తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cyber Crime: ఫేస్ బుక్ ఫ్రెండ్ చేసిన మోసంతో రూ. 8 లక్షలు మోసపోయిన మహిళా టీచర్

Cyber crime: ఫేస్ బుక్ ఫ్రెండ్ చేసిన మోసంతో రూ. 8 లక్షలు మోసపోయిన మహిళా టీచర్

HT Telugu Desk HT Telugu

15 June 2024, 21:19 IST

google News
  • ఒక మహిళా ఉపాధ్యాయురాలికి ఫేస్ బుక్ లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. పంపించిందెవరో తెలియకుండానే, ఆ మహిళా టీచర్ ఆ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసింది. క్రమంగా వారి మధ్య చాటింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆ తరువాత కాల్స్ ప్రారంభమయ్యాయి. చివరకు, ఆ టీచర్ ను ఆ ఫేస్ బుక్ ఫ్రెండ్ రూ. 8 లక్షలకు మోసం చేశాడు.

రూ. 8 లక్షలు మోసం చేసిన ఫేస్ బుక్ ఫ్రెండ్
రూ. 8 లక్షలు మోసం చేసిన ఫేస్ బుక్ ఫ్రెండ్ (Pexels)

రూ. 8 లక్షలు మోసం చేసిన ఫేస్ బుక్ ఫ్రెండ్

Cyber crime: సైబర్ క్రిమినల్స్ వినూత్న విధానాలతో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా, పార్శిల్ మోసాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఒక 68 ఏళ్ల ఉపాధ్యాయురాలు ఈ పార్శిల్ మోసం బారిన పడింది. తాను మోసపోయానని తెలుసుకునేటప్పటికే.. మోసగాళ్లు ఆమె నుంచి రూ. 8 లక్షలు కొట్టేశారు.

పైలట్ ను అని చెప్పి..

ఆ మహిళా ఉపాధ్యాయురాలికి ఫేస్ బుక్ లో దేవ్ పటేల్ అనే వ్యక్తి నుంచి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. పంపిన వ్యక్తి పరిచయం లేకపోయినా, ఆ మహిళా టీచర్ ఆ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసింది. ఆ తరువాత వారి మధ్య చాటింగ్ ప్రారంభమైంది. తాను బ్రిటిష్ ఎయిర్ వేస్ లో పైలట్ గా పని చేస్తున్నానని, దుబాయ్ లో ఉంటానని ఆ ఫేస్ బుక్ ఫ్రెండ్ ఆమెకు చెప్పాడు. కొన్నిరోజుల చాటింగ్ తరువాత, ఆ వ్యక్తి ఆమెకు గిఫ్ట్ పంపించినట్లు చెప్పాడు. ఆ తరువాత, కొన్ని రోజులకు ఆమెకు మరో ఫోన్ కాల్ వచ్చింది. తను ‘ఢిల్లీ కస్టమ్స్ కు చెందిన దీక్షితా అరోరా’ అని ఆ మహిళ పరిచయం చేసుకుంది. దుబాయ్ నుంచి ఒక పార్శిల్ వచ్చిందని, అయితే దానిని పొందాలంటే రూ.70,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ఆ రిటైర్డ్ టీచర్ కు చెప్పింది. దాంతో ఆ టీచర్ వెంటనే యూపీఐ ద్వారా రూ.70,000 పంపించింది.

బెదిరింపులు ప్రారంభం..

ఆ తరువాత, ఆమెకు మరో కాల్ వచ్చింది. ఆ పార్శిల్ లో 80 బ్రిటీష్ పౌండ్లు ఉన్నాయని, వాటిని అక్రమంగా పంపించారని, అందువల్ల, మరో రూ.2.95 లక్షలు చెల్లించాలని, లేదంటే క్రైమ్ బ్రాంచ్ ఆమెను అరెస్టు చేస్తుందని ఆ టీచర్ ను బెదిరించారు. బెదిరింపులు వస్తుండడంతో భయపడిన ఆ మహిళ పలుమార్లు డబ్బులు చెల్లించింది. ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకు దాదాపు రూ.8.15 లక్షలు ట్రాన్స్ ఫర్ చేసింది. ఆ తరువాత తాను మోసపోయానని అర్థం చేసుకుని పోలీసులను ఆశ్రయించింది. ఈ లోగా, పైలట్ గా నటించిన ఆ ఫేస్ బుక్ స్నేహితుడు ఆమె కాల్స్, మెసేజ్ లకు స్పందించడం మానేశాడు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆన్లైన్ మోసాల నుండి ఇలా రక్షించుకోండి

1. విశ్వసనీయ యాప్ లను మాత్రమే ఉపయోగించండి. సెర్ట్ ఇన్ వారి ఫ్రాడ్ అలర్ట్ (Fraud Alert by CERT-In), ఎన్సీఎస్ఏపీ వారి ఎంసేఫ్ (mSafe by NCSAP) గూగుల్ "యాంటీ-ఫిషింగ్ యాప్ (Google's "Anti-Phishing App) వంటి నమ్మదగిన యాప్స్ ఇన్ స్టాల్ చేయండి. ఈ యాప్స్ రియల్ టైమ్ అలర్ట్స్, సెక్యూరిటీ అడ్వైజరీ, ఫిషింగ్ దాడుల నుంచి రక్షణ కల్పిస్తాయి.

2. వ్యక్తిగత వివరాలను ఆన్ లైన్ లో పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. ఫోన్ నంబర్లు, ఇమెయిల్ చిరునామాలు మరియు బ్యాంక్ ఖాతా సమాచారం, ఓటీపీల వంటి సున్నితమైన డేటాను పరిచయం లేని వారికి ఇవ్వకండి.

3. వ్యక్తిగత డేటాను అభ్యర్థించే ఇమెయిల్స్, సందేశాలను నమ్మకండి. స్కామర్లు తరచుగా సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడానికి ఇలాంటి వ్యూహాలను ఉపయోగిస్తారు.

4. అధికారిక యాప్ స్టోర్స్ నుంచి మాత్రమే యాప్స్ ను డౌన్లోడ్ చేసుకోండి. థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ ల నుండి యాప్ లను డౌన్లోడ్ చేయకండి.

5. ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేస్తుండండి.

6. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఉచిత బహుమతుల ఆఫర్లను విశ్వసించకండి. ఆన్లైన్ చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

తదుపరి వ్యాసం