Independence day 2023 : చంపారన్ సత్యాగ్రహంతో.. బ్రిటీష్‌పై గాంధీ 'అహింస' అస్త్రం!
Independence day 2023 : మరికొన్ని రోజుల్లో దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో చరిత్రలో కీలకమైన ఘట్టాలను హెచ్‌టీ తెలుగు మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ రోజు.. మనం చంపారన్ సత్యాగ్రహాన్ని గుర్తు చేసుకుందాము..
Independence day 2023 : చంపారన్ సత్యాగ్రహం.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఇదొక కీలక ఘట్టం. అహింస మార్గంలో కూడా పోరాటం చేయవచ్చని, ఫలితాలు సాధించవచ్చని.. ప్రపంచానికి మహాత్మా గాంధీ చాటి చెప్పిన ఉద్యమం ఇది. 2023 స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో చంపారన్ సత్యాగ్రహాన్ని ఓసారి నెమరవేసుకుందాము..
అరాచక పాలనపై "అహింస" అస్త్రం..
1750 దశకంలో బిహార్, బెంగాల్ ప్రావిన్సు ప్రాంతాల్లో ఇండిగో (నీలిమందు)ను వాణిజ్య పంటగా పండించడం మొదలైంది. అప్పట్లో దీనికి మంచి గిరాకీ ఉండేది. అదే సమయంలో భారీగా ఖర్చు కూడా అయ్యేది. నీటి వినియోగం అధికంగా ఉండేది. పైగా ఈ పంటతో మట్టి నాణ్యత పాడయ్యేది. ఈ విషయం తెలుసుకున్న రైతులు.. ఇండిగో పంటను పండించడాన్ని వ్యతిరేకించారు. దాని బదులు నిత్యావసరాలు వంటి పంటలను పండించాలని నిర్ణయించుకుననారు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి తెలిసిందే! ఇండిగో పంటను ట్రేడ్ చేసిన కంపెనీకి, వ్యాపారులకు భారీగా లాభాలు వచ్చేవి. లాభాలను వదులుకోవడం ఇష్టలేక.. ఇండిగోను పండించే విధంగా రైతులపై ఒత్తిడి పెంచింది ఈఐసీ. ఈ మేరకు పలు విధానాలను అమలు చేసింది.
Champaran Satyagraha : 1900 దశకం వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జర్మనీలో కొత్త, ఆర్టిఫీషియల్ 'డై'ని కనుగొన్నారు. ఫలితంగా ఇండిగోకు గిరాకీ పడిపోయింది. అయితే మొదటి ప్రపంచం యుద్ధం కారణంగా.. జర్మనీలో ఆ డై ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా చూపు మళ్లీ ఇండియాపై పడింది. భూ యజమానులు, ట్రేడర్లు రైతులపై పడ్డారు. అప్పటికే ఈ విషయంలో అసంతృప్తితో ఉన్న రైతులకు ఇది నచ్చలేదు. వారిపై అప్పుల భారం ఎక్కువగా ఉండేది. అదే సమయంలో.. నీలిమందును పూర్తిగా నిషేధిస్తూ చైనా, అమెరికా వంటి దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. కానీ ట్రేడర్లు మాత్రం అక్రమంగా వాటిని రవాణా చేసేవారు. మరింత డబ్బులు వచ్చేవి. ఫలితంగా.. నీలిమందు పంటను పెంచాలని రైతులపై ఒత్తిడి ఇంకా పెరిగింది. భూ యజమానులు తమ చేత అక్రమంగా పంటను పండిస్తూ, ఇతర మార్గాల్లో రవాణా చేసి డబ్బులు సంపాదిస్తున్నారని కౌలు రైతులు ఆరోపించారు. దీనిని అనేకమంది న్యాయవాదులు, రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల బాధను అర్థం చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టాలని కమిషన్ కూడా వేశారు. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీకి నచ్చలేదు. చంపారన్‌లో పరిస్థితుల గురించి పబ్లీష్ చేసిన కొంతమంది ప్రముఖులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. సరిగ్గా ఈ సమయంలోనే గాంధీ కూడా 1915లో సౌతాఫ్రికా నుంచి ఇండియాకు తిరిగివచ్చారు. ఆ తర్వాత.. చంపారన్ నుంచే బ్రిటీష్ పతనం మొదలైందని చెప్పుకోవాలి!
