Warangal Crime : దుబాయ్ వెళ్లడానికి వరుస దొంగతనాలు, 60 చోరీలు చేసిన దొంగ అరెస్ట్
Warangal Crime : ఆ దొంగ లక్ష్యం ఇల్లు కట్టుకోవడం, దుబాయ్ కి వెళ్లడం. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సుమారు 60 చోరీలకు పాల్పడ్డారు. పలుమార్లు జైలుకు వెళ్లివచ్చినా తన బుద్ది మార్చుకోలేదు.
Warangal Crime : సొంతంగా ఇల్లు కట్టుకోవడంతో పాటు దుబాయ్ వెళ్లడానికి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను సీసీఎస్, మట్వాడ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు 22 లక్షల రూపాయల విలువైన 270 గ్రాముల బంగారు అభరణాలతో పాటు రెండు బైకులు, రూ.50 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లి గ్రామానికి చెందిన జింక నాగరాజు ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాలలో నివాసం ఉంటున్నాడు. అక్కడే ద్విచక్ర వాహన మెకానిక్‌గా పనిచేస్తూనే క్రమవిక్రయాలతో వచ్చే అదాయంతో జల్సాలు చేసేవాడు. వచ్చే ఆదాయం జల్సాలకు సరిపోకపోవడంతో పాటు మరింత పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో బైక్ చోరీలకు అలవాటు పడ్డాడు. ఇలా 2011 నుంచి కరీంనగర్, జమ్మికుంట, కామారెడ్డి, సిద్దిపేట, వేములవాడతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు.
జైలు నుంచి వచ్చి మళ్లీ చోరీలు
జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినా నాగరాజు తీరు మారలేదు. అంతేకాకుండా బైక్ చోరీలకు స్వస్తి పలికి తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేశాడు. ఇలా 2016 సంవత్సరం నుంచి 2022 వరకు వరంగల్, జనగామ, సిద్దిపేట, భూపాలపల్లి జిల్లాల్లో మొత్తం 38కి పైగా తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. ఆయా స్టేషన్ల పోలీసులు నిందితుడిని పలుమార్లు అరెస్టు చేసి జైలుకు కూడా తరలించారు.
దుబాయ్ వెళ్లేందుకు దొంగతనాలు
గత సంవత్సరం మార్చి నెలలో జైలు నుంచి విడుదలైన నాగరాజు తన రూట్ మార్చుకున్నాడు. సొంతంగా ఇల్లు కట్టుకోవడంతో పాటు దుబాయికి వెళ్లేందుకు అవసరమైన డబ్బును సంపాదించడమే లక్ష్యంగా మరోసారి చోరీలకు తెగపడ్డాడు. ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధితో పాటు జగిత్యాల, యాదాద్రి జిల్లాల్లో మొత్తం 20 చోరీలకు పాల్పడ్డాడు. ఇందులో మట్టెవాడ, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు చొప్పున ఇంతేజార్‌గంజ్, కేయూసీ, హనుమకొండ, ఐనవోలు, నల్లబెల్లి, జనగామ, బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున దొంగతనాలు చేశాడు. దాంతో పాటు మట్వాడా, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు బైక్ లు చోరీ చేయగా, జగిత్యాలలో నాలుగు చోరీలు, యాదాద్రి జిల్లాలో ఒక చోరీ చేశాడు. బాధితుల నుంచి ఫిర్యాదుల మేరకు వరంగల్ ట్రైనీ ఐపీఎస్ శుభం నాగ్ అధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీలు జరిగిన ప్రదేశాల్లో పోలీసులకు లభించిన అధారాలతో నిందితుడిని గుర్తించారు.
ఆ తర్వాత చోరీ చేసిన బంగారు అభరణాలను అమ్మేందుకు నాగరాజు బైక్ పై వరంగల్ వస్తున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో మట్వాడా, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా ఆర్‌ఎన్‌టి రోడ్డు వద్ద వాహన తనీఖీలు నిర్వహిస్తుండగా అక్కడికి వచ్చిన నిందితుడు నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారించగా నిందితుడు చేసిన చోరీలను అంగీకరించాడు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనభరిచిన ట్రైనీ ఐపీఎస్ శుభం నాగ్‌తో పాటు సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ, అదనపు డీసీపీ రవి, ఇతర సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.
(రిపోర్టర్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం