IMD red alert : ఐఎండీ రెడ్ అలర్ట్- ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు..
15 September 2024, 12:20 IST
- IMD red alert : అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ నెల 18 వరకు మూడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఐఎండీ రెడ్ అలర్ట్- ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు..
దేశవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ సహా పలు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 18 వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. సెప్టెంబర్ 15న దక్షిణ ఝార్ఖండ్, సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, సెప్టెంబర్ 17, 18 తేదీల్లో పశ్చిమ మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
పశ్చిమ బెంగాల్‌లోని గంగా నదీ తీర ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్‌లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈ అతి భారీ వర్షాలకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో ఈ అల్పపీడనం ప్రభావం తగ్గుతుందని వివరించింది.
ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
ఐఎండీ ప్రకారం ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఈ రోజు అంటే సెప్టెంబర్ 15న, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో సెప్టెంబర్ 15, 16 తేదీల్లో, అసోం, మేఘాలయలో సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు భారీ వర్షాలు కురుస్తాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంది.
వాయవ్య భారతంలో సెప్టెంబర్ 16, 17 తేదీల్లో తూర్పు ఉత్తరప్రదేశ్‌లో, సెప్టెంబర్ 17న పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఐఎండీ ప్రకారం.. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, కేరళ కోస్తా- మాహే, లక్షద్వీప్‌లో తేలికపాటి / మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన ప్రాంతాల్లో ఈ వారంలో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురుస్తాయి.
మత్స్యకారులకు హెచ్చరికలు..
బంగాళాఖాతం, పశ్చిమబెంగాల్-ఒడిశా తీరాల్లో ఈ నెల 15వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ ఉదయం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సెప్టెంబర్ 16 ఉదయం వరకు ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా తీరాల్లోని సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
సెప్టెంబర్ 14 రాత్రి నుంచి సెప్టెంబర్ 15 ఉదయం వరకు గంగానది పశ్చిమ బెంగాల్ (కోల్‌కతా సహా), ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. సెప్టెంబర్ 15 సాయంత్రం నుంచి సెప్టెంబర్ 16 సాయంత్రం వరకు ఉత్తర ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాల ఉపసంహరణ..
ఈ ఏడాది భారీ వర్షాలు దంచికొడుతున్నాయి! దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం సాధారణం కన్నా చాలా అధికంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటికే దీర్ఘకాలిక సగటు కంటే 8శాతం అధిక వర్షపాతానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాల నుంచి ప్రజలకు కాస్త రిలీఫ్ ఇచ్చే వార్తను భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై కీలక అప్డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 22 న వాయవ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ 2024 ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.