తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nepal: పార్లమెంటు విశ్వాసం కోల్పోయిన నేపాల్ ప్రధాని ప్రచండ; కొత్త పీఎంగా ఖడ్గ ప్రసాద్ ఓలి

Nepal: పార్లమెంటు విశ్వాసం కోల్పోయిన నేపాల్ ప్రధాని ప్రచండ; కొత్త పీఎంగా ఖడ్గ ప్రసాద్ ఓలి

HT Telugu Desk HT Telugu

12 July 2024, 22:46 IST

google News
  • Nepal politics: నేపాల్ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తన ప్రధాన మిత్రదేశం మద్దతు ఉపసంహరించుకోవడంతో నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ పార్లమెంటులో విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. ఖడ్గ ప్రసాద్ ఓలి దేశ కొత్త ప్రధాని కాబోతున్నారు.

పార్లమెంటు విశ్వాసం కోల్పోయిన నేపాల్ ప్రధాని ప్రచండ
పార్లమెంటు విశ్వాసం కోల్పోయిన నేపాల్ ప్రధాని ప్రచండ (AFP)

పార్లమెంటు విశ్వాసం కోల్పోయిన నేపాల్ ప్రధాని ప్రచండ

Nepal politics: సంకీర్ణ ప్రభుత్వంలోని అతిపెద్ద పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో నేపాల్ (Nepal) ప్రధాని పుష్ప కమల్ దహల్ శుక్రవారం పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. శుక్రవారం ప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్ లో మెజారిటీ సభ్యుల మద్దతును పొందడంలో పుష్ప కమల్ దహల్ విఫలమయ్యారు. దాంతో, ఆయన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

సంకీర్ణ రాజకీయాలు

ఇన్నాళ్లు ప్రచండ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) గత వారం ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంది. దేశంలో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ తో చేతులు కలిపి కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాంతో, ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ నేపథ్యంలో, ఆయన పార్లమెంటులో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

కొత్త ప్రధాని ఖడ్గ ప్రసాద్ ఓలి

నేపాల్ (Nepal) తదుపరి ప్రధానిగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) నేత ఖడ్గ ప్రసాద్ ఓలి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ప్రధాని పదవి చేపట్టడానికి కూటమి అంగీకరించింది. 2022 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్) మూడో స్థానంలో నిలిచింది. అయినప్పటకీ ప్రచండ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) మద్ధతుతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ, వారం క్రితం ఆ పార్టీ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంది. ప్రచండ ఇప్పటివరకు ఐదుసార్లు పార్లమెంటులో విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు.

మావోయిస్ట్ నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి..

2006లో మావోయిస్టు గ్రూప్ సాయుధ తిరుగుబాటును ముగించి ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేపాల్ ప్రధానిగా పుష్ప కమల్ దహల్ బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. ఆయనను ప్రచండ అని కూడా పిలుస్తారు. ప్రచండ 1996 నుండి 2006 వరకు హింసాత్మక మావోయిస్టు కమ్యూనిస్ట్ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఆ తిరుగుబాటులో 17,000 మందికి పైగా మరణించారు.

తదుపరి వ్యాసం