Uttarakhand Landslides : ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు హైదరాబాదీలు మృతి
Uttarakhand Landslides : ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు హైదరాబాద్ యాత్రికులు మరణించారు. శనివారం కర్ణప్రయాగ, గౌచర్ మధ్యలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది.y
Uttarakhand Landslides : ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కొండ చరియలు విరిగిపడడంతో ఇద్దరు హైదరాబాదీలు మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు శనివారం ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో బండరాళ్లు తగిలి మరణించారు. హిమాలయాలలోని దేవాలయాలను దర్శించుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా బండరాళ్లు పడి పర్యాటకులు మృత్యువాత పడ్డారు.
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల కొండ చరియలు విరిరిపడుతున్నాయి. చమోలీ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కర్ణప్రయాగ, గౌచర్ మధ్యలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన సత్య నారాయణ (50), నిర్మల్ షాహీ (36) హిమాలయాల్లోని బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా మార్గమధ్యలో వారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బండరాళ్లు పడడంతో మృతదేహాలు ఛిద్రమయ్యాయి. మృతదేహాలను బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలకు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. బద్రీనాథ్ నేషనల్ హైవే మార్గంలో కొండ చరియలు విరిగిపడి రహదారులు ధ్వంసం అయ్యాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రప్రయాగ్-కేదార్‌నాథ్ నేషనల్ హైవేపై రాకపోకలను నిలిచిపోయాయి. ఇవాళ, రేపు ఉత్తరాఖండ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో స్థానికంగా స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ సెలవు ప్రకటించారు. భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ అతలాకుతలం అయ్యింది. దాదాపుగా 100కి పైగా రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. గంగా, అలకనంద, భాగీరథి, శారద, మందాకిని, కోసితో సహా ప్రధాన నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దీంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. చంపావత్, అల్మోరా, పిథోరాఘర్, ఉధంసింగ్ నగర్, కుమావోన్ ప్రాంతంతో సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. డెహ్రాడూన్, పౌరీ, తెహ్రీ, హరిద్వార్‌లలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.
విరిగిపడుతున్న కొండ చరియలు
భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పితోర్‌గఢ్‌లోని 21 రోడ్లపై రాకపోకలు నిలిపివేశారు. చమోలీలోని లంబాగడ్ సమీపంలోని పాగల్ నాలా వద్ద బద్రీనాథ్, ఉత్తరకాశీలోని దబర్‌కోట్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో యమునోత్రి రహదారులపై రాకపోకలు నిలిపివేశారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బ్లాక్ అయిన రోడ్లపై మరమ్మత్తులు చేస్తున్నాయి.
ఉత్తరాఖండ్ లో తరచూ కొండ చరియలు విరిగిపడుతుంటాయి. భారీ వర్షాలు పడినప్పుడు ముందస్తుగా రహదారులను అధికారులు బ్లాక్ చేస్తారు. మంగళవారం నుంచి ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి రోడ్లు మూసుకుపోయాయి. స్థానిక పరిస్థితుల అనుగుణంగా పర్యాటకులు టూర్లు కొనసాగించాలని అధికారులు కోరుతున్నారు. లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
సంబంధిత కథనం