Mamata Banerjee: ‘‘అప్పుడు మమత బెనర్జీ తన గదిలోని లైట్లు అన్నీ అర్పి వేసి చీకట్లో కూర్చున్నారు’’- టీఎంసీ ఎంపీ
12 June 2024, 15:04 IST
జూన్ 9వ తేదీన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన గదిలోని లైట్లన్నింటినీ ఆర్పి వేసి చీకట్లో కూర్చున్నారని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సాగరిక ఘోష్ అన్నారు. ప్రధాని మోదీపై, బీజేపీపై మమత బెనర్జీ అలుపెరగని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు తన గదిలోని అన్ని లైట్లను ఆపివేసి పూర్తిగా చీకట్లో కూర్చున్నారని తృణమూల్ కాంగ్రెస్ (TMC) రాజ్యసభ సభ్యురాలు సాగరికా ఘోష్ వెల్లడించారు. మోదీ ప్రమాణ స్వీకారం ‘‘రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధం’’ అని మమత వ్యాఖ్యానించారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి తనకు ఆహ్వానం వచ్చినా, తాను వెళ్లనని మమత స్పష్టం చేశారు. చివరకు మూడోసారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మోదీకి శుభాకాంక్షలు చెప్పడానికి కూడా ఆమె నిరాకరించారు.
సాగరిక ఘోష్ ట్వీట్
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయడంపై సాగరిక ఘోష్ ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. మోదీ ప్రమాణ స్వీకారం సమయంలో మమత బెనర్జీ తన గదిలోని లైట్స్ అన్నీ ఆర్పి వేసి చీకట్లో కూర్చున్నారని సాగరిక వెల్లడించారు. ప్రధాని మోదీ నైతికంగా ఓడిపోయారని ఆమె విమర్శించారు. ‘మోదీ తానే కేంద్రంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుని, బీజేపీకి మెజారిటీని సాధించలేకపోయారు. స్వయంగా వారణాసిలో దాదాపు ఓడిపోయారు. అయోధ్యలో ఓడిపోయారు. ప్రజలు ఆయనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అయినా, ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో భారతదేశంలోని ఏకైక మహిళా సీఎం అయిన మమత బెనర్జీ తన గదిలోని లైట్స్ అన్నీ ఆర్పివేసి చీకట్లో కూర్చున్నారు’’ అని సాగరిక ఘోష్ ట్వీట్ చేశారు. మోదీని తొలగించి కొత్త నేతను బీజేపీ ఎన్నుకోవాలని ఆమె సూచించారు.
మోదీకి విషెస్ చెప్పను..
‘‘అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా ఏర్పడిన మోదీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పబోనని తన పార్టీ ఎంపీలతో భేటీ సందర్భంగా మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. ‘‘బీజేపీకి ఓటు వేయని దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. భవిష్యత్తులో విపక్ష ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా ఆమె సంకేతాలు ఇచ్చారు. ‘‘ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాకపోయినంత మాత్రాన, రేపు ఆ పని చేయదని అనుకోవద్దు. అవకాశం కోసం వెయిట్ చేద్దాం. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది’’ అన్నారు. దేశంలో మోదీని ఎవరూ కోరుకోవడం లేదన్నారు.
బీజేపీ మండిపాటు
టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ వ్యాఖ్యలు, ఆమె చీకట్లో కూర్చున్నారన్న వార్తలపై బీజేపీ మండిపడింది. ‘‘ముఖ్యమంత్రి లైట్లు ఆర్పివేసినప్పుడు ఆమె కుటుంబం నుంచి ఎవరైనా వెనుక నుంచి తోసేశారా అని ఆరా తీయాలి. లైట్లు ఆర్పేయడం ఆమెకు సురక్షితం కాదు. ఆమె ఎల్లప్పుడూ లైట్లు వెలిగించాలి. తదుపరి ముఖ్యమంత్రి కావడానికి ఎవరైనా ఆమెను వెనుక నుంచి నెట్టివేస్తే అది సమస్య అవుతుంది’’ అని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.