Satya Nadella: సత్య నాదెళ్ల, లింక్డ్ఇన్ లకు రూ.27 లక్షల జరిమానా విధించిన కార్పొరేట్ వ్యవహారాల శాఖ
Satya Nadella: మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ప్రముఖ ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫామ్ లింక్డ్ ఇన్ లకు భారత దేశ కార్పొరేట్ వ్యవహారాల శాఖ భారీ జరిమానా విధించింది. కంపెనీల చట్టం నిబంధనలను ఉల్లంఘించిన నేరంపై ఈ జరిమానా విధించింది.
Satya Nadella: మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని లింక్డ్ ఇన్ ఇండియా, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో పాటు మరో ఎనిమిది మంది వ్యక్తులకు కంపెనీల చట్టం కింద కంపెనీస్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ. 27 లక్షల జరిమానా విధించింది. 2016 డిసెంబర్లో ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫామ్ లింక్డ్ ఇన్ ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ గ్రూప్ అనుబంధ సంస్థగా లింక్డ్ ఇన్ ఇండియా ఏర్పాటైంది.
కంపెనీల చట్టం, 2013 ఉల్లంఘన
63 పేజీల ఉత్తర్వుల్లో లింక్డ్ఇన్ ఇండియా, వ్యక్తులు కంపెనీల చట్టం, 2013 ప్రకారం సిగ్నిఫిషియెంట్ బెనిఫీషియల్ ఓనర్ (SBO) నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంది. ‘‘సత్య నాదెళ్ల, ర్యాన్ రోస్లాన్స్కీ లింక్డ్ ఇన్ ఎస్బీవోలుగా ఉన్నారని, సెక్షన్ 90(1) ప్రకారం రిపోర్టు చేయనందున చట్టంలోని సెక్షన్ 90(10) కింద జరిమానా విధించాం’’ అని కార్పొరేట్ వ్యవహారాల శాఖ పేర్కొంది. 2020 జూన్ 1న లింక్డ్ఇన్ కార్పొరేషన్ గ్లోబల్ సీఈఓగా రియాన్ రోస్లాన్స్కీ నియమితులయ్యారని, సత్య నాదెళ్లకు రిపోర్ట్ చేయడం ప్రారంభించారని మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్వోసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. కంపెనీకి సంబంధించి ఎస్బీఓను గుర్తించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు కంపెనీ, దాని అధికారులు చర్య తీసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మొత్తం రూ. 27 లక్షల జరిమానా
నిబంధనల ఉల్లంఘనకు గానూ లింక్డ్ఇన్ ఇండియా, సత్య నాదెళ్ల, లింక్డ్ఇన్ సీఈఓ ర్యాన్ రోస్లాన్స్కీ, మరో ఏడుగురికి ఆర్వోసీ మొత్తం రూ.27,10,800 జరిమానా విధించింది. వీరిలో లింక్డ్ఇన్ ఇండియాకు రూ.7 లక్షలు, సత్య నాదెళ్లకు రూ.2 లక్షలు, రోస్లాన్స్కీకి రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించారు. అలాగే, కీత్ రేంజర్ డోలివర్, బెంజమిన్ ఓవెన్ ఓర్న్డార్ఫ్, మిచెల్ కట్టీ ల్యూంగ్, లిసా ఎమికో సాటో, అశుతోష్ గుప్తా, మార్క్ లియోనార్డ్ నాడ్రెస్ లెగాస్పి, హెన్రీ చినింగ్ ఫోంగ్ లకు కూడా జరిమానా విధించారు. ఈ ఉత్తర్వులు అందిన తేదీ నుంచి 60 రోజుల్లోగా రీజనల్ డైరెక్టర్ (ఎన్ఆర్)లో ఈ ఉత్తర్వులపై అప్పీల్ చేసుకోవచ్చు.