Dera chief shot dead: ఉత్తరాఖండ్ లో డేరా చీఫ్ దారుణ హత్య: సీసీటీవీలో రికార్డైన హత్య దృశ్యాలు-dera chief shot dead in uttarakhand cctv video shows moments before killing ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dera Chief Shot Dead: ఉత్తరాఖండ్ లో డేరా చీఫ్ దారుణ హత్య: సీసీటీవీలో రికార్డైన హత్య దృశ్యాలు

Dera chief shot dead: ఉత్తరాఖండ్ లో డేరా చీఫ్ దారుణ హత్య: సీసీటీవీలో రికార్డైన హత్య దృశ్యాలు

HT Telugu Desk HT Telugu

Dera chief shot dead: ఉత్తరాఖండ్ లోని నానక్ మట్ట సాహిబ్ గురుద్వారా డేరా చీఫ్ బాబా తర్సెమ్ సింగ్ ను బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు గురుద్వారా ప్రాంగణంలోనే కాల్చి చంపారు. తర్సెమ్ సింగ్ ను అతి దగ్గర నుంచి తుపాకీతో కాల్చారు. ఈ హత్యకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

తర్సెమ్ సింగ్ పై కాల్పులు జరుపుతున్న బైక్ పై వచ్చిన దుండగులు (PTI)

Dera chief shot dead in Uttarakhand: ఉత్తరాఖండ్ లోని నానక్ మట్ట సాహిబ్ గురుద్వారా డేరా చీఫ్ ను గురువారం తెల్లవారుజామున బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆలయ ప్రాంగణంలోనే కాల్చి చంపిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఉదయం 6.30 గంటల సమయంలో డేరా బాబా ప్రాంగణంలో కుర్చీలో కూర్చున్న సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.

ఆసుపత్రికి తరలింపు

కాల్పులు జరిపిన అనంతరం ఆ దుండగులు బైక్ పై పారిపోయారు. వెంటనే, అక్కడి వారు తేరుకుని బాబా తర్సెమ్ సింగ్ ను ఖతిమాలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ మరణించాడని ఉధమ్ సింగ్ నగర్ ఎస్ ఎస్ పి మంజు నాథ్ తెలిపారు. నానక్ మట్ట సాహిబ్ గురుద్వారా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ సిఖ్ పుణ్యక్షేత్రం. ఇది రుద్రపూర్-తనక్పూర్ మార్గంలో ఉంటుంది.

పోలీసుల విచారణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్యపై విచారణ జరిపేందుకు ఉత్తరాఖండ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని నానక్ మట్ట ప్రాంతంలో శాంతిని కాపాడేందుకు అదనపు పోలీసు సిబ్బందిని మోహరించామని, ఆవేశాలకు లోను కావద్దని, శాంతియుతంగా ఉండాలని పోలీసులు సిక్కు సమాజానికి విజ్ఞప్తి చేశారు. నిందితులను పట్టుకోవడానికి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అవసరమైతే, కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారం తీసుకుంటామన్నారు.

సిట్ ఏర్పాటు

‘‘ఈ రోజు ఉదయం 6:15-6:30 గంటల మధ్య ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు నానక్ మట్ట గురుద్వారాలోకి ప్రవేశించి సంస్థ చీఫ్ బాబా తర్సెమ్ సింగ్ ను కాల్చి చంపినట్లు మాకు ఉదయం 7 గంటలకు సమాచారం అందింది’’ అని ఉత్తరాఖండ్ డీజీపీ అభినవ్ కుమార్ తెలిపారు. ఇది చాలా సీరియస్ విషయమని, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారని డీజీపీ తెలిపారు. స్థానిక ఎస్ఎస్పీ ఇప్పటికే అక్కడ ఉన్నారన్నారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి సిట్ ను ఏర్పాటుచేశారు. ఆ బృందంలో ఎస్టీఎఫ్ అధికారులు, స్థానిక పోలీసులు ఉంటారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.