LIC IPO | ఐపీఓకు దూరంగా 'ఎఫ్ఐఐలు'.. మదుపర్లకు నష్టాలు తప్పవా?
09 May 2022, 16:19 IST
- LIC IPO | ఎల్ఐసీ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ముగిసింది! ఇక ఇప్పుడు లిస్టింగ్ డేపైనే అందరి చూపు ఉంది. కాగా.. దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు ఎఫ్ఐఐలు దూరంగా ఉండిపోయారు. ఇది లిస్టింగ్‌పై ఏ విధంగా ప్రభావం చూపనుంది?
ఎల్ఐసీ ఐపీఓకు ఎఫ్ఐఐలు దూరం!
LIC IPO news | స్టాక్ మార్కెట్ల కదలికల్లో ఎఫ్ఐఐ(ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్)లది కీలక పాత్ర. ఇందుకు తాజా పరిణామాలో ఉదాహరణ. 8నెలలుగా.. ఎఫ్ఐఐలు అమ్మకాలవైపు ఉండటంతో దేశీయ సూచీలు భారీగా పతనమవుతున్నాయి. అలాంటి కీలకమైన ఎఫ్ఐఐలు.. ఎల్ఐసీ ఐపీఓకు దూరంగా ఉండిపోయారు! మరి ఇప్పుడు ఐపీఓ పరిస్థితేంటి? నష్టాలు తప్పవా?
ఎఫ్ఐఐలు 2శాతమే..!
దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు బలమైన యాంకర్ బుక్ లభించింది. కానీ అందులో కూడా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లే ఎక్కువగా ఉన్నారు. ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల కోసం కేటాయించిన మొత్తంలో.. ఎఫ్ఐఐలు కేవలం 2శాతం షేర్లకే ఆర్డర్లు ప్లేస్ చేయడం గమనార్హం.
ఇందుకు కారణాలు చాలా ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు.
"అక్టోబర్ నుంచి ఎఫ్ఐఐలు భారీగా అమ్మేస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, రుపాయి పతనంతో ఇండియాలో వారికున్న లాభాలు చెదిరిపోతాయని వారు భావిస్తున్నారు. అందుకే ఐపీఓపై వారు పెద్దగా ఆసక్తి చూపించలేదు," అని ప్రైమ్ఇన్వెస్టర్.ఇన్‌కు చెందిన విద్య బాలా వెల్లడించారు.
ఎల్ఐసీ భవిష్యత్తుపై ఎఫ్ఐఐలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.
"ఎల్ఐసీ మార్కెట్ షేరు కోసుకుపోతుందని పెట్టుబడిదారులు అనుమానిస్తున్నారు. కరోనా మహమ్మారితో ప్రైవేటు బిమా సంస్థలు తమ జోరును పెంచాయి. కాగా.. ప్రభుత్వ రంగ సంస్థలపై ఎఫ్ఐఐలకు ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. ప్రభుత్వం నడిపే ఆయా సంస్థల షేర్లతో డబ్బులు సంపాదించడం కష్టమని వారు భావిస్తుంటారు. అదే సమయంలో విదేశీ పెట్టుబడిదారులను తమవైపు తిప్పుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి! ప్రభుత్వానికి కాకుండా.. పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా ఎల్ఐసీ నడుచుకుంటుందన్న నమ్మకాన్ని కలిగించలేకపోయింది," అని పైపర్ సెరిక అడ్వైజర్ లిమిటెడ్‌కు చెందిన ఫండ్ మేనేజర్ అభయ్ అగర్వాల్ పేర్కొన్నారు.
కాగా.. ఏడాది కాలంలో ఎన్నో ఐపీఓలు మార్కెట్లోకి వచ్చాయి. వాటిల్లో చాలా సంస్థల కోసం ఎఫ్ఐఐలు ఎగబడ్డారు. జొమాటోకు భారీగా, పేటీఎం ఐపీఓకు కాస్త ఆసక్తి చూపించారు. ప్రస్తుతం ఆ రెండు స్టాక్స్.. లిస్టింగ్‌తో పోల్చుకుంటే చాలా దారుణంగా పడిపోయాయి.
మరి ఈ పరిస్థితుల్లో ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్ ఎలా ఉంటుంది? అన్న ప్రశ్న మదుపర్లకు కలుగుతోంది.
ఎల్ఐసీ ఐపీఓ సబ్స్క్రిప్షన్
LIC IPO subscription | ఎల్ఐసీ ఐపీఓ సబ్స్క్రిప్షన్ దాదాపు ముగింపునకు చేరింది. కొన్ని గంటల తర్వాత ఐపీఓను సబ్‌స్క్రైబ్ చేసుకోలేరు. ప్రస్తుత ఐపీఓ సబ్స్క్సిప్షన్ వివరాలను తెలుసుకుందాము.
- క్యూఐబీ:- 2.22X
- ఎన్ఐఐ:- 2.12X
- రిటైల్:- 1.85X
- ఉద్యోగులు:- 5.73X
- పాలసీదారులు:- 2.55X
ఐపీఓ వివరాలు:-
- LIC IPO details | ఐపీఓ సైజు:- రూ. 21వేల కోట్లు (దేశంలోనే అతిపెద్ద ఐపీఓ)
- ఐపీఓ డేట్:- మే 4- మే 9
- ఐపీఓ ప్రైజ్:- రూ. 902- రూ. 949/షేరు. కచ్చితంగా షేర్లు అలాట్ అవ్వాలంటే.. అప్పర్ బ్యాండ్(రూ. 949)తో బిడ్లు వేయడం ఉత్తమం.
- అప్లికేషన్ లిమిట్:- ఒక వ్యక్తి.. 14 ఐపీఓ బిడ్లను అప్లై చేసుకోవచ్చు.
- పాలసీదారులకు డిస్కౌంట్:- షేరు మీద రూ. 60
- ఎల్ఐసీ ఉద్యోగులకు డిస్కౌంట్:- షేరు మీద రూ. 45
- అలాట్మెంట్ డేట్:- మే 12
- ఐపీఓ లిస్టింగ్:- మే 17 (బీఎస్ఈ, ఎన్ఎస్ఈ)
ఎల్ఐసీ ఐపీఓ జీఎంపీ:-
LIC IPO GMP | ఎల్ఐసీ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం.. ప్రస్తుతం రూ. 40గా ఉంది. గత వారం చివర్లో ఇది రూ. 60గా ఉండటం గమనార్హం.
ఐపీఓకు వచ్చే కంపెనీల షేర్లు తొలుత గ్రే మార్క్ట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. దీని బట్టి.. ఐపీఓ లాభాల్లో లిస్ట్ అవుతుందా? లేక నష్టాల్లో లిస్ట్ అవుతుందా? అని మార్కెట్ వర్గాలు అంచనాలు వేసుకుంటాయి. లిస్టింగ్ లాభాలు, స్వల్పకాలిక పెట్టుబడుల కోసం ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ట్రేడర్లు, పెట్టుబడిదారులు ఈ గ్రే మార్కెట్ ప్రీమియంను ఫాలో అవుతూ ఉంటారు.
టాపిక్