తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Arvind Kejriwal Bail : దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో అరవింద్​ కేజ్రీవాల్​కి బెయిల్​.. కానీ!

Arvind Kejriwal bail : దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో అరవింద్​ కేజ్రీవాల్​కి బెయిల్​.. కానీ!

Sharath Chitturi HT Telugu

13 September 2024, 11:27 IST

google News
  • Arvind Kejriwal bail : దిల్లీ లిక్కర్ స్కామ్​​ కేసులో అరవింద్​ కేజ్రీవాల్​కి సుప్రీంకోర్టు బెయిల్​ ఇచ్చింది. దాదాపు 6 నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.

అరవింద్ కేజ్రీవాల్
అరవింద్ కేజ్రీవాల్

అరవింద్ కేజ్రీవాల్

దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో సీఎం అరవింద్​ కేజ్రీవాల్​కి భారీ ఊరట! సీబీఐ అరెస్ట్​కి వ్యతిరేకంగా ఆయన పిటిషన్​ దాఖలు చేయగా తాజాగా సుప్రీంకోర్టు కేజ్రీవాల్​కి బెయిల్​ని మంజూరు చేసింది. ఫలితంగా దాదాపు 6 నెలల తర్వాత దిల్లీ సీఎం జైలు నుంచి బయటకురానున్నారు. దిల్లీ లిక్కర్​ స్కామ్​పై ఈడీ దాఖలు చేసిన కేసులో కేజ్రీవాల్​కి ఇప్పటికే బెయిల్​ లభించింది.

అయితే.. బెయిల్​ మంజూరు చేసినప్పటికీ, అరవింద్​ కేజ్రీవాల్​పై సర్వోన్నత న్యాయస్థానం పలు ఆంక్షలు విధించింది. ఆయన సీఎం కార్యాలయానికి, సెక్రటేరియట్​కి వెళ్లకూడదని, లెఫ్టినెంట్​ గవర్నర్​ వీకే సక్సేనా అనుమతి లేకుండా ఏ ఫైల్​పై సంతకం చేయకూడదని స్పష్టం చేసింది. బెయిల్​ బాండ్​ కింద రూ. 50వేలు చెల్లించాలని పేర్కొంది. దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసుపై ఎలాంటి స్టేట్​మెంట్స్​ ఇవ్వకూడదని, సాక్షులను కలిసేందుకు ప్రయత్నించకూడదని కేజ్రీవాల్​కి ఆదేశాలిచ్చింది.

కేజ్రీవాల్​ పిటిషన్​పై విచారణ ముగించిన అనంతరం ఈ నెల 5న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్​లో పెట్టింది. తాజాగా దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో బెయిల్​ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. దీనితో పాటు జస్టిస్​ ఉజ్జల్​ భుయాన్​, జస్టిస సూర్య కాంత్​లతో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

"ప్రాసిక్యూషన్​, ట్రైల్​ ప్రాసెస్​ అనేది ఒక పెద్ద శిక్షగా మారకూడదు. ఈ విషయాన్ని అన్ని కోర్టులు పాటించాలి," అని జస్టిస్​ ఉజ్జల్​ భుయాన్​ అన్నారు. అంతేకాదు కేజ్రీవాల్​ని సీబీఐ అరెస్ట్​ చేసిన విధానం, టైమింగ్​ని కూడా ఆయన ప్రశ్నించారు. ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో కేజ్రీవాల్​కు బెయిల్ మంజూరును నిరుత్సాహపరిచేందుకే సీబీఐ అరెస్టు చేసి ఉండొచ్చని ఆయన అన్నారు. సహాయ నిరాకరణ అంటే నేరాన్ని అంగీకరిస్తున్నట్టు కాదని, అందువల్ల కేజ్రీవాల్​ని సీబీఐ అరెస్టు చేయడం సరికాదన్నారు. సీబీఐకి 'బంధిచిన చిలుక'గా ఉన్న ముద్రను తొలగించుకోవాలని సూచించింది.

సీబీఐ అరెస్ట్​ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్​ తొలుత దిల్లీ కోర్టుకు వెళ్లారు. కానీ సీబీఐ అరెస్ట్​ సరైనదే అని కోర్టు పేర్కొంది. ఫలితంగా ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్​ వేశారు.

ఏడాది కాలంగా ఈ లిక్కర్​ స్కామ్​ వార్తల్లో ఉంది. పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలను ఈడీ, సీబీఐలు అరెస్ట్​ చేశాయి. కాగా ఇటీవలి కాలంలో ఈ లిక్కర్​ స్కామ్​లో అరెస్ట్​ అయిన వారికి బెయిల్​ లభిస్తోంది. బీఆర్​ఎస్​ అధ్యక్షుడు కేసీఆర్​ కుమార్తె కవిత సహా ఈ కేసులో అరెస్ట్​ అయిన వారు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.

తదుపరి వ్యాసం