Stock market | ఇంకెన్నాళ్లు ఈ 'పతనం'.. మదుపర్లు ఇప్పుడు ఏం చేయాలి?
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నారు. మరి వచ్చే వారం పరిస్థితి ఏంటి? ఎలాంటి అంశాలు మార్కెట్ల కదలికలపై ప్రభావం చూపించగలవు?
stock market outlook for next week | అమెరికా స్టాక్ మార్కెట్లలో మొదలైన అమ్మకాల ఒత్తిడి.. ప్రపంచ దేశాల సూచీలను కుదిపేస్తోంది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంతో ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవచ్చన్న అంచనాలతో మదుపర్లు విపరీతంగా షేర్లను విక్రయిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టమని, ఫలితంగా ఫెడ్ మరిన్ని చర్యలు చేపట్టవచ్చని మదుపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ సూచీలు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. మరి వచ్చే వారం పరిస్థితులు ఎలా ఉండనున్నాయి?
ఇవే కీలకం..
2021 అక్టోబర్‌లో ఇండియా స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ హైని నమోదు చేశాయి. అప్పటి నుంచి డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి. ఒమిక్రాన్‌తో కూడిన మూడో వేవ్, రష్యా ఉక్రెయిన యుద్ధం, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో సూచీలు భారీ ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.
Stock market news | ఈ నేపథ్యంలో వచ్చే వారం దలాల్ స్ట్రీట్‌ను ప్రభావితం చేసే అంశాలను తెలుసుకోవడం ముఖ్యం. అవేంటంటే..
- త్రైమాసిక ఫలితాలు:- 2022 జనవరి- మార్చ్ క్యూ4 ఫలితాల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని సంస్థలు ఫలితాలను వెల్లడించాయి. కాగా ఈ వారం పలు కీలక కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నారు. అనేక సెక్టార్లకు చెందిన స్టాక్స్ భవిష్యత్తు కదలికలు వీటిపై ఆధారపడి ఉంటాయని నిపుణులు అంటున్నారు.
- ద్రవ్యోల్బణం, బాండ్ యీల్డ్స్:- ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని ఆర్బీఐ వెల్లడించింది. కమోడిటీ ధరలు ఇప్పటికే భారీగా పెరిగాయి. ఆహార ఉత్పత్తుల ధరలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. బాండ్ యూల్డ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. కంపెనీలకు ఖర్చులు ఎక్కువై, క్యాష్ తగ్గుతుందని ఇవి సూచిస్తున్నాయి. దేశంలో ద్రవ్యోల్బణం పరిస్థితులు, వినియోగదారుల కొనుగోళ్ల శక్తి.. స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయగలవు.
- అంతర్జాతీయ పరిణామాలు:- డాలర్ ఇండెక్స్ 20ఏళ్ల గరిష్ఠానికి చేరింది. స్వల్పకాలంలో డాలర్ డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా ఎఫ్ఐఐ(ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు)లు అమ్మకాలవైపే ఉండొచ్చు. డాలర్ కదలికల్లో మార్పులు వస్తే.. ఎఫ్ఐఐ మనసు మారవచ్చు! అందువల్ల డాలర్ ఇండెక్స్‌ను పరిశీలిస్తుండటం అవసరం. అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం, బాండ్ యూల్డ్స్ కీలకం. ఫెడ్ రేట్ హైక్‌తో మార్కెట్లు పడ్డాయి. అమెరికా, యూరోప్ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎలా మారుతాయి అన్న అంశంపై ఇండియా మార్కెట్ల ఒడిదొడుకులు ఆధారపడే అవకాశం ఉంది.
- ఎఫ్ఐఐలు మారితేనే:- గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఐఐలు భారీగా అమ్మకాలు చేస్తున్నారు. ఇందుకు దేశీయ స్టాక్ మార్కెట్లేవీ అతీతం కాదు. రోజూ.. కొన్ని వేల కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించేస్తున్నారు. అందువల్ల.. డీఐఐ(డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు) ఎంత భారీగా కొనుగోళ్లు చేస్తున్నా, మార్కెట్లు లాభాలను చూడటం లేదు. అందువల్ల ఎఫ్ఐఐలపై ఓ కన్నేసి ఉంచాలి. వారు అమ్మకాల జోరును కొనసాగించారా? లేక కొనుగోళ్లు మొదలుపెట్టారా? అన్నది ఎన్ఎస్ఈ సైట్లో చూడవచ్చు.
- కమోడిటీ ధరలు:- చమురు, మెటల్ ధరలు పెరిగితే.. ముడిసరకు ధరలు పెరుగుతాయి. ఫలితంగా కంపెనీల మార్జిన్లు కోసుకుపోతాయి. ఇది కంపెనీలకు నష్టమే. అందువల్ల స్టాక్ మార్కెట్లకు కూడా నష్టమే. మొత్తం మీద.. చమురు, లోహాల ధరలను మార్కెట్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటాయి.
'ఆ రోజులు పోయాయి..'
Stock market outlook | స్టాక్ మార్కెట్ల నుంచి సులభంగా డబ్బులు సంపాదించే రోజులు పోయాయని, మంచి రిటర్నుల కోసం మదుపర్లు ఇక కష్టపడాల్సిందేనని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ ఎండీ సునీల్ నైతి పేర్కొన్నారు. క్వాలిటీ స్టాక్స్‌నే ఎంచుకుని, హోల్డ్ చేయాలని సూచిస్తున్నారు. కంపెనీ భవిష్యత్తు బాగుంటుంది అని అనుకునే సంస్థల షేర్లను పరిశీలించాలని అంటున్నారు.
(గమనిక: ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. నిపుణుల అభిప్రాయాలతో హిందుస్థాన్ టైమ్స్‌కు ఎలాంటి సంబంధం లేదు. స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టేముందు.. మీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం)
సంబంధిత కథనం
టాపిక్