మహిళలపై నేరాలు క్షమించరానివి.. కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం ఘటనపై ప్రధాని మోదీ!
Kolkata Doctor Rape Case : కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మహిళలపై నేరాల కేసులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దోషులు ఎలాంటి వారైనా శిక్ష తప్పదని హెచ్చరించారు.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. ఇది మహిళల భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళనకు కారణమైంది. పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర రాజకీయ యుద్ధానికి దారితీసింది. అయితే తాజాగా ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. మహిళలపై నేరాల కేసులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.
'మహిళల భద్రత చాలా ముఖ్యం. మహిళలపై జరిగే నేరాలు క్షమించరానివి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చెబుతున్నాను.. దోషులు ఎవరైనా సరే వారిని విడిచిపెట్టకూడదు.' అని మహారాష్ట్రలో జరిగిన లఖపతి దీదీ సమ్మేళనంలో ప్రధాని మోదీ అన్నారు.
'2014 వరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.25,000 కోట్ల కంటే తక్కువ రుణాలు ఇచ్చారు. కానీ గత 10 సంవత్సరాలలో రూ.9 లక్షల కోట్లు అందించారు.' అని ప్రధాని మోదీ చెప్పారు.
మోదీ ప్రభుత్వం లఖపతి దీదీ పథకాన్ని 23 డిసెంబర్ 2023న ప్రారంభించింది. ఈ పథకం ప్రధాన ఉద్దేశం దేశంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా మారేందుకు ఉపయోగడుతుంది. అలాంటి మహిళల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అధికారులు వడ్డీ లేకుండా రూ.5 లక్షల రుణం అందచేస్తారు. మహిళలు వ్యాపారాలను ప్రారంభించడానికి, ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు సాయపడుతుంది. ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల మహిళల కోసం మెుదలైంది.
మహారాష్ట్ర జల్‌గావ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం ఘటనపై స్పందించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలను పటిష్టం చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం మహిళల కోసం చాలా చేసిందన్నారు.