Urvashi Rautela Birthday Cake: బర్త్‌డేకు రూ.3 కోట్ల విలువైన బంగారు కేక్ కట్ చేసిన హీరోయిన్.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్
Urvashi Rautela Birthday Cake: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఈ మధ్య తన బర్త్ డే సందర్భంగా ఏకంగా రూ.3 కోట్ల విలువైన బంగారు కేక్ కట్ చేయడంపై అభిమానులు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
Urvashi Rautela Birthday Cake: ఊర్వశి రౌతేలా గుర్తుందా? చిరంజీవి, పవన్ కల్యాణ్ లాంటి టాలీవుడ్ స్టార్లతో స్పెషల్ సాంగ్స్ లో మెరిసిన ఈ బాలీవుడ్ బ్యూటీని ఇప్పుడు ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం ఆమె తన బర్త్ డేకు ఏకంగా రూ.3 కోట్ల విలువైన బంగారు కేక్ కట్ చేయడమే. సింగర్ యో యో హనీసింగ్ తో కలిసి ఆమె తన పుట్టినరోజు వేడుకలు చేసుకుంది.
ఊర్వశి రూ.3 కోట్ల కేక్
వాల్తేర్ వీరయ్య మూవీలో బాస్ పార్టీ సాంగ్, బ్రో మూవీలో మై డియర్ మార్కండేయలాంటి సాంగ్స్ లో చిరు, పవన్ లతో ఊర్వశి రౌతేలా నటించిన విషయం తెలుసు కదా. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యే తన బర్త్ డే జరుపుకుంది. సాధారణంగా సెలబ్రిటీల బర్త్ డే పార్టీలంటే చాలా గ్రాండ్ గా జరగడం సహజమే. కానీ ఊర్వశి మాత్రం గ్రాండ్ గా జరుపుకోవడం కాదు.. రూ.3 కోట్ల విలువైన బంగారు కేక్ నే కట్ చేసి అభిమానులు ముక్కున వేలేసుకునేలా చేసింది.
నిజానికి ఇదంతా ఉత్త పుకార్లే కావచ్చని మొదట ఫ్యాన్స్ భావించారు. కానీ తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి కూడా ఆ కేక్ విలువ రూ.3 కోట్లని చెప్పింది. కేక్ పై పూర్తి బంగారు రేకులతో అలంకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ కేక్ కట్ చేసి దానిపై ఉన్న బంగారు రేకులను తాను తిన్నట్లు కూడా ఊర్వశి రౌతేలా చెప్పడం గమనార్హం. ఆ కేకు వీడియో కంటే దాని విలువ నిజమే అని ఊర్వశి చెప్పిన ఇంటర్వ్యూ వీడియో మరింత వైరల్ అయింది.
ఊర్వశిని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్
బర్త్ డే కేక్ మామూలుగా అయితే వందల్లోనో, వేలల్లోనో ఉంటుంది. డబ్బు కాస్త ఎక్కువగా ఉన్న సెలబ్రిటీలు లక్షల్లో పెట్టి తెచ్చుకున్నా ఆశ్చర్యం లేదు. కానీ ఊర్వశి మాత్రం ఏకంగా రూ.3 కోట్ల కేక్ కట్ చేయడంతో ఫ్యాన్స్ ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దేశంలో పేదరికం వీళ్లకు కనిపించదా.. ఒకవేళ కనిపిస్తే.. ఇలా కేక్ కోసం ఇన్ని కోట్లు ఎలా ఖర్చు పెడతావంటూ ఓ యూజర్ ఆమెను నిలదీశాడు.
రూ.3 వేల కేకు కోసం రూ.3 కోట్లు ఖర్చు చేసిందంటే తనంటే తనకు ఎంతిష్టమో అని ఊర్వశిని ఉద్దేశించి మరో అభిమాని కామెంట్ చేశాడు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం.. ఇది తెలివి తక్కువ పని.. దేశంలో ఎంతో మంది ఆకలితో చస్తుంటే.. వీళ్లు ఇలాంటి వాటికోసం ఇంతలా ఖర్చు చేస్తున్నారంటూ ఇంకో యూజర్ చాలా ఘాటుగా స్పందించాడు.
నిజానికి బాలీవుడ్ లో ఊర్వశి రౌతేలా మరీ అంత పెద్ద నటేమీ కాదు. హిందీలో సనమ్ రే, హేట్ స్టోరీ 4లాంటి సినిమాలు చేసింది. అక్కడ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో సౌత్ ఇండస్ట్రీలపై కన్నేసింది. తెలుగులో వాల్తేర్ వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంధలాంటి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేయడంతోపాటు గతేడాది తమిళంలో లెజెండ్ మూవీలో నటించింది.