రాజ్ కుమార్ శుక్లా, సంత్ రౌత్ అనే వ్యక్తులకు చంపారన్‌లో కొన్ని భూములు ఉన్నాయి. అక్కడి రైతుల పరిస్థితితో ఆందోళన చెందిన వారు.. మహాత్మా గాంధీని కలిశారు. గాంధీకి అన్ని వివరాలు వెల్లడించి.. చంపారన్‌కు వెళ్లాలని అభ్యర్థించారు. ఇదే.. చంపారన్ సత్యాగ్రహానికి నాంది పలికింది!
ఇదీ చూడండి:- Independence Day 2023 : 1947 ఆగస్ట్ 15న మహాత్మా గాంధీ ఎందుకు నిరాహార దీక్ష చేశారు?
1857 తిరుగుబాటుకు పూర్తి వ్యతిరేకంగా..!
Champaran Satyagraha date : 1917 ఏప్రిల్ 10న గాంధీ చంపారన్‌లో అడుగుపెట్టారు. అనేక మంది రైతులను కలిశారు. పలువురు నేతలు, న్యాయవాదులతో చర్చలు జరిపారు. చంపారన్ రైతులు ఎదుర్కొంటున్న వివక్ష, బాధలు వంటి అంశాలపై పూర్తిస్థాయిలో సర్వే చేపట్టేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అహింస మార్గంలో అన్యాయాన్ని ఎదురించాలని నిర్ణయించుకున్నారు గాంధీ. కానీ గాంధీ ఇలా ప్రజలను పోగు చేయడం బ్రిటీషర్లకు నచ్చలేదు. 16 ఏప్రిల్‌న పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆగ్రహం ప్రజల వంతైంది! చంపారన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రజలు తండోపండాలుగా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. కోర్టు బయట గాంధీని అనుకూలంగా, బ్రిటీషర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరికి.. నచ్చకపోయినా గాంధీని విడుదల చేయాల్సి వచ్చింది.
ఆ తర్వాత.. భూ యజమానులు, ట్రేడర్లకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించారు మహాత్మా గాంధీ. చివరికి బ్రిటీష్ ప్రభుత్వమే దిగొచ్చింది. భూ యజమానులు సైతం తలవంచారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు వ్యవసాయంపై రైతులకు నియంత్రణ ఉండే విధంగా ఉన్న ఒప్పందాలపై సంతకం చేశారు. చంపారన్ అగ్రేరియన్ బిల్లుతో.. చంపారన్ సత్యాగ్రహానికి ముగింపు పడింది. తర్వాత ఇది చట్టంగా కార్యరూపం దాల్చింది. మహాత్మా గాంధీ చేసిన దాదాపు అన్ని సూచనలు ఈ చట్టంలో అమలయ్యాయి.
అయితే.. చంపారన్ సత్యాగ్రహం.. బ్రిటీషర్లపై ఓ మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి. 1857 హింసాత్మక సిపాయి తిరుగుబాటును బ్రిటీషర్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. వాస్తవానికి తిరుగుబాటు అన్నది హింసతో కూడుకునే ఉంటుంది. కానీ మహాత్ముడి రాకతో తిరుగుబాటు, విప్లవాల రూపురేఖలే మారిపోయాయి! అహింస మార్గంలో ఆయన చేస్తున్న పోరాటం చూసి బ్రిటీషర్లు తొలుత అయోమయానికి లోనయ్యారు. ఏం చేయాలో తెలియక చాలా రోజులు ఆలోచిస్తూ ఉండిపోయారు. ఈ మధ్యలో గాంధీజీ తన అస్త్రాలను ప్రదర్శించారు.
Mahtma Gandhi Champaran Satyagraha : ఈ చంపారన్ సత్యాగ్రహంతోనే గాంధీకి బాపూ అని పేరు వచ్చింది. సంత్ రౌత్.. ఈ పేరు ఇచ్చారు. చంపారన్ సత్యాగ్రహం.. అప్పట్లో ఓ సంచలనం! అహింస మార్గంలో స్వాతంత్ర్య ఉద్యమానికి నాంది పలికింది ఈ సత్యాగ్రహమే. గాంధీ నాయకత్వం అందరిని కదిలించింది. యువతలో గాంధీ ఒక నాయకుడిగా ఎదిగారు. ఎందరో ప్రముఖ నేతలు గాంధీని అనుసరించడం మొదలుపెట్టారు.
1857 తిరుగుబాటు విఫలం అవ్వడానికి ప్రధాన కారణం.. సరైన నాయకుడు లేకపోవడం. చంపారన్ సత్యాగ్రహంతో భారత దేశానికి ఆ లోటు తీరిపోయింది! మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ అహింస పోరాటం అప్పుడే మొదలైంది!
సంబంధిత కథనం