Rahul Gandhi: రాహుల్ గాంధీ చేసిన తప్పుల వల్లనే మహారాష్ట్రలో ఓటమి; ‘ఇండియా’ కూటమిలో లుకలుకలు
26 November 2024, 16:33 IST
INDIA bloc: మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి ఓటమి అంతర్గత విమర్శలకు దారితీస్తోంది. రాహుల్ గాంధీ మొండితనం కారణంగా మహారాష్ట్రలో కూటమి ఓడిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. బీజేపీ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో కూటమి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం అవుతున్నాయి.
రాహుల్ గాంధీ చేసిన తప్పుల వల్లనే మహారాష్ట్రలో ఓటమి; ‘ఇండియా’ కూటమిలో లుకలుకలు
Rahul Gandhi: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ప్రభావం ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇన్ క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమిపై భారీగానే పడింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)ను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని మహాయుతి చిత్తుగా ఓడించింది. ఈ నేపథ్యంలో కూటమి లోని కొన్ని పార్టీలు కాంగ్రెస్ పెద్దన్న తరహాను ప్రశ్నిస్తున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ దూరం
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం, తొలిసారి సోమవారం కూటమి పార్టీల సమావేశాన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) హాజరు కాలేదు. మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ నాయకులు కోల్ కతాలో తమ జాతీయ కార్యవర్గ సమావేశంలో బిజీగా ఉన్నారని వారు సమాచారమిచ్చారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మొత్తం ఆరు అసెంబ్లీ స్థానాలను టీఎంసీ గెలుచుకుంది. ఇది ఆ పార్టీ ఆత్మ విశ్వాసాన్ని బాగా పెంచింది. విపక్ష ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతలను మమత బెనర్జీకి అప్పగించాలని టీఎంసీ నేతలు కోరుతున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ ఇండియా కూటమిలో కాంగ్రెస్ 'బిగ్ బ్రదర్' వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు.
బీజేపీని కాంగ్రెస్ అడ్డుకోవడం లేదు..
మమతా బెనర్జీ ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీని అడ్డుకుంటున్నారు. జార్ఖండ్ లో కూడా హేమంత్ సోరెన్ బీజేపీని అడ్డుకున్నారు. కానీ మహారాష్ట్ర (maharashtra assembly election 2024)లో వారు (కాంగ్రెస్) బిజెపిని ఆపలేకపోయారు" అని ఘోష్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఆత్మ విమర్శ చేసుకోవాలని, తమ తీరును విశ్లేషించుకోవాలని ఆయన సూచించారు. బెంగాల్, జార్ఖండ్ లలో బీజేపీని అడ్డుకోగలిగినప్పుడు.. హర్యానా, మహారాష్ట్రలో బీజేపీని అడ్డుకోవడంలో కాంగ్రెస్ ఎందుకు విఫలమైందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందో విశ్లేషించుకోవాలన్నారు. కాంగ్రెస్ బీజేపీని నిలువరించలేకపోతోందన్నారు. మమతా బెనర్జీని బీజేపీ నాయకురాలిగా చేయాలని ఆ పార్టీ నేత కల్యాణ్ బెనర్జీ సూచించారు.
రాహుల్ గాంధీ తీరుపై అసహనం
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) తీరుపై కూడా కూటమి నేతలు కొంత అసహనంగా ఉన్నారు. కూటమిలోని ఇతర పార్టీల సూచనలను పట్టించుకోవడం లేదని, మొండిగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి ఓటమి పాలు కావడం వెనుక రాహుల్ గాంధీ మొండి వైఖరి కూడా ఒక కారణం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమిలోని ఇతర పార్టీలైన ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్) పదేపదే వారించినప్పటికీ.. రాహుల్ గాంధీ మొండిగా వీర్ సావర్కర్ పై విమర్శలు చేశారని, అది మహారాష్ట్రలో ప్రతికూల ప్రభావం చూపిందని వారు విశ్లేషిస్తున్నారు. మరోవైపు, కులగణన అంశం కూడా ప్రతికూల ప్రభావం చూపిందని, రాహుల్ గాంధీ కుల సర్వేకు డిమాండ్ చేయడం, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారన్న బీజేపీ వాదనను కాంగ్రెస్ తిప్పికొట్టలేకపోవడం ప్రతిపక్ష కూటమికి నష్టం కలిగించాయని తెలిపారు.