Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ లో సంచలనం, అప్రూవర్ గా మారిన వైసీపీ ఎంపీ మాగుంట
Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం జరిగింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్ గా మారారు. ఆయన ఇచ్చిన కీలక సమాచారం ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.
Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్ లో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్‌గా మారారు. ఈ కేసులో ఇప్పటికే ఎంపీ మాగుంట కుమారుడు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. తాజాగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్ మారడంతో... ఆయన నుంచి ఈడీ కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వారిలో సౌత్ గ్రూపునకు చెందిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. అప్రూవర్ గా మారిన మాగుంట రాఘవరెడ్డి,శరత్ చంద్రా రెడ్డికి బెయిల్ లభించింది. అయితే రాఘవరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ మరికొందరిని ఈ స్కామ్ లో ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి దిల్లీకి నగదు ఎలా తరలించారో ఈడీ దృష్టి పెట్టింది. ఈ స్కామ్ లో హవాలా వ్యవహారాలు నడిపించిన 20 మందిని ఈడీ ప్రశ్నించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబును ఇటీవల ఈడీ మరోసారి ప్రశ్నించింది. ఇటీవల ఈడీ దర్యాప్తు చాలా గోప్యంగా సాగుతోంది. రానున్న రోజుల్లో మరికొంత మందిని ఈడీ ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.
స్పీడ్ పెంచిన ఈడీ
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. దిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణకు సంబంధించి కీలక విషయాలు తెరమీదకు రానున్నాయని దర్యాప్తు సంస్థల అధికారులు అంటున్నారు. తెలంగాణకు చెందిన ఓ కీలక నేతకు దిల్లీలో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తిని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ విచారణంలో ఈడీ కీలక సమాచారం రాబట్టినట్టి తెలిసింది. హైదరాబాద్ నుంచి అక్రమంగా నగదు బదిలీల వ్యవహారాలపై ఈడీ దృష్టి సారించింది. ఈ కేసులో తెలంగాణకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్, ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును మరోసారి ఈడీ విచారణ చేసింది. ఆడిటర్ బుచ్చిబాబును బుధవారం ఉదయం నుంచి సాయంత్రంవరకూ ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసు విచారణలో బుచ్చిబాబు వాంగ్మూలం కీలకంగా మారనుందని తెలుస్తోంది. వచ్చే రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక వ్యక్తులను ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం.
దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి అప్రూవర్లుగా మారడం ఊహించని పరిణామమేనని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకూ అప్రూవర్లుగా మారిన వారిలో ఎక్కువ మంది సౌత్ గ్రూపునకు చెందిన వారే ఉన్నారు. ఈ కేసులో ప్రధానంగా ఉన్న ఇండో స్పిరిట్ కంపెనీలో కీలక భాగస్వామ్యం మాగుంట శ్రీనివాసులురెడ్డి కావడం, అప్రూవర్‌గా మారిన ఆయన ఈడీకి ఏ సమాచారం ఇచ్చారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.