East Godavari Tragedy : తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. అమెరికాలో పెరవలి యువకుడు మృతి
East Godavari Tragedy : అమెరికాలో ఏపికి చెందిన యువకుడు మృతి చెందారు. దీంతో ఆ యువకుడి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. అతని మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామానికి చెందిన యువకుడు అమెరికాలో మృతి చెందాడు. కానూరు గ్రామానికి చెందిన చిలుకూరి రాఘవ దొర (24) అమెరికాలోని టెక్సాస్ స్టేట్ డల్లాస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇటీవలి పూర్తి చేశాడు. గత కొద్ది కాలంగా అక్కడే ఉంటూ.. ఉద్యోగ అన్వేషణ చేస్తున్నారు. సోమవారం రాఘవ దొరకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో.. స్నేహితులు ఆసుపత్రిలో చేర్పించారు. కొద్ది సేపటికే మరణించినట్లు అక్కడి వైద్యులు చెప్పారు.
ఈ విషయాన్ని స్నేహితులు రాఘవ దొర కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించారు. కుమారుడి మరణవార్త విన్న తల్లిదండ్రులు తల్లడిల్లి పోయారు. ప్రయోజకుడు అవుతాడనుకున్న కుమారుడు అర్థాంతరంగా మరణించడంతో భరించలేకపోతున్నారు. ఉన్నత చదువులు చదివిన తమ కుమారుడు ఇక లేడన్న వార్తను తట్టుకోలేకపోతున్నారు. కుమారుడి జ్ఞాపకాలను తలచుకుంటూ తల్లిదండ్రులు రోధిస్తున్నారు. బంధువుల కన్నీరు మున్నీరు అయ్యారు.
చిలుకూరి రాఘవ దొర నడుపల్లి మాజీ సర్పంచ్ ఈడుపుగంటి దొరయ్య (వల్లభరావు) మనవడు. డల్లాస్ నుండి యువకుడి మృతదేహం మంగళవారం స్వగ్రామం కానూరు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగ అన్వేషణలో పరాయి దేశం వెళ్లి రాఘవ దొర మృత్యువాత పడటంతో.. కానూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్నేహితులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ కన్నీరుమున్నీరు అయ్యారు.
న్యూజిలాండ్ వెళ్లేందుకు సిద్ధపడి..
ఉద్యోగం కోసం న్యూజిలాండ్ వెళ్లాలని వర్కింగ్ వీసా, విమాన టిక్కెట్లతో సిద్ధమైన యువకుడు కరెంట్ షాక్ తో సోమవారం మృతి చెందాడు. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి, ఆర్థికంగా కుటుంబాన్ని బలోపేతం చేయాలని ఆ యువకుడు కన్న కలలను విద్యుదాఘాతం చిదిమేసింది. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులోని ఎనికేపాడు జెండా చెట్టు సెంటర్ రోడ్డులో.. దర్శినాల శంకర్, రమణ దంపతులకు నివాసం ఉంటున్నారు. వీరికి దర్శినాల వినోద్ కుమార్ (30), ప్రమోద్ కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు వినోద్ కుమార్ తల్లిదండ్రులు, భార్య సంధ్యతో కలిసి గ్రామంలో ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.
వర్కింగ్ వీసాతో పాటు విమాన టిక్కెట్లు కూడా వినోద్ కుమార్ సమకూర్చుకున్నారు. అంతలోనే విద్యుత్ షాక్ ఆ యువకుడు ప్రాణాలను బలితీసుకుంది. సోమవారం నాడు బాల్కనీలో కాళ్లు శుభ్రం చేసుకుంటుండగా.. ప్రమాదవశాత్తూ పిట్ట గోడకు ఆనుకుని ఉన్న విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై వినోద్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు, భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)