Monsoon news: వారం రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు; ఈ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు-monsoon covers entire country 6 days ahead of normal date ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Monsoon News: వారం రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు; ఈ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

Monsoon news: వారం రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు; ఈ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

HT Telugu Desk HT Telugu
Jul 02, 2024 02:40 PM IST

Monsoon news: దేశ ప్రజలకు శుభవార్త. ఈ సంవత్సరం నైరుతి రుతు పవనాలు ఆరు రోజులు ముందుగానే దేశవ్యాప్తంగా విస్తరించాయి. జూన్ 11న మహారాష్ట్రకు చేరుకున్నప్పుడు దాదాపు తొమ్మిది రోజుల పాటు నిలిచిపోయిన రుతుపవనాల విస్తరణ.. జూన్ 25 తరువాత వేగం పుంజుకుంది.

The monsoon normally covers the entire country on July 8. (PTI)
The monsoon normally covers the entire country on July 8. (PTI)

రుతుపవనాలు సాధారణం కన్నా ఆరు రోజులు ముందుగానే రాజస్థాన్, హర్యానా, పంజాబ్ లోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. జూన్ 11న మహారాష్ట్రకు చేరుకున్న తరువాత దాదాపు తొమ్మిది రోజుల పాటు నిలిచిపోయిన రుతుపవనాల విస్తరణ.. జూన్ 25 తరువాత వేగం పుంజుకుందని తెలిపింది. అప్పటి నుంచి రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో ఈశాన్య రాష్ట్రాలు, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

జూలై 2న దేశవ్యాప్తంగా విస్తరణ

‘‘నైరుతి రుతుపవనాలు ఈ రోజు, జూలై 2, 2024 (మంగళవారం) రాజస్థాన్, హర్యానా, పంజాబ్ లోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించే తేదీ జూలై 8 అని భావించాం. కానీ, ఆరు రోజుల ముందుగానే ఇవి దేశం మొత్తాన్ని కవర్ చేశాయి’’ అని ఐఎండీ వివరించింది. సముద్ర మట్టం వద్ద రుతుపవనాల ద్రోణి ఫిరోజ్ పూర్ (పంజాబ్), రోహ్ తక్ (హర్యానా), హర్దోయి, బల్లియా (ఉత్తరప్రదేశ్), బలూర్ ఘాట్ (పశ్చిమ బెంగాల్), కైలాషహర్ (త్రిపుర) మీదుగా మణిపూర్ వైపు పయనిస్తోందని ఐఎండీ తెలిపింది.

ఆగ్నేయ పాకిస్తాన్ లో తుపాను

ఆగ్నేయ పాకిస్తాన్ లో తుపాను కొనసాగుతోందని, సముద్ర మట్టం వద్ద రుతుపవనాల ద్రోణి సాధారణ స్థితికి ఉత్తరంగా ఉందని ఐఎండీ తెలిపింది. వీటి ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు వాయువ్య, మధ్య భారతంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ రాష్ట్రాల్లో వర్షపాతం

జూలై 4 నుంచి 6 వరకు జమ్మూకశ్మీర్, లడఖ్, గిల్ గిట్, బాల్టిస్థాన్, ముజఫరాబాద్, జూలై 2 నుంచి 6 వరకు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, జూలై 3 వరకు పశ్చిమ రాజస్థాన్, జూలై 2 నుంచి 4 వరకు మధ్యప్రదేశ్, జూలై 3న ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూలై 6 వరకు ఉత్తరాఖండ్, జూలై 3న పంజాబ్, హర్యానా, జూలై 6 వరకు పశ్చిమ ఉత్తరప్రదేశ్, జూలై 5, 6 తేదీల్లో తూర్పు ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరో రెండు తుపాన్లు

ఉత్తర బంగ్లాదేశ్ లో ఒక తుఫాను, అస్సాం మీదుగా మరో తుఫాను ఏర్పడింది. ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి అస్సాం మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఈశాన్య భారతం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న ఐదు రోజుల పాటు తూర్పు భారతంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూలై 5, 6 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు (20 సెంటీమీటర్లకు పైగా) కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD) తెలిపింది.

మహారాష్ట్ర,కేరళ తీరాల్లో..

ఉత్తర గుజరాత్ లో మరో తుపాను కొనసాగుతోందని, మహారాష్ట్ర-కేరళ తీరాల వెంబడి సముద్ర మట్టం వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. వీటి ప్రభావంతో జూలై 6 వరకు కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో, జూలై 3న గుజరాత్ లో, జూలై 5, 6 తేదీల్లో కోస్తా కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుజరాత్ లో భారీ వర్షాలు (20 సెంటీమీటర్లకు పైగా) కురిసే అవకాశం ఉంది.

WhatsApp channel