Abortion rights : అబార్షన్ చట్టాల ‘రద్దు’పై బైడెన్ పోరాటం- ఆ ఆదేశాలపై సంతకం
09 July 2022, 7:56 IST
- Abortion rights in US: అమెరికాలో అబార్షన్ చట్టాల రద్దుపై జో బైడెన్ పోరాడుతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా.. కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు.
అబార్షన్ చట్టాల ‘రద్దు’పై బైడెన్ పోరాటం
Abortion rights in US: అబార్షన్ చట్టాల రద్దుపై సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోరాటం చేస్తున్నారు. ఈ మేరకు.. మహిళకు సాయం చేసేందుకు శుక్రవారం కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేశారు. సుప్రీంకోర్టులో రాజకీయాