Adani IANS : ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్లో మెజారిటీ వాటాను కొనేసిన అదానీ..!
16 December 2023, 11:17 IST
- Adani IANS latest news : ఐఏఎన్ఎస్ ఇండియా న్యూస్ ఏజెన్సీలో మెజారిటీ వాటాను కొన్నారు గౌతమ్ అదానీ. ఫలితంగా.. ఇప్పుడు మరో న్యూస్ ఏజెన్సీ, అదానీ వ్యాపారంలోకి చేరింది.
ప్రముఖ న్యూస్ ఏజెన్సీలో మెజారిటీ వాటాను కొనేసిన అదానీ..!
Adani IANS news agency : ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ (ఇండో- ఆసియా న్యూస్ సర్వీస్) ఇండియాలో మెజారిటీ వాటాను కొనేసింది అదానీ గ్రూప్. ఈ గ్రూప్‌నకు చెందిన ఏఎంజీ మీడియా నెట్వర్క్స్కు ఇప్పుడు.. ఐఏఎన్ఎస్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 50.5శాతం వాటా ఉంది. ఈ డీల్‌తో న్యూస్ ఏజెన్సీకి చెందిన ఈక్విటీ షేర్లు, ఓటింగ్ రైట్స్ వంటివి అదానీ గ్రూప్ చేతికి వచ్చాయి.
2023 ఆర్థిక ఏడాదిలో ఐఏఎన్ఎస్ షేర్ క్యాపిటల్ రూ. 20లక్షలుగా ఉంది. కంపెనీ ఆదాయం రూ. 11.86కోట్లుగా నమోదైంది. వ్యూహత్మక చర్యల్లో భాగంగా.. ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీలో వాటా కొన్నట్టు ఆదానీ గ్రూప్‌నకు చెందిన ఏఎంజీ మీడియా పేర్కొంది.
"వాటా కొనుగోలు తర్వాత.. ఐఏఎన్ఎస్ సంస్థ.. ఏఎంఎన్ఎల్లో సబ్సిడరీగా ఉంటుంది. ఈ మేరకు ఐఏఎన్ఎస్ షేర్‌హోల్డర్ సందీప్ బామ్జాతో కూడా ఒప్పందం కుదిరింది," అని ప్రముఖ వార్త సంస్థ నివేదికలో పేర్కొంది.
ఎన్డీటీవీ కూడా..!
ఇటీవలి కాలంలో మీడియా సంస్థలపై ఫోకస్ చేసింది అదానీ గ్రూప్. ఒక్కొక్క మీడియా సంస్థను తన వ్యాపారంలో కలుపుకుంటోంది. ముఖ్యంగా ఎన్డీటీవీ కూడా ఇప్పుడు అదానీ గ్రూప్ సబ్సిడరీగా ఉంది. ఎన్డీటీవీ ప్రొమోటర్, ఫౌండర్స్ ప్రణయ్ రాయ్, రాధిక రాయ్‌లకు చెందిన 27.26శాతం వాటాని రూ. 602 కోట్లకు కొనడంతో ఆ సంస్థలో గౌతమ్ అదానీ పెరిగింది.
ఎన్డీటీవీ వ్యవస్థాపకుల వద్ద ఉన్న ఓ కంపెనీని తొలుత కొనుగోలు చేశారు గౌతమ్ అదానీ. ఆ తర్వాత ఓపెన్ మార్కెట్లో భారీ మొత్తంలో ఎన్డీటీవీ షేర్లు కొనుగోలు చేశారు. అప్పటికే ఎన్డీటీవీలో ఆయన వాటా 37శాతానికి చేరింది. ఇక ఆ తర్వాత ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఎన్డీటీవీ వ్యవస్థాపకులు తమ వాటాను విక్రయించేందుకు సిద్ధపడ్డారు.