తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Liquor Policy Case: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవితల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

liquor policy case: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవితల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

HT Telugu Desk HT Telugu

23 April 2024, 15:19 IST

google News
  • Delhi liquor policy case: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత కవిత ల జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ లోని రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. ఈ కేసులో వీరిపై ఈడీ, సీబీఐ వేర్వేరుగా కేసులు నమోదు చేసింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

Delhi liquor policy case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నాయకురాలు కె కవితల జ్యూడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. గోవా ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఫండ్ మేనేజర్ గా ఉన్న చన్ప్రీత్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీని కూడా మే 7వ తేదీ వరకు పొడిగించింది.

వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా..

ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi liquor policy case)కి సంబంధించి జరిగిన అవకతవకలపై సీబీఐ నమోదు చేసిన కేసులో కూడా కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు మే 7 వరకు పొడిగించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ ఫండ్ మేనేజర్ చన్ప్రీత్ సింగ్ లను వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. తన భార్య సునీతా కేజ్రీవాల్ సమక్షంలో ప్రతిరోజూ 15 నిమిషాల పాటు వైద్యుడితో సంప్రదింపులు జరిపేందుకు అనుమతించాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిన మరుసటి రోజే కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

కేజ్రీవాల్ ఆరోగ్యంపై..

కేజ్రీవాల్ కు అవసరమైన వైద్య చికిత్స అందించాలని, అవసరమైతే, ఎయిమ్స్ వైద్యులతో కూడిన మెడికల్ బోర్డ్ ను సంప్రదించాలని, ఆ మెడికల్ బోర్డ్ లో ఒక సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, డయాబెటాలజిస్ట్ ఉండేలా చూడాలని ఢిల్లీ కోర్టు తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. సోమవారం సాయంత్రం కేజ్రీవాల్ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో తక్కువ మోతాదులో ఇన్సులిన్ ఇచ్చినట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు. ఎయిమ్స్ వైద్యుల సలహా మేరకు కేజ్రీవాల్ కు సోమవారం సాయంత్రం రెండు యూనిట్ల తక్కువ మోతాదులో ఇన్సులిన్ ఇచ్చినట్లు తీహార్ అధికారి ఒకరు తెలిపారు.

తీహార్ జైలులో..

ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi liquor policy case) కేసులో మార్చి 21న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate - ED) కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది. ఆ లిక్కర్ పాలసీని ఆ తరువాత రద్దు చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసిన తర్వాత తీహార్ జైలులో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ కవితను సీబీఐ కూడా అరెస్టు చేసింది. మరోవైపు, 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం నిధులను ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎక్సైజ్ విధానంలో లంచాల ద్వారా సేకరించినట్లు ఈడీ ఆరోపిస్తోంది.

తదుపరి వ్యాసం