Nepal landslide: బస్సులపై విరిగిపడిన కొండచరియలు; ఏడుగురు భారతీయులు సహా 60 మంది గల్లంతు
Nepal landslide: నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులపై కొండచరియలు విరిగిపడి 60 మందికి పైగా గల్లంతయ్యారు. ఖాట్మండు నుంచి గౌర్ వెళ్తున్న బస్సులో 41 మంది, బీర్ గంజ్ నుంచి ఖాట్మండు వెళ్తున్న బస్సులో 24 మంది ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీరిలో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నారు.
Nepal landslide: నేపాల్ లో కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు నదిలోకి దూసుకెళ్లడంతో ఏడుగురు భారతీయులు సహా 60 మంది గల్లంతయ్యారు. చిత్వాన్ జిల్లాలోని నారాయణ్ ఘాట్-ముగ్లింగ్ రహదారి వెంబడి సిమల్తాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో 63 మంది గల్లంతయ్యారు. నేపాల్ (Nepal) లోని త్రిశూలి నదిలో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
తెల్లవారుజామున..
ఈ ప్రమాదం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగింది. దాంతో, ఆ రెండు బస్సుల్లోని ప్రయాణీకులంతా నిద్రలో ఉన్నారు. వారు తేరుకునే లోపే రెండు బస్సులు నదిలో కొట్టుకుపోయాయి. త్రిశూలీ నదిలో బస్సులు కొట్టుకుపోయేలోపే ముగ్గురు ప్రయాణికులు బస్సులో నుంచి దూకి తప్పించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వారు వైద్య చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
గాలింపు చర్యలు
నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సుల్లోని ప్రయాణికుల కోసం అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. దేశ రాజధాని ఖాట్మండుకు పశ్చిమాన 100 కిలోమీటర్ల దూరంలోని సెంట్రల్ జిల్లా చిత్వాన్ లో ప్రాణాలతో బయటపడిన వారిని గుర్తించిన ప్రాంతంలో అధికారులు ఈ గాలింపు చర్యలు చేపట్టారు. ఖాట్మండు నుంచి గౌర్ వెళ్తున్న బస్సులో 41 మంది, బీర్ గంజ్ నుంచి ఖాట్మండు వెళ్తున్న బస్సులో 24 మంది ఉన్నారని అధికార వర్గాలు రాయిటర్స్ కు తెలిపాయి.
మరో బస్సు కూడా..
శుక్రవారం ఉదయం మూడో బస్సు కూడా కొండచరియలు విరిగిపడిన ప్రమాదం బారిన పడింది. ఆ ఘటనలో బస్సు డ్రైవర్ మృతి చెందాడు. అలాగే, ఖాట్మండుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాస్కి జిల్లాలో కొండచరియలు విరిగిపడి మూడు ఇళ్లు కొట్టుకుపోయాయని, 10 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసు అధికార ప్రతినిధి డాన్ బహదూర్ కార్కి తెలిపారు. గురువారం రాత్రి రిసార్ట్ పట్టణం పోఖారా సమీపంలో కొండచరియలు విరిగిపడి ఏడుగురు సభ్యులున్న కుటుంబం మృతి చెందింది. కొండచరియలు విరిగిపడటంతో కుటుంబం నిద్రిస్తున్న గుడిసె నేలమట్టమైందని, ఈ ప్రాంతంలోని మరో మూడు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు.