభవం ఎదురైంది. ఆ ఉబర్ ట్యాక్సీ డ్రైవర్ ఆమెతో అనుచితంగా మాట్లాడడమే కాకుండా, అత్యాచార బెదిరింపులకు పాల్పడ్డాడు. దీని గురించి ఆ 24 ఏళ్ల మహిళ రెడిట్ పోస్ట్ లో వివరించింది.
యువతిపై ఉబర్ డ్రైవర్ దౌర్జన్యం
Uber horror: దేశ రాజధాని ఢిల్లీలో ఉబర్ డ్రైవర్ తో ఓ మహిళకు ఎదురైన చేదు అనుభవం భారత్ లో ముఖ్యంగా క్యాబ్ లలో మహిళల భద్రత సమస్యను మరోసారి ఎత్తిచూపింది. ఢిల్లీ (delhi)లో రాత్రి ఒంటరిగా ఉబర్ క్యాబ్ లో వెళ్తుండగా.. ఆ క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేస్తానంటూ బెదిరించిన విషయాన్నిఆ 24 ఏళ్ల మహిళ రెడ్డిట్ పోస్ట్ లో పంచుకుంది. అయితే, ఢిల్లీలో ఉబర్ డ్రైవర్ల దౌర్జన్యాన్ని ఎదుర్కొన్నది ఆ యువతి ఒక్కరే కాదని, ఆమె పోస్ట్ కు వచ్చిన కామెంట్లను చదివితే తెలుస్తుంది. తాము కూడా అలాంటి అనుభవాలను ఎదుర్కొన్నామని ఎంతోమంది మహిళలు కామెంట్ చేశారు.
మెట్రోకు వెళ్లే వీలులేక…
తాను దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో నివసిస్తున్నానని, రాత్రి సమయాల్లో మెట్రోలో వెళ్లడానికి వీలు కాదని, అందువల్ల సాధారణంగా ఉబర్ లేదా ఓలా ట్యాక్సీలను ఉపయోగించుకుంటానని ఆ యువతి తెలిపింది. అయితే శుక్రవారం రాత్రి 10.30 గంటలకు డిన్నర్ ముగించుకుని తిరిగి ఉబెర్ క్యాబ్ ద్వారా వస్తుండగా రియర్ వ్యూ అద్దం నుంచి క్యాబ్ డ్రైవర్ తనను పదేపదే చూస్తుండటం తాను గమనించానని ఆమె తెలిపింది. చూడడమే కాకుండా, తనతో మాట్లాడడం ప్రారంభించాడని వెల్లడించింది.
ఇంత రాత్రి వరకు ఏం పని?
ఇంత రాత్రివరకు ఏం చేస్తున్నావని క్యాబ్ డ్రైవర్ తనను అడిగాడని ఆ మహిళ తెలిపింది. ‘‘నువ్వు మగవాడివి అయివుంటే నేను నిన్ను అస్సలు నా టాక్సీలో ఎక్కనిచ్చేవాడిని కాదు’’ అన్నాడని తెలిపింది. అంతేకాకుండా, మహిళలు ఒంటరిగా ప్రయాణించకూడదని, ముఖ్యంగా ఇలా ఇంత ఆలస్యంగా బయటకు రాకూడదని సలహా ఇచ్చాడు. ‘‘ఎందుకంటే మీరు రేప్ కు గురైతే, మమ్మల్నే అంటారు’’ అంటూ మాట్లాడసాగాడని ఆ యువతి తెలిపింది.
లొకేషన్ ట్రాకింగ్
ముందు జాగ్రత్తగా, ఆ యువతి తన రైడ్ లైవ్ లొకేషన్ ను తన తల్లికి షేర్ చేసింది. ‘‘అయితే, ఆ తర్వాత డ్రైవర్ అన్న మాటలే నన్ను షాక్ కు గురిచేశాయి’’ అని ఆమె తెలిపింది. ‘‘ఐదు నిమిషాల్లో నేను నిన్ను ఏదైనా చేస్తే, రేప్ చేస్తే, మీ అమ్మ వచ్చి నీకు సహాయం చేస్తుందని అనుకుంటున్నావా?’’ అని ఆ డ్రైవర్ అన్నాడని ఆ యువతి తెలిపింది. తను తన తల్లికి లొకేషన్ షేర్ చేయడాన్ని గమనించి, అతడు ఈ మాటలు అని ఉంటాడని అనుకున్నానని తెలిపింది. అదృష్టవశాత్తు ఆ మహిళ సురక్షితంగా ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని ఉబర్ (uber) కస్టమర్ కేర్ సర్వీసెస్ కు తెలియజేసింది.
2014 లో యువతిపై అత్యాచారం
2014 డిసెంబర్ లో గురుగ్రామ్ లో రాత్రి 9 గంటల సమయంలో స్నేహితులతో కలిసి డిన్నర్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఢిల్లీలో 27 ఏళ్ల మహిళపై ఉబెర్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో దేశ రాజధానిలో ఓలా, ఉబర్ క్యాబ్ అగ్రిగేటర్లపై నిషేధం విధించారు.