Russia birth rate : ‘వర్క్ బ్రేక్‌ని ఉపయోగించుకోండి- పిల్లల్ని కనండి' రష్యా వింత విజ్ఞప్తి!
రష్యాలో జననాల రేటు నానాటికి పడిపోతోంది. పిల్లల్ని కనేందుకు ఎవరు ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో.. ప్రజలకు ప్రభుత్వం ఒక వింత విజ్ఞప్తి చేసింది. ‘వర్క్ బ్రేక్‌ని ఉపయోగించుకోండి, పిల్లల్ని కనండి,’ అని చెబుతోంది!
రష్యాలో నానాటికి పడిపోతున్న జననాల రేటును పెంచేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి. ప్రజలు తమ పని విరామాలను (మధ్యాహ్న భోజనం, కాఫీ విరామాలు) సెక్స్ కోసం ఉపయోగించుకోవాలని పుతిన్ విజ్ఞప్తి చేశారు!
russiమెట్రా సంస్థ డేటా ప్రకారం.. రష్యాలో సంతానోత్పత్తి రేటు ప్రస్తుతం ప్రతి మహిళకు 1.5 పిల్లలుగా ఉంది. ఇది జనాభాను కొనసాగించడానికి అవసరమైన 2.1 రేటుతో పోల్చుకుంటే చాలా తక్కువ.
క్షీణిస్తున్న జననాల రేటుపై ప్రభుత్వ స్పందన..
ప్రజలపై ఉన్న పని భారమే వారు కుటుంబాలను మొదలుపెట్టేందుకు ఇష్టపడకపోవడానికి కారణన్న వాదనలను రష్యా ఆరోగ్య మంత్రి డాక్టర్ యెవ్జెనీ షెస్టోపలోవ్ కొట్టివేశారు. "జీవితం చాలా వేగంగా ఎగురిపోతుంది," అని షెస్టోపాలోవ్ వ్యాఖ్యానించారు. 12 నుంచి 14 గంటలు పనిచేసేవారు కూడా సంతానోత్పత్తి కోసం వారి విరామాలను ఉపయోగించాలని అన్నారు.
రష్యా ప్రజల రక్షణ తమ అత్యున్నత జాతీయ ప్రాధాన్యమని పుతిన్ గతంలోనే స్పష్టం చేశారు. “రష్యా భవితవ్యం. మనలో ఎంతమంది ఉంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమస్య,” అని అన్నారు.
ఆందోళనకరమైన గణాంకాలు- విధాన చర్యలు..
రష్యా జననాల రేటు క్షీణత 1999 కన్నా కనిష్టానికి చేరుకుంది. జూన్‌లో 100,000 కంటే తక్కువ జననాలు నమోదయ్యాయి.యూరో న్యూస్ రష్యా అధికారిక గణాంకాల సంస్థ రోస్టాట్ను ఉటంకిస్తూ, గత సంవత్సరంతో పోలిస్తే 2024 మొదటి అర్ధభాగంలో 16,000 తక్కువ జననాలు జరిగాయని వెల్లడించింది. అదనంగా, జనాభా క్షీణత 18% వేగవంతమైంది. ఈ సంవత్సరం 49,000 మరణాలు నమోదయ్యాయి. ఇది ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్దం వల్ల మరింత తీవ్రమైంది.
ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి, జనన రేటును పెంచడానికి ఉద్దేశించిన అనేక చర్యలను రష్యా ప్రవేశపెట్టింది. మాస్కోలో 18-40 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఉచిత సంతానోత్పత్తి చెకింగ్ చేయించుకోవాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. తమ మహిళా సిబ్బందిని పిల్లలను కనడానికి ప్రేరేపించేలా యజమానులపై ఒత్తిడి తెచ్చే విధానాలను ఎంపీ తత్యానా బుట్స్కయా ప్రతిపాదించారు. అదనంగా, చెల్యాబిన్స్క్ ప్రాంతం వారి మొదటి బిడ్డకు జన్మనిచ్చిన 24 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళా విద్యార్థులకు £8,500 అందిస్తోంది. ప్రభుత్వం గర్భస్రావానికి యాక్సెసబిలిటీని కూడా పరిమితం చేస్తోంది. ప్రజాప్రతినిధులు, మత పెద్దలు సంతానోత్పత్తి, పెంపకంలో మహిళల పాత్రను సమర్థిస్తున్నారు. అంతేకాకుండా, దంపతులు విడిపోవడాన్ని తగ్గించేందుకు విడాకుల ఫీజులను పెంచారు.
రాజకీయ నాయకురాలు అన్నా కుజ్నెత్సోవా కూడా చిన్న వయస్సు వారు పిల్లలు కనాలని పిలుపునిచ్చారు. మహిళలు 19 లేదా 20 సంవత్సరాల వయస్సులో పిల్లలను కనడం ప్రారంభించాలని, తద్వారా కుటుంబాలు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనొచ్చని అన్నారు.
రష్యా ప్రభుత్వ తీసుకుంటున్న ఈ వివాదాస్పద వ్యూహాలు.. దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన జనాభా సవాళ్లను, క్షీణతను తిప్పికొట్టడానికి తీసుకుంటున్న తీవ్రమైన చర్యలను ప్రతిబింబిస్తాయి.
రష్యా ఒక్కటే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో జననాల రేటు ఆందోళనకరంగా మారింది. ఫలితంగా ప్రభుత్వాలు వింత, విచిత్ర పథకాలతో ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి.
సంబంధిత కథనం