NEET PG Postponed: నీట్ పీజీ పరీక్ష వాయిదా.. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో కీలక నిర్ణయం
NEET PG Postponed: ఈ మధ్య జరిగిన పలు పోటీ పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీల నేపథ్యంలో నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్ష ఆదివారం (జూన్ 23) జరగాల్సి ఉంది.
NEET PG Postponed: నీట్-పీజీ ఎంట్రెన్స్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఆదివారం (జూన్ 23) ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. శనివారం (జూన్ 22) రాత్రి ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ముందు జాగ్రత్త చర్యగా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
నీట్ పీజీ ఎంట్రెన్స్ వాయిదా
కొన్ని పోటీ పరీక్షల సమగ్రతపై ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా జూన్ 23న జరగాల్సిన నీట్-పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.
వైద్య విద్యార్థుల కోసం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్టీఏ) నిర్వహించే నీట్-పీజీ ప్రవేశ పరీక్ష ప్రక్రియల పటిష్టతను క్షుణ్ణంగా అంచనా వేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ముందుజాగ్రత్త చర్యగా రేపు (జూన్ 23, 2024) జరగాల్సిన నీట్-పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ పరీక్ష జరగబోయే తేదీని వీలైనంత త్వరగా ప్రకటిస్తామని వెల్లడించింది. విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ మనస్ఫూర్తిగా చింతిస్తోంది. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా, పరీక్షా ప్రక్రియ పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
గత మూడు రోజుల్లో వాయిదా లేదా రద్దు చేసిన మూడో పోటీ పరీక్షగా నీట్ పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ నిలిచింది. గురువారం (జూన 20) కేంద్ర విద్యా శాఖ అంతకుముందు జరిగిన యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేసింది. ఈ పరీక్ష పేపర్ డార్క్ నెట్లో లీకైనట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. దీంతో ఈ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది.
ఇక శుక్రవారం (జూన్ 21) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. సీఎస్ఐఆర్ యూజీసీ-నెట్ ను వాయిదా వేసింది. కొన్ని అనివార్య పరిస్థితులు, లాజిస్టిక్ సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇందులో పేపర్ లీక్ ఏమీ లేదని, అయితే లాజిస్టిక్ సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.
ఇక నీట్-యూజీ పరీక్షను మే 5న నిర్వహించారు. దీనికి దేశవ్యాప్తంగా 24 లక్షల మంది హాజరయ్యారు. జూన్ 4న ఫలితాలను అనౌన్స్ చేశారు. కానీ ఆ వెంటనే ఈ పరీక్ష పత్రాలు బీహార్ తోపాటు కొన్ని ఇతర రాష్ట్రాల్లో లీకైందని, కొన్ని అక్రమ కార్యకలాపాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.