Kolkata doctor rape : సంజయ్ రాయ్‌పై లై డిటెక్టర్ పరీక్ష- అసలు నిజం బయటపడిందా? నిందితుడు ఏం చెప్పాడంటే..
26 August 2024, 7:19 IST
- Sanjay Roy polygraph test : కోల్‌కతా వైద్యురాలి హత్య కేసు ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై లై డిటెక్టర్ పరీక్ష జరిగింది. తాను చూసేసరికే, వైద్యురాలి మరణించిందని అతను చెప్పినట్టు సమాచారం!
కోల్‌కతా వైద్యురాలి హత్య కేసు నిందితుడు..
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై లై డిటెక్టర్ పరీక్ష (పాలిగ్రాఫ్ టెస్ట్) జరిగింది. ఇందులో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. తాను సెమినార్ హాల్‌కి చేరుకునే సరికే బాధితురాలు చనిపోయిందని ప్రధాన నిందితుడు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసులో తాను నిర్దోషి అని సంజయ్ రాయ్ కోర్టులో చెప్పిన కొన్ని రోజులకే అతనికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు అధికారులు.
లై డిటెక్టర్ పరీక్షలో అనేక తప్పుడు, నమ్మశక్యం కాని సమాధానాలు వెల్లడైనట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం ప్రచురించింది. లై డిటెక్టర్ పరీక్ష సమయంలో సంజయ్ రాయ్ ఆందోళనకు గురైనట్లు రిపోర్టు తెలిపింది.
పాలిగ్రాఫ్ టెస్ట్ సమయంలో సీబీఐ అధికారులు అనేక ఆధారాలను చూపించి ప్రశ్నించగా, తాను వేరే చోట ఉన్నట్టు సంజయ్ రాయ్ జవాబులు ఇచ్చినట్టు సమాచారం.
తాను చూసేసరికి అప్పటికే బాధితురాలు మృతి చెందిందని నిందితుడు పేర్కొన్నాడు. భయంతో అక్కడి నుంచి పారిపోయినట్లు లై డిటెక్టర్ పరీక్ష సయమంలో సంజయ్ రాయ్ తెలిపాడు.
అప్పుడు ఒప్పుకుని.. ఇప్పుడు..!
నేరం తర్వాత సంజయ్ రాయ్ అత్యాచారం, హత్య చేసినట్లు అంగీకరించాడని కోల్‌కతా పోలీసులు తెలిపారు. కానీ తనను ఇరికించారని, తాను నిర్దోషినని పేర్కొంటూ నిందితుడు యూటర్న్ తీసుకున్నాడు.
అత్యాచారం, హత్య గురించి తనకు ఏమీ తెలియదని సంజయ్ రాయ్ కొన్ని రోజుల క్రితం జైలు గార్డులకు చెప్పాడు. గత శుక్రవారం సీల్దాలోని అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం) కోర్టు ముందు కూడా ఇదే తరహా వాదనలు వినిపించారు.
అయితే దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకే కోల్‌కతా వైద్యురాలి హత్య కేసు ప్రధాన నిందితుడు మాట మారుస్తున్నట్టు ఓ సీబీఐ అధికారి హిందుస్థాన్ టైమ్స్‌కి తెలిపారు. అదే సమయంలో తన ముఖంపై ఉన్న గాయాలకు, నేరం జరిగిన సమయంలో భవనంలోనే ఉండటంపై అతను సరైన సమాధానాలు ఇవ్వలేదని ఆ అధికారి అన్నారు.
కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ సెమినార్ హాల్‌లో వైద్యురాలి మృతదేహం లభ్యమైన మరుసటి రోజే, ఆగస్టు 10న సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీ, బ్లూటూత్ హెడ్‌ఫోన్ ఆధారాలతో సంజయ్ రాయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 4 గంటల సమయంలో మృతదేహం లభ్యమైన కళాశాలలోని సెమినార్ హాల్లోకి సంజయ్ రాయ్ ప్రవేశించినట్లు దర్యాప్తు నివేదికలు చెబుతున్నాయి.
సంజయ్ రాయ్ 2019 నుంచి కోల్‌కతా పోలీసుల వద్ద పౌర వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్లుగా కొందరు సీనియర్ పోలీసు అధికారులతో సన్నిహితంగా మెలిగాడు. ఆ తరువాత అతన్ని కోల్‌కతా పోలీస్ వెల్ఫేర్ బోర్డుకు పంపించి.. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని పోలీస్ అవుట్ పోస్ట్‌లో నియమించారు.
ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా నలుగురికి శనివారం పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. ఢిదిలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) నుంచి కోల్‌కతా వచ్చిన పాలిగ్రాఫ్ నిపుణుల బృందం ఈ పరీక్షలను నిర్వహించింది.