Heavy rain alert : బంగాళాఖాతంలో వాయు'గండం'- ఆంధ్రప్రదేశ్ సహా ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు!
09 September 2024, 6:40 IST
- Andhra Pradesh rains news : బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో ఏపీ సహ అనేక రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఐఎండీ రిపోర్టులోని పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్‌లో భారీ వర్షాలకు రోడ్డు మీద ప్రజలు ఇలా..
పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ (భారత వాతావరణశాఖ) హెచ్చరించింది.
ఆదివారం ఉదయం 11.30 గంటల సమయానికి కళింగపట్నం (ఆంధ్రప్రదేశ్)కు తూర్పున 270 కిలోమీటర్లు, గోపాల్పూర్ (ఒడిశా)కు తూర్పు-ఆగ్నేయంగా 210 కిలోమీటర్లు, పారాదీప్ (ఒడిశా)కు ఆగ్నేయంగా 230 కిలోమీటర్లు, దిఘా (పశ్చిమ బెంగాల్)కు దక్షిణంగా 370 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
ఉత్తర ఒడిశా-పశ్చిమ్ బెంగాల్ తీరం వైపు పయనించి.. ఈ వాయుగుండం సెప్టెంబర్ 9వ తేదీ మధ్యాహ్నానికల్లా పూరీ- దిఘా మధ్య ఒడిశా, పశ్చిమ్ బెంగాల్ తీరాలను దాటే అవకాశం ఉంది. ఫలితంగా రానున్న రెండు రోజుల్లో ఒడిశా, పశ్చిమ్ బెంగాల్‌లోని గంగా నదీ తీర ప్రాంతం, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా ఈ వ్యవస్థ మరింత బలంగా కదులుతుందని ఐఎండీఅంచనా వేస్తోంది.
కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, సెప్టెంబర్ 9న అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఏపీలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాలకు చాలా నష్టం జరిగింది. ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ సమయంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెబుతుండటంతో సర్వత్రా భయాందోళనలు పెరుగుతున్నాయి.
ఒడిశాలో సెప్టెంబర్ 9న భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 11 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
అదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌లో సెప్టెంబర్ 9,10 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, 9న అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సెప్టెంబర్ 9,10 తేదీల్లో పశ్చిమ్ బెంగాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, సెప్టెంబర్ 12 వరకు అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
సెప్టెంబర్ 10 నుంచి 11 వరకు ఝార్ఖండ్‌లోని దక్షిణ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, సెప్టెంబర్ 9, 12 తేదీల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. విదర్భలో సెప్టెంబర్ 9న తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
ఐఎండీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. అధిక ప్రభావం ఉండే ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.