Alluri Rains : అల్లూరి జిల్లాలో ఉప్పొంగిన వాగులు-బైక్ తో సహా కొట్టుకుపోయిన యువకుడు
08 September 2024, 22:45 IST
- Alluri Rains: అల్లూరి జిల్లా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ వాగులు పొంగుతున్నాయి. జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. పాడేరు మండలం రాయిగడ్డ వద్ద బైక్ తో వాగు దాటుతూ యువకుడు వరదలో కొట్టుకుపోయాడు. వరదలో ఈతకొడుతూ అతికష్టమీద ఒడ్డుకు చేరుకున్నాడు.
అల్లూరి జిల్లాలో ఉప్పొంగిన వాగులు-బైక్ తో సహా కొట్టుకుపోయిన యువకుడు
Alluri Rains : అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాడేరు మండలం రాయిగడ్డ వద్ద బైక్ మీద వాగు దాటేందుకు ప్రయత్నించిన యువకుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వాగు దాటుతుండగా వరద ప్రవాహం పెరగడంతో యువకుడు వంతెనపై బైక్ పట్టుకుని సుమారు గంటసేపు ఉండిపోయాడు. వరద పెరిగి బైక్ తో పాటు యువకుడు వాగులో పడిపోయాడు. వరద నీటిలో అతి కష్టంగా ఈదుకుంటూ ఒడ్డు వైపు చేరుకోగా, స్థానికులు అతడిని రక్షించారు. బైక్ పోతే పోయిందని, యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆర్టీసీ బస్సు ప్రమాదం
అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలం బొర్నగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పిన బస్సు వంతెనపై నుంచి పక్కకు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 11 మందికి స్వల్పగాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ప్రయాణికులతో నర్సీపట్నం నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు బొర్నగూడెం వద్ద ఇనుప బ్రిడ్జికి ఢీకొని పక్కకు ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు పక్కకు ఒరిగిపోవడంతో కిటికీ అద్దాలు పగులగొట్టి ప్రయాణికులు బయటపడ్డారు.
అల్లూరి జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్స్
అల్లూరి జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు ఉన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.... విశాఖలో కొండచరియలు విరిగిపడ్డాయని, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాలు
ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాయుగుండం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికలతో సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలతో పాటు యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు.