HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rains : తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్, రానున్న రెండు రోజులు ఏపీలో భారీ వర్షాలు

AP Rains : తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్, రానున్న రెండు రోజులు ఏపీలో భారీ వర్షాలు

07 September 2024, 21:31 IST

    • AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి...ఉత్తర దిశగా కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 9న ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్, రానున్న రెండు రోజులు ఏపీలో భారీ వర్షాలు

తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్, రానున్న రెండు రోజులు ఏపీలో భారీ వర్షాలు

AP Rains : ఏపీకి మళ్లీ వర్షం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని మధ్య బంగాళాఖాతం మీదుగా తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర దిశగా కదులుతున్న తీవ్ర అల్పపీడనం ఈ నెల 9న ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశముందని వెల్లడించింది. దీంతో కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

తీవ్ర అల్పపీడనం

శనివారం ఉదయం 8.30 గంటలకు వాయువ్య, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా ఏర్పడింది. దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతూ వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, గంగా తీరం, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల్లో సెప్టెంబర్ 9న వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత తదుపరి 3 రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశముందని వెల్లడించింది. రుతుపవనాల ద్రోణి బికనీర్, కోటా, దామోహ్, పెంద్రా రోడ్, పార్తాదీప్, వాయవ్య దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కేంద్రం గుండా వెళుతుందని ఐఎండీ తెలిపింది.

రానున్న రెండు రోజులు వర్షాలు

అల్పపీడనం, రుతుపవనాల ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు విస్తున్న కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. రానున్న రెండు రోజుల్లో ఏపీలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు.

విజయవాడలో మళ్లీ వర్షం

శనివారం విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్లీ వర్షం పడడంతో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. దీంతో ముంపు బాధితులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడలో గంటపాటు కురిసిన భారీ వర్షానికి బస్టాండ్, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఇవాళ్టితో బుడమేరు మూడు గండ్లను పూర్తిగా మూసివేశారు. బుడమేరు పొంగిన నేపథ్యంలో చాలా కాలనీలు ముంపునకు గురయ్యాయి. మళ్లీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్