NEET PG 2024: రేపే నీట్ పీజీ 2024; ఈ విషయాలు మర్చిపోకండి.. ఇబ్బంది పడ్తారు..
నీట్ పీజీ 2024: నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో అవకతవకల నేపథ్యంలో.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG 2024)పరీక్ష జూన్ 23న దేశవ్యాప్తంగా 300 నగరాల్లో 1000కు పైగా పరీక్షా కేంద్రాల్లో జరగనుంది. ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహిస్తారు.
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG 2024) పరీక్ష 2024 జూన్ 23 ఆదివారం జరగనుంది. దేశవ్యాప్తంగా 300 నగరాల్లో 1000కు పైగా పరీక్షా కేంద్రాల్లో ఈ నీట్ పీజీ 2024 పరీక్ష జరగనుంది. నీట్ పీజీ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహిస్తారు.
నీట్ యూజీ 2024 గందరగోళం
పరీక్ష నిర్వహణలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణల మధ్య నీట్ యూజీ 2024 రాసిన అభ్యర్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. చండీగఢ్ లో రెండు, మేఘాలయ, హరియాణా, ఛత్తీస్ గఢ్, గుజరాత్ లలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఆరు కేంద్రాల్లో పరీక్ష ప్రారంభంలో జాప్యం కారణంగా 'గ్రేస్ మార్కులు' పొందిన 1,563 మంది నీట్ యూజీ 2024 అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 23న రీ టెస్ట్ నిర్వహించనుంది.
నీట్ పీజీ 2024 మార్గదర్శకాలు
నీట్ పీజీ 2024 (NEET PG 2024)పరీక్ష జూన్ 23, ఆదివారం రోజు ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య జరగనుంది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది మార్గదర్శకాలను కచ్చితంగా ఫాలో కావాల్సి ఉంటుంది.
- అడ్మిట్ కార్డుపై పేర్కొన్న విధంగా విద్యార్థులు గేట్ మూసివేయడానికి ముందే పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలి. పరీక్షా కేంద్రంలోని 'రిపోర్టింగ్ కౌంటర్'లో రిపోర్ట్ చేయాలి.
- పరీక్షా కేంద్రంలో ఆలస్యంగా రిపోర్టు చేసిన అభ్యర్థిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరు. ఏ కారణం చేతనైనా ఆలస్యంగా రావడానికి అధికారులు బాధ్యత వహించరు.
- పరీక్ష రోజున ఎలాంటి జాప్యం జరగకుండా అభ్యర్థులు పరీక్షకు ఒక రోజు ముందు పరీక్షా కేంద్రాన్ని చూసి రావడం, ట్రాన్స్ పోర్ట్ కు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.
- అభ్యర్థులు తప్పనిసరిగా తమ అడ్మిట్ కార్డులను పరీక్ష రోజున పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి.
- కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష సమయంలో హాజరయ్యే అభ్యర్థితో ఎలాంటి కాంటాక్ట్ కు అనుమతి లేదు.
- అభ్యర్థులు వెరిఫికేషన్ కోసం తమ అడ్మిట్ కార్డు, ఐడీ ప్రూఫ్ ను ఎగ్జామ్ హాళ్లో అధికారికి సమర్పించాలి. వారు వివరాలను ధృవీకరించడానికి బార్ కోడ్ / క్యూఆర్ కోడ్ రీడర్ లను ఉపయోగిస్తారు. ఆ తర్వాత అభ్యర్థులకు కేటాయించిన ల్యాబ్ నంబర్ ను తెలియజేస్తారు.
- అనధికారిక అభ్యర్థులు ఎవరూ పరీక్షకు హాజరుకాకుండా ఉండేందుకు అధికారులు పరీక్షా కేంద్రానికి రాగానే అభ్యర్థుల గుర్తింపు వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
- అభ్యర్థులు ఈ కింది డాక్యుమెంట్లను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి.
- 1. బార్కోడెడ్/ క్యూఆర్ కోడ్డ్ అడ్మిట్ కార్డు ప్రింటెడ్ కాపీ.
- 2. పర్మినెంట్/ప్రొవిజనల్ ఎస్ఎంసీ/ఎంసీఐ/ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ ల ఫోటోకాపీ.
- 3. ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఐడీ కార్డు పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్ లేదా ఆధార్ కార్డు.
- పరీక్ష హాల్ లోపలికి ఈ క్రింది వస్తువులు తీసుకువెళ్లడం నిషేధం.
- స్టేషనరీ వస్తువులు- టెక్స్ట్ మెటీరియల్ (ప్రింట్ , లేదా రిటెన్ నోట్స్, ప్లాస్టిక్ పౌచ్, కాలిక్యులేటర్, పెన్ను, రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్, ఎరేజర్ మొదలైనవి తీసుకురాకూడదు.
- ఎలక్ట్రానిక్ పరికరాలు: మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్ ఫోన్స్, మైక్రోఫోన్, పేజర్, రిస్ట్ వాచ్/ హెల్త్ బ్యాండ్, కాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ పెన్/ స్కానర్ మొదలైనవి పరీక్ష హాళ్లోకి తీసుకురాకూడదు.
- ఆభరణాలు: బ్రేస్ లెట్ లు, ఉంగరాలు, చెవిపోగులు, ముక్కు పిన్నులు, గొలుసులు/నెక్లెస్ లు, పెండెంట్ లు, బ్యాడ్జీలు, బ్రూచీలు మొదలైనవి తీసుకురాకూడదు.
- ఇతర వస్తువులలో వాలెట్, కళ్లజోళ్లు, హ్యాండ్ బ్యాగులు, టోపీ, బెల్ట్, తినుబండారాలు, శీతల పానీయాలు, వాటర్ బాటిల్ మొదలైనవి కూడా పరీక్ష హాళ్లోకి నిషేధం.
- పరీక్ష ప్రక్రియను పర్యవేక్షించడానికి నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తారు. అంతేకాక, ప్రతి వర్క్ స్టేషన్ ను ముందు వైపు, ఎడమ వైపు, కుడి వైపు బ్లాక్ చేస్తారు.
నీట్ పీజీ 2024 పరీక్షా విధానం
నీట్ పీజీ 2024 మూడున్నర గంటల నిడివి గల పరీక్ష, ఇందులో 200 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQ) ఉంటాయి. మార్కింగ్ స్కీమ్ ప్రకారం ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు, ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. కాగా, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (neet ug 2024) పరీక్షలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో జూన్ 23న జరగాల్సిన నీట్-పీజీ పరీక్షలను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.