Warangal Murder: ఆస్తి కోసం వృద్ధుడి దారుణ హత్య! కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు, వరంగల్‌లో ఘోరం-the brutal murder of an old man for property the daughter in law killed her uncle ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Murder: ఆస్తి కోసం వృద్ధుడి దారుణ హత్య! కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు, వరంగల్‌లో ఘోరం

Warangal Murder: ఆస్తి కోసం వృద్ధుడి దారుణ హత్య! కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు, వరంగల్‌లో ఘోరం

HT Telugu Desk HT Telugu
May 20, 2024 06:32 AM IST

Warangal Murder: గ్రేటర్ వరంగల్ పరిధి హసన పర్తిలో ఘోరం జరిగింది. ఆస్తి తగాదాలతో ఓ మహిళ కొడుకులతో కలిసి తన మామనే చంపేసింది. ఆదివారం ఉదయం ఈ ఘటన జరగగా.. హత్య అనంతరం సదరు మహిళతో పాటు ఆమె కొడుకులు కూడా పరారయ్యారు.

వరంగల్‌లో వృద్ధుడి దారుణ హత్య
వరంగల్‌లో వృద్ధుడి దారుణ హత్య

Warangal Murder: వరంగల్‌ జిల్లాలో జరిగిన దారుణ ఘటన అందరిని కలిచి వేసింది. హసన్ పర్తి గ్రామానికి చెందిన జల్లి సారయ్య(80)కు ఒక కొడుకు, కూతురు కాగా.. గతంలోనే ఇద్దరికీ పెండ్లి చేసేశాడు. సారయ్య కొడుకు జల్లి రమేశ్ కిడ్నీ సమస్యల కారణంగా అనారోగ్యానికి గురై దాదాపు తొమ్మిది ఏళ్ల కిందట చనిపోయాడు. అప్పటి నుంచి రమేశ్ భార్య జల్లి రమాదేవి, ఆమె కొడుకులు జల్లి సాయికృష్ణ, శశి కుమార్ తో కలిసి అత్తగారైన సారయ్య ఇంట్లోనే ఉంటోంది.

ఇంత వరకు బాగానే ఉండగా.. రమేశ్ చనిపోయిన తరువాత వాళ్లింట్లో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. దీంతో ఇరువర్గాల మధ్య మనస్పర్థలు తలెత్తి తరచూ గొడవ పడుతుండేవారు. ఓ వైపు ఆస్తి విషయంలో గొడవలు జరుగుతుండగా.. ఒకే ఇంట్లో ఉంటుండటంతో ఇంటి నల్లా విషయంలోనూ ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదం జరిగేది.

హత్య చేసి, పరారీ…

జల్లి రమాదేవి తన మామ అయిన జల్లి సారయ్యతో తరచూ ఆస్తి విషయంలో గొడవ పడుతుండేది. ఈ క్రమంలోనే పలుమార్లు ఇదే విషయమై పంచాయితీలు కూడా జరిగాయి. కాగా ఆదివారం ఉదయం నల్లా నీళ్లు పట్టుకునే విషయంలో ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరగగా.. రమాదేవి తీవ్ర కోపానికి గురైంది. అప్పటికే వృద్ధాప్యంతో సారయ్య మంచాన పడి ఉండగా.. ఆయనతో గొడవ పడింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరగగా, సారయ్యపై రమాదేవి దాడికి దిగింది.

తన కొడుకులైన జల్లి సాయి కృష్ణ, శశి కుమార్ పక్కనే ఉండగా.. రమాదేవి తన మామ సారయ్యతో గొడవ పడి ఆయనను కదలకుండా గట్టిగా పట్టుకుంది. అదే క్రమంలో సాయి కృష్ణ, శశి కుమార్ ఇద్దరూ కలిసి సారయ్య వాకర్ స్టాండ్ తో ఆయనపైనే దాడికి దిగారు. దీంతో తల, కుడి చేతిపై తీవ్ర గాయాలు కావడంతో రక్త స్రావం జరిగి సారయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

తలపై వాకర్ స్టాండ్ బలంగా తాకడం, ముసలి వయస్సు కావడంతో తట్టుకోలేక సారయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, విషయం గ్రహించిన రమాదేవి, తన ఇద్దరు కొడుకులు అయిన సాయి కృష్ణ, శశి కుమార్ తో కలిసి అక్కడి నుంచి పరార్ అయ్యింది.

విచారణ చేపట్టిన సీఐ…

ఆదివారం ఉదయమే వృద్ధుడి హత్య విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు హసన్ పర్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హసన్ పర్తి సీఐ సురేశ్, తన సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాడు. స్థానికులు, చుట్టుపక్కల వారితో మాట్లాడి వివరాలు సేకరించారు.

అనంతరం మృతుడు సారయ్య కూతురు ల్యాగ తిరుమల ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేశారు. తిరుమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సురేశ్ వివరించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner