Niagara Falls: ఇద్దరు పిల్లలతో నయాగరా జలపాతంలో దూకిన తల్లి; మృతదేహాల కోసం గాలింపు
31 October 2024, 19:31 IST
Niagara Falls: ఒక 33 ఏళ్ల యువతి చియాంటి మీన్స్ తన ఇద్దరు పిల్లలతో నయాగరా జలపాతంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ఆ ముగ్గురు మృతి చెందినట్లు భావిస్తున్నారు. వారి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. నయాగరా ఫాల్స్ లో ఆత్మహత్యలు పెరగడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇద్దరు పిల్లలతో నయాగరా జలపాతంలో దూకిన తల్లి
Niagara Falls: సోమవారం రాత్రి నయాగరా ఫాల్స్ నుంచి దూకి న్యూయార్క్ కు చెందిన ఓ తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు మృతి చెందారు. న్యూయార్క్ స్టేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 33 ఏళ్ల చియాంటి మీన్స్, ఆమె పిల్లలు ఉద్దేశపూర్వకంగానే నయాగారా జలపాతంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు.
ప్రమాదమా? ఆత్మహత్యా?
ఇద్దరు పిల్లలతో చియాంటీ మీన్స్ ప్రమాదవశాత్తూ నయాగారా జలపాతంలో పడిపోయారని పోలీసులు మొదట్లో భావించారు. కానీ, ఆ తరువాత ఉద్దేశపూర్వకంగా, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆమె నయాగారా ఫాల్స్ లో దూకిందని నిర్ధారణకు వచ్చారు. ఆమె తన ఇద్దరు పిల్లలతో నయాగరా ఫాల్స్ లో పడిపోయారన్న వార్త రాగానే, రెస్క్యూ బృందాలను అక్కడికి తరలించారు. న్యూయార్క్ మెరైన్ పెట్రోలింగ్, ఏవియేషన్, అండర్ వాటర్ రికవరీ యూనిట్లు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.
డ్రోన్లతో రెస్క్యూ ఆపరేషన్..
అదనంగా, న్యూయార్క్ రాష్ట్ర పోలీసులు మానవరహిత విమాన వ్యవస్థలను కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో మోహరించారు. దర్యాప్తు కొనసాగుతోందని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన చియాంటి నయాగరా జలపాతం సమీపంలో నివసిస్తోంది. తన ముగ్గురు పిల్లల్లో 9 సంవత్సరాల రోమన్ రోస్మన్, చిన్నారి మక్కా మీన్స్ ను ఆమె తనతో పాటు నయాగరా ఫాల్స్ కు తీసుకువెళ్లింది. బుధవారం వరకు వారి మృతదేహాల ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు.
బంధుమిత్రుల ఆవేదన
లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం చియాంటి గృహ హింస కౌన్సిలర్ గా పనిచేసింది. ఆమె మరణవార్త తెలిసిన కొద్దిసేపటికే స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి నివాళులు వెల్లువెత్తాయి. ‘‘ఆమె గురించి ఒక పోస్ట్ రాయడం, ఆమె జ్ఞాపకాలను పంచుకోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది.’’ అని ఆమె స్నేహితుడు స్పందించాడు. ‘‘ఆమెను, ఆమె పిల్లలను నేను, నా పిల్లలు ఎంతగానో ప్రేమిస్తున్నారు’’ అని మరొక వ్యక్తి స్పందించాడు.