Fire Accident: ఆర్డీవో ఆఫీస్ లో అగ్ని ప్రమాదం.. పలు కీలక ఫైళ్లు దగ్ధం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన
Fire Accident: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో ఆఫీస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆఫీసులోనిల్యాండ్ అక్విజిషన్ కుసంబంధించిన పలు కీలక ఫైళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.
Fire Accident: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో ఆఫీస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఆఫీసులోని ల్యాండ్ అక్విజిషన్ కుసంబంధించిన పలు కీలక ఫైళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. బుధవారం అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుండగా, కిటికీలో నుంచి వచ్చిన పొగలను అక్కడి సిబ్బంది గమనించి వెంటనే అలర్ట్ అయ్యారు.
హుటాహుటిన లోపలికి వెళ్లి మంటలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు భూ సేకరణప్రక్రియ చేపట్టగా, దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఆ గదిలోనే ఉన్నాయి. కాగా అకస్మాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదంలో కొన్ని ఫైల్స్ పాక్షికంగా దగ్ధమవడం కలకలం రేపింది.
వాటిలో కొన్ని గతంలో భూ సేకరణ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన ఫైల్స్ కాగా, మరికొన్ని రన్నింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ దస్త్రాలు కూడా ఉన్నాయి. దీంతో ప్రమాదంపై వివిధ రకాల ఆరోపణలు వినిపించగా, షాట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిందని అధికారులు గుర్తించారు.
అగ్ని ప్రమాదం ఆఫీస్ సిబ్బంది ఎవరూ లేని సమయంలో జరగడంతో ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. అంతేగాకుండా అక్కడున్న సిబ్బంది కొద్దిపాటి మంటలు వ్యాప్తి చెందగానే గుర్తించి, మంటలు చల్లార్చడంతో మిగతా ఫైల్స్ అగ్ని ప్రమాదం నుంచి బయట పడ్డాయి.
కీలక ఫైళ్లన్నీ అందులోనే..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం, సింగరేణి, కేటీపీపీ తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియ చేపట్టారు. వాటికి సంబంధించిన విలువైన సమాచారం అంతా ఫైళ్ల రూపంలో అదే గదిలో ఉండటం గమనార్హం. కాగా అనుకోకుండా జరిగిన విద్యుత్తు ప్రమాదంలో అందులో భద్రపరిచిన దాదాపు 15 ఫైళ్లు కొంత మేర కాలి పోగా, వాటికి సంబంధించిన సమాచారం అంతా సాఫ్ట్ కాపీల్లో భద్రంగానే ఉందని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు.
ఇంతటి విలువైన పత్రాలు ఉన్న గదిలో షాట్ సర్క్యూట్ జరగడం కలకలం సృష్టిస్తుండగా, ఆఫీసర్లు కూడా అప్రమత్తమయ్యారు. అసలు ఏఏ ప్రాజెక్టులకు సంబంధించిన ఫైళ్లు ధ్వంసం అయ్యాయో తేల్చే పనిలో మునిగి పోయారు. కాగా ఈ ఘటనపై ఆఫీస్ సిబ్బంది జిల్లా ఉన్నతాధికారులకు కూడా సమాచారం చేరవేశారు.
షాట్ సర్క్యూట్ తోనే ప్రమాదం
ఆర్డీవో ఆఫీసులో అగ్ని ప్రమాదానికి షాట్ సర్క్యూట్ జరగడమే కారణమని అధికారులు తెలిపారు. గది లోపల గోడలకు ఉన్న కొన్ని విద్యుత్తు వైర్లు కాలిపోయి ఉండటం, గోడలకు మసి పట్టి ఉండటం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కాగా అగ్ని ప్రమాదం జరిగిన అనంతరం అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు అక్కడకు చేరుకున్న స్థానిక పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
(రిపోర్టింగ్:హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)