Living Nostradamus: ‘‘అమెరికా, చైనాల వల్ల మరో ప్రపంచ యుద్ధం తప్పదు’’ - లివింగ్ నోస్ట్రడామస్ సంచలన జోస్యం
27 September 2024, 22:22 IST
Living Nostradamus: భవిష్యత్ లో జరిగే సంఘటనలను కచ్చితత్వంతో అంచనా వేస్తున్న, లివింగ్ నోస్ట్రాడమస్ గా పేరుగాంచిన అథోస్ సలోమే.. తాజాగా మూడో ప్రపంచ యుద్ధం గురించి జోస్యం చెప్పాడు. ఈయన కోవిడ్ మహమ్మారిని, ఇటీవలి మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని ముందే ఊహించాడు.
లివింగ్ నోస్ట్రాడమస్ అథోస్ సలోమే
Living Nostradamus: మైక్రోసాఫ్ట్ సేవలకు ఈ ఏప్రిల్ నెలలో కలిగిన అంతరాయం, ప్రపంచాన్న కుదిపేసిన కరోనావైరస్ మహమ్మారి.. మొదలైన సంఘటనలను ముందే ఊహించిన లివింగ్ నోస్ట్రడామస్ అథోస్ సలోమే (Athos Salomé) ఇప్పుడు అమెరికా, చైనాల మధ్య నెలకొన్న సంఘర్షణాత్మక వాతావరణం గురించి మరో భయంకరమైన జోస్యం చెప్పారు. బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలు, క్వీన్ ఎలిజబెత్ మరణం సహా పలు విషయాలను కచ్చితమైన అంచనాతో బ్రెజిల్ కు చెందిన అథోస్ సలోమే ముందే చెప్పారు.
యూఎస్, చైనా ల వల్ల యుద్ధం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం అంచున ఉందని, ముందు ముందు మరింత ‘‘ఘోరం’’ చూస్తామని అని ఇటీవల ఆయన పేర్కొన్నారు. అమెరికా, చైనాల మధ్య సంఘర్షణ మరింత పెరిగి, యుద్ధానికి దారి తీయవచ్చని, అది క్రమంగా మూడో ప్రపంచ యుద్ధంగా మారవచ్చని అథోస్ సలోమే జోస్యం చెప్పారు.
సౌత్ చైనా సీ వల్ల..
సౌత్ చైనా సీ పై ఆధిక్యత కోసం అమెరికా, చైనాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాలుస్తుందన్నారు. ఈ ప్రాంతంలో ప్రాదేశిక వివాదాలు, సైనిక ఉనికి కారణంగా దక్షిణ చైనా సముద్రం అస్థిరంగా మారే అవకాశం ఉందన్నారు. అంతేకాక, ‘‘అతిపెద్ద సైబర్ దాడి అమెరికా జాతీయ భద్రతను దెబ్బతీస్తుంది. దాంతో, అది అనుకోకుండా యుద్ధాన్ని ప్రేరేపిస్తుంది’’ అని వివరించారు. ఇటువంటి ఆందోళనలను "నిజమైనవి" అని సలోమే పేర్కొన్నారు. పెరుగుతున్న చైనా మార్కెట్, అలాగే, రష్యాతో బలోపేతమవుతున్న చైనా సంబంధాలను ఉదహరిస్తూ.. ఈ పరిణామాల వల్ల అంతర్జాతీయంగా భిన్న ధృవాల మధ్య తీవ్రమైన ఘర్షణాత్మక వాతావరణం నెలకొంటుందన్నారు. ప్రాంతీయ కలహాలు ప్రపంచ యుద్ధంగా మారే పరిస్థితి నెలకొంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఆధిపత్య సవాళ్లు
అమెరికన్ సైనిక బలం, దాని మిత్రపక్షాలు తన ఆధిపత్యానికి సవాళ్లుగా చైనా భావిస్తుంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య పోరాటంగా కనిపిస్తున్నప్పటికీ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తమ నియంత్రణను కొనసాగించడానికి అమెరికా, చైనాలు మరింత తీవ్రంగా కృషి చేస్తాయి’’ అని సలోమే విశ్లేషించారు. దక్షిణ చైనా సముద్రం (South China Sea) లో వివాదాస్పద దీవులను సైనిక స్థావరాలుగా మార్చి పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచిన చైనా (china) చర్యలు ఈ పోటీని మరింత పెంచాయని ఆయన అన్నారు. ప్రాంతీయ సంఘర్షణలు యావత్ ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఆసియా ఉదంతాన్ని ఒక స్పష్టమైన ఉదాహరణగా భావించవచ్చని ఆయన అన్నారు.
మూడు రోజుల చీకటి
2024 లో "మూడు రోజుల చీకటి" గురించి ప్రవచించిన సలోమే, దక్షిణ చైనా సముద్రంలో ఒక పెద్ద సంఘటనను లేదా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే అత్యంత నైపుణ్యం కలిగిన సైబర్ దాడిని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. గతంలో సలోమే అంచనాలు నిజమైన నేపథ్యంలో, ఇప్పుడు ఆయన చెప్పిన జోస్యం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.