Kolkata Rape Case : కోల్‌కతా రేప్ కేసు నిందితుడు సంజయ్ రాయ్‌కి ముగిసిన పాలిగ్రాఫ్ టెస్ట్.. నేరాన్ని అంగీకరించాడా?
Kolkata Doctor Rape Case : కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈ పరీక్ష నిర్వహించింది. ఈ కేసులో నిందితుడు ఏం చెప్పాడు?
ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సంజయ్ రాయ్ అరెస్టైన విషయం తెలిసిందే. కోల్కతాలోని ప్రెసిడెన్సీ జైలులో నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. తనను ఇరికించారని సంజయ్ రాయ్ కోల్‌కతా కోర్టు న్యాయమూర్తికి తెలిపారు. పాలిగ్రాఫ్ పరీక్ష కోసం అతని నుంచి అనుమతి కోరగా తాను నేరం చేయలేదని సంజయ్ రాయ్ కోర్టులో కన్నీటి పర్యంతమయ్యాడు. పాలిగ్రాఫ్ పరీక్షలు తన నిర్దోషిత్వాన్ని రుజువు చేస్తాయని సంజయ్ చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి.
సంజయ్ రాయ్‌ను ప్రెసిడెన్సీ జైలుకు పంపినప్పటి నుంచి ఏదేదో విషయాలపై గొణుగుతూనే ఉన్నాడని తెలిసింది. జైలులోకి ప్రవేశించే సమయంలో సంజయ్ రాయ్ తనకు ఏమీ తెలియదని చెబుతూ వచ్చాడు. తనను ప్రశాంతంగా నిద్రపోనివ్వాలని రాయ్ కోరినట్లుగా సమాచారం.
అత్యాచారం, హత్య విషయం తనకు తెలియదని సంజయ్ రాయ్ జైలు గార్డులకు చెప్పినట్లుగా అంటున్నారు. అయితే అరెస్టు సమయంలో తన ప్రవర్తన వేరేలా ఉందని కూడా కొందరు చెప్పారు. డోంట్ కేర్ అనే వైఖరిని ప్రదర్శించినట్లు స్థానిక వార్తా కథనాలు వెల్లడించాయి. కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదని కోల్‌కతా పోలీసులు ధృవీకరించారు. అయితే తాజాగా తనపై వచ్చిన ఆరోపణలను సంజయ్ రాయ్ ఖండించాడు.
ఆర్‌జి కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా నలుగురికి శనివారం పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) నుంచి కోల్‌కతా వచ్చిన పాలిగ్రాఫ్ నిపుణుల బృందం ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయంలో మరో ఇద్దరికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
కోల్‌కతా ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ సెమినార్ హాల్‌లో వైద్యురాలి మృతదేహం లభ్యమైన మరుసటి రోజే ఆగస్టు 10న సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీ, బ్లూటూత్ హెడ్‌ఫోన్ కారణంగా సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు. ఉదయం 4 గంటల సమయంలో మృతదేహం లభ్యమైన కళాశాలలోని సెమినార్ హాల్లోకి సంజయ్ రాయ్ ప్రవేశించినట్లు దర్యాప్తు నివేదికలు చెబుతున్నాయి.
సంజయ్ రాయ్ 2019 నుంచి కోల్‌కతా పోలీసుల వద్ద పౌర వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్లుగా కొందరు సీనియర్ పోలీసు అధికారులతో సన్నిహితంగా మెలిగాడు. ఆ తరువాత అతన్ని కోల్‌కతా పోలీస్ వెల్ఫేర్ బోర్డుకు పంపించి.. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని పోలీస్ అవుట్ పోస్ట్‌లో నియమించారు.
మరోవైపు టీఎంసీ నేత కునాల్ ఘోష్ సీబీఐ చర్యలను ప్రశ్నించారు. అత్యాచారం-హత్య కేసును త్వరగా పరిష్కరించాలని, ఇప్పటి వరకు ఒక్కరిని మాత్రమే అరెస్టు చేశారన్నారు. అది కూడా కోల్‌కతా పోలీసులే చేశారని అన్నారు. సీబీఐ ఏం చేస్తోందని, ఆలస్యమవుతుండటంతో రాజకీయం నడుస్తోందని ఘోష్ ప్రశ్నించారు.