Adani-Hindenburg case : అదానీ కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
03 January 2024, 11:47 IST
- Adani-Hindenburg case supreme court : అదానీ కేసులో సిట్ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఈ మేరకు కీలక తీర్పును వెలువరించింది.
అదానీ కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
Adani-Hindenburg case supreme court : అదానీ హిండెన్‌బర్గ్ కేసులో సెబీ చేపట్టిన దర్యాప్తును సిట్‌కు బదిలీ చేయాల్సిన అవసరం లేదని కీలక తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. ట్రాన్స్ఫర్ చేయాలన్న వాదనలను బలపరిచేందుకు తమకు ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది. జార్జ్ సోరోస్ నేతృత్వంలోని ఓసీసీఆర్పీ రిపోర్టు ఆధారంగా.. అదానీ కేసు వ్యవహారంలో సెబీ జరుపుతున్న దర్యాప్తును సందేహించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో గౌతమ్ అదానీ గ్రూప్‌నకు భారీ విజయం సాధించినట్టు అయ్యింది.
అదానీ కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్‌లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, స్టాక్ ప్రైజ్‌ని మేనిప్యులేట్ చేస్తున్నారని గతేడాది.. హిండెన్‌బర్గ్ అనే విదేశీ సంస్థ సంచలన నివేదికను బయటపెట్టింది. ఈ వార్త అప్పట్లో భారత స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. అదానీ గ్రూప్‌నకు చెందిన అన్ని స్టాక్స్ పతనమయ్యాయి. భారత రాజకీయాలపైనా ఈ హిండెన్‌బర్గ్ నివేదిక ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలో అదానీ- హిండెన్‌బర్గ్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని దాదాపు 10 నెలలుగా విచారిస్తోంది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో.. అదానీ కేసుపై సెబీ చేపడుతున్న దర్యాప్తును సిట్‌కు బదిలీ చేయాలని దాఖలైన పిటీషన్లపై బుధవారం కీలక తీర్పును వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం.
Supreme court Adani judgement : "22 అంశాల్లోని 20 వాటిపై సెబీ దర్యాప్తును పూర్తి చేసింది. మిగిలిన రండు అంశాల దర్యాప్తును మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశిస్తున్నాము. అసాధారణమైన పరిస్థితుల్లోనే కేసు దర్యాప్తును బదిలీ చేయడంపై ఆలోచించాలి. న్యూస్ పేపర్లలో వస్తున్న వార్తలను పట్టించుకుని సెబీ దర్యాప్తును సందేహించలేము. వార్తలను ఇన్పుట్స్లా పరిగణించవచ్చు కానీ.. దర్యాప్తు సరిగ్గా జరగడం లేదనేందుకు అవి ఆధారాలు అవ్వలేవు," అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అయితే.. భారత మదుపర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఏవైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే.. వాటిని కచ్చితంగా అమలు చేసేందుకు కృషిచేయాలని సెబీ, ప్రభుత్వానికి సూచించింది సుప్రీంకోర్టు.
'నిజం గెలిచింది..'
Supreme court Adani case latest news : సుప్రీంకోర్టు తీర్పుపై గౌతమ్ అదానీ స్పందించారు. నిజం గెలిచిందంటూ ట్వీట్ చేశారు.
"నిజం గెలిచింది. సత్యమేవజయతే! సుప్రీంకోర్టు తీర్పు ఇందుకు నిదర్శనం. ఈ విషయంలో మాకు తోడుగా నిలబడిన వారికి ధన్యవాదాలు. దేశాభివృద్ధికి మేము చేస్తున్న కృషి కొనసాగుతుంది. జై హింద్!" అని ట్వీట్ చేశారు గౌతమ్ అదానీ.