Earthquake across Delhi-NCR: ఢిల్లీ, నేపాల్ ల్లో భూకంపం
ఢిల్లీ, ఉత్తరాఖండ్, నేపాల్ ల్లో శనివారం సాయంత్రం భూమి కంపించింది. స్వల్ప ప్రకంపనాలు కొన్ని క్షణాల పాటు ప్రజలను భయభ్రాంతులను చేశాయి.
గత రెండు వారాల వ్యవధిలో ఈ ప్రాంతంలో మూడు సార్లు భూమి కంపించడం ఆందోళనకు కారణమవుతోంది. తాజాగా, శనివారం సాయంత్రం 7.57 గంటల సమయంలో భూమి కంపించింది. ఈ భూకంపం ప్రభావం ఢిల్లీ, ఢిల్లీ రాజధాని ప్రాంతం, నేపాల్, ఉత్తరాఖండ్ ల్లో కనిపించింది.
5.4 తీవ్రతతో…
శనివారం నాటి భూకంప తీవ్రత భూకంప లేఖినిపై 5.4 అని సిస్మాలజిస్ట్ లు వెల్లడించారు. ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ కు 212 కిలోమీటర్లు ఆగ్నేయంగా, 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది. ఈ భూకంపం ప్రభావంతో నేపాల్, ఢిల్లీ- ఎన్ సీఆర్, ఉత్తరాఖండ్ ల్లో భూమి కంపించింది. ఈ భూకంపం కారణంగా ఆస్తి నష్టం కానీ, ప్రాణనష్టం కాని వాటిల్లినట్లు సమాచారం లేదు.
మూడు రోజుల క్రితం కూడా..
మూడు రోజుల క్రితం కూడా నేపాల్ కేంద్రంగా 6.3 తీవ్రతతో భూ కంపం సంభవించింది. ఆ భూకంపం కారణంగా నేపాల్ లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ భూకంపం సమయంలో గుజరాత్ లోని వదోదరలో, పశ్చిమబెంగాల్లోని సిలిగురిలో కూడా భూ ప్రకంపనాలు సంభవించాయి.
టాపిక్