NEET PG 2024: నీట్ పీజీ 2024 పరీక్ష తేదీని ప్రకటించిన ఎన్బీఈఎంఎస్; ఎగ్జామ్ ఎప్పుడంటే?
05 July 2024, 15:14 IST
వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించే నీట్ పీజీ 2024 పరీక్ష తేదీలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ప్రకటించింది. నీట్ యూజీ పేపర్ లీక్ నేపథ్యంలో, ముందు జాగ్రత్త చర్యగా, నీట్ పీజీ 2024 ను కూడా, జూన్ 22న వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఆగస్ట్ 11 వ తేదీన నీట్ పీజీ 2024
NEET PG 2024 Exam date: నీట్-పీజీ ప్రవేశ పరీక్షను ఆగస్టు 11న రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) శుక్రవారం ప్రకటించింది. నీట్-పీజీ 2024 నిర్వహణను రీషెడ్యూల్ చేసినట్లు తెలిపింది. నీట్-పీజీ పరీక్షను 2024 ఆగస్టు 11న రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. నీట్-పీజీ 2024 పరీక్షకు హాజరు కావడానికి కటాఫ్ తేదీ 2024 ఆగస్టు 15గా కొనసాగుతుందని బోర్డు నోటిఫికేషన్ లో తెలిపింది. నీట్ యూజీ 2024 పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో, ముందుజాగ్రత్త చర్యగా కేంద్రం జూన్ 22న నీట్-పీజీ 2024 పరీక్షను వాయిదా వేసింది.
పేపర్ లీక్ ఆరోపణలు..
కొన్ని పోటీ పరీక్షల సమగ్రతపై ఇటీవల వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని వైద్య విద్యార్థుల కోసం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే నీట్-పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్రక్రియల పటిష్టతను క్షుణ్ణంగా అంచనా వేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వైద్య విద్యార్థుల కోసం ఎన్బీఈఎంఎస్ తన సాంకేతిక భాగస్వామి టీసీఎస్ తో కలిసి నిర్వహించే నీట్-పీజీ పరీక్ష ప్రక్రియల పటిష్టతను క్షుణ్ణంగా పరిశీలిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.
మెడికల్ పీజీ అడ్మిషన్లకు..
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు అందించే అన్ని పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్బీ కోర్సులు, పోస్ట్ ఎంబీబీఎస్ డైరెక్ట్ ఆరేళ్ల డీఆర్ఎన్బీ కోర్సులు, ఎన్బీఈఎంఎస్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నీట్ పీజీ పరీక్షను నిర్వహిస్తారు. నీట్-పీజీ (NEET PG) తో పాటు యూజీసీ-నెట్ పరీక్షను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. యూజీసీ-నెట్ పరీక్ష ఆగస్టు-సెప్టెంబర్ లో జరుగుతుంది.జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మంజూరుకు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి, పీహెచ్ డీ కోర్సుల్లో ప్రవేశానికి యూజీసీ-నెట్ (UGC NET) పరీక్ష ద్వారా అర్హతను నిర్ణయిస్తారు.
జూలై 25- 27 ల్లో సీఎస్ఐఆర్ యూజీసీ నెట్
కాగా, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) యూజీసీ-నెట్ జూలై 25 నుంచి 27 వరకు జరగనుంది. పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ముందస్తు చర్యగా ఈ పరీక్షను గతంలో వాయిదా వేశారు. కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్లో పీహెచ్డీ ప్రవేశాలకు సీఎస్ఐఆర్ యూజీసీ-నెట్ స్కోర్ ను అర్హతగా పరిగణిస్తారు.