Mlc Kavitha Released : తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల, కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగం
Mlc Kavitha Released : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత దిల్లీ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. దిల్లీ లిక్కర్ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆమె జైలు నుంచి విడుదలయ్యారు.
Mlc Kavitha Released : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైలు నుంచి మంగళవారం రాత్రి విడుదలయ్యారు. దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీహార్ జైలు నుంచి విడుదలైన కవితకు కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు రాగానే కొడుకు, భర్తను చూసి కవిత భావోద్వేగానికి లోనయ్యారు.
రేపు హైదరాబాద్ కు
తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత మంగళవారం రాత్రి 9.12 గంటలకు విడుదల అయ్యారు. జైలు నుంచి బయటకు రాగానే అక్కడే ఉన్న కొడుకు, భర్తను ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. అన్నయ్య కేటీఆర్‌ను గుండెలకు హత్తుకున్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన కవిత 165 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ సుప్రీంకోర్టు ఇవాళ కవితకు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కవిత బెయిల్ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించారు. బుధవారం ట్రయల్ కోర్టులో విచారణకు హాజరైన అనంతరం మధ్యాహ్నం 2:45 గంటలకు దిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు.
కేసీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు -కవిత
జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. మేం పోరాట యోధులమని, న్యాయపరంగా, రాజకీయంగా పోరాడుతామన్నారు. తనకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. దాదాపు 5 నెలల తర్వాత ఇవాళ నా కొడుకు, అన్న, భర్తను కలిసిన తర్వాత ఉద్వేగానికి లోనయ్యానన్నారు. ఈ పరిస్థితికి రాజకీయాలే కారణమన్నారు. నన్ను జైలులో పెట్టడం వల్ల ఇంకా జగమొండిగా మారానన్నారు. తానుఎలాంటి తప్పు చేయలేదన్నారు. తన పోరాటం కొనసాగుతోందన్నారు.
'నేను కేసీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదని' ఎమ్మెల్సీ కవిత అన్నారు. తనను అనవసరంగా జైలులో పెట్టి జగమొండిగా చేశారన్నారు. తన 18 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నోఎత్తుపల్లాలు చూశానన్నారు. తన పిల్లలను వదిలి ఐదున్నర నెలలు జైల్లో ఉండడం ఇబ్బందికర విషయం అన్నారు. ఇలాంటి ఇబ్బందులకు గురిచేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. మాకు సమయం వస్తుందని, తప్పకుండా తిరిగి చెల్లిస్తామన్నారు. ఇలాంటి కష్ట సమయంలో తనకు, తన కుటుంబానికి తోడుగా ఉన్నవారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నానన్నారు.
కవితకు సుప్రీంకోర్టు బెయిల్
దిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కవిత బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనల తర్వాత సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఐదు నెలలుగా ఎమ్మెల్సీ కవిత లిక్కర్ పాలసీ కేసులో జైల్లో ఉన్నారు. దిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కవిత బెయిల్ పిటిషన్ గతంలో పలుమార్లు తిరస్కరణకు గురైంది. దిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఛార్జిషీట్లు దాఖలైనందున కవిత బెయిల్ పొందడానికి అర్హురాలని కవిత తరపు న్యాయవాదులు వాదించారు. మరోవైపు కవిత సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారని, దాదాపు 16 మొబైల్ ఫోన్లను కవిత ధ్వంసం చేశారని సీబీఐ, ఈడీ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది.