Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ కేసు - కవిత అరెస్ట్ కు కారణాలేంటి..?
Delhi liquor scam case: ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. దాదాపు రెండేళ్లుగా కవిత పేరు వినిపిస్తుండగా… తాజాగా ఆమెను అరెస్ట్ చేసింది ఈడీ.
Delhi liquor scam case: ఢిల్లీ లిక్కర్ కేసు…. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సోసిడియాతో పాటు మరికొందరు కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖు పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇందులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత (MLC Kavitha)పేరు తెరపైకి వచ్చింది. సౌత్ గ్రూప్ ను లీడ్ చేయటంలో కవిత కీలకంగా వ్యవహరించారంటూ ఆమె పాత్రకు సంబంధించి పలు విషయాలను వెల్లడించాయి దర్యాప్తు సంస్థలు. రెండేళ్లకుపైగా కవిత చుట్టూ తిరుగుతున్న ఈ కేసులో… ఈడీ మరో అడుగు ముందుకేసింది. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది. దీంతో కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు అయింది.
What is Delhi liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసు ఏంటి…?
- 2021లో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ(Delhi Liquor)లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.
- మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు ధారదత్తం చేస్తూ.. ఢిల్లీ ప్రభుత్వం పాలసీని మార్చినట్లు నాటి ఢిల్లీ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ నరేశ్ కుమార్ గుర్తించారు.
- ఈ స్కామ్ కు సంబధించి సమగ్రమైన నివేదిక రూపొందించి లెఫ్టినెంట్ గవర్నర్ కు అందజేశారు.
- లెఫ్టినెంట్ గవర్నర్ ఇందులోని వాస్తవాలను బయటికి తీసుకురావాలని కోరుతూ 2021 జూలైలో సీబీఐకి(CBI) లేఖ రాశారు.
- సీబీఐ కేసును విచారించగా అనేక విషయాలను బయటపెడుతూ వచ్చింది. మద్యం దుకాణాల కేటాయింపుల్లో నిబంధనలక విరుద్ధంగా పలు కంపెనీలకు కట్టబెట్టినట్లు గుర్తించింది.
- L- 1 కేటాగిరి లైసెన్సులు జారీలో లంచాలు తీసుకోని ఇష్టానుసారంగా అనుమతలు ఇచ్చారనే విషయాలను ప్రస్తావించింది.
- మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీ పేరు మొదట వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అమిత్ అరోరా, అర్జున్ పాండేలు ముఖ్యంగా కీలక పాత్ర పోషించినట్టుగా గుర్తించారు.
తొలిసారిగా కవిత పేరు…
ఈ కేసులో అమిత్ ఆరోరోనా అరెస్ట్ చేసింది సీబీఐ. అయితే మద్యం పాలసీ రూపకల్పనలో ప్రైవేటు వ్యక్తులు ఉన్నారని విషయాన్ని సీబీఐ గుర్తించింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తొలిసారిగా కవిత పేరును ప్రస్తావించింది సీబీఐ. ఆ తర్వాత ఈ కేసులోకి ఈడీ(ED) కూడా ఎంట్రీ ఇచ్చింది. వంద కోట్ల రూపాయల ముడుపులను సౌత్ గ్రూప్(South Group) చెల్లించినట్లు సీబీఐ తేల్చింది. సౌత్ గ్రూప్ ను నియంత్రించింది శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట అని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్లను విజయ్ నాయర్ కు చేర్చినట్టుగా ఈడీ(ED) వెల్లడించింది. 36 మంది రూ.1.38 కోట్ల విలువైన 170 మెుబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపింది. వీటిలో కవిత రెండు నెంబర్లు, పది మెుబైల్ ఫోన్ల్(Mobile Phones) వాటినట్టుగా పేర్కొంది. కవిత వాడిన పది ఫోన్లు ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చినట్టుగా ఈడీ తెలుసుకుంది. ఇదే విషయాన్ని అరోరా కూడా అంగీకరించారని తెలిపింది. వైసీపీ ఎంపీ(YSRCP MP) మాగుంట శ్రీనివాసులరెడ్డి సమన్వయపరిచారని పేర్కొంది. ఇందు కోసం.. ప్రత్యేకంగా ఫోన్స్ ఉపయోగించారని, వాటిని మార్చారని, ధ్వంసం చేశారని ఈడీ ప్రస్తావించింది. సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు చెల్లించిన వారిలో.. అరబిందో శరత్ రెడ్డి(Sarath Reddy)తో పాటు కవిత పేరును ఈడీ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. సౌత్ గ్రూప్ లో కీలకంగా ఉన్నట్లు గుర్తించిన వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై మరియు అభిషేక్ బోయిన్‌పల్లి మరియు చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబును అదుపులోకి తీసుకుని విచారించింది ఈడీ. వీరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది.
కవిత విచారణ…
ఈ కేసులో కవిత పాత్ర ఉన్నట్లు గుర్తించిన ఈడీ, సీబీఐ పలుమార్లు నోటీసులను జారీ చేసింది. విచారణకు రావాలని ఆదేశించింది. 2022 డిసెంబర్ లో హైదరాబాద్ లో ని కవిత నివాసానికి వచ్చిన సీబీఐ అధికారులు… కవితను విచారించారు. దాదాపు 7 గంటలపాటు కవితను విచారించారు. సౌత్ గ్రూప్ కంట్రోలర్ గా మీరు ఉన్నారా?మీరు ఫోన్లు మార్చారా?సౌత్ గ్రూప్ గురించి మీకు తెలుసా? అందులో మీ పాత్ర ఉందా? వంటి పలు ప్రశ్నలను సీబీఐ సంధించినట్లు తెలిసింది. ఆ తర్వాత ఈడీ నుంచి కూడా నోటీసులు వచ్చాయి. స్వయంగా ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారణకు కూడా హాజరయ్యారు కవిత. ఈ సమయంలోనే కవితను అరెస్ట్ చేస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ అరెస్ట్ కాలేదు.
ఇదిలా ఉండగానే ఈ కేసులోని నిందితులుగా ఉన్న పలువురు అప్రూవర్లుగా మారారు. దీంతో దర్యాప్తు సంస్థలకు కీలక సమాచారం అందింది. దీని ఆధారంగా దూకుడు పెంచే పనిలో పడ్డాయి సీబీఐ, ఈడీ. ఈ సమాచారం ఆధారంగానే కవితకు ఇటీవలే కూడా నోటీసులు పంపాయి. అంతేకాదు కేసులో సాక్షిగా ఉన్న కవితను నిందితురాలిగా కూడా పేర్కొంది సీబీఐ. 41 సీఆర్పీసీ కింద నోటీసులు కూడా ఇచ్చింది. కానీ సీబీఐ విచారణకు హాజరుకాలేదు కవిత.
మరోవైపు గతేడాదే ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. దీంతో లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ ఈ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు… తుది ఆదేశాలు వచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు కొద్ది నెలలుగా వాదనలు కొనసాగుతున్నాయి. తాజాగా విచారించిన కోర్టు…. కవిత పిటిషన్ పై మార్చి 19వ తేదీకి విచారణ వాయిదా పడింది. ఇదిలా ఉండగానే…. ఈడీ అధికారులు….. కవితను మార్చి 15వ తేదీన అరెస్ట్ చేశారు. మార్చి 16వ తేదీ ఢిల్లీలెని రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఆ తర్వాత కస్టడీకి కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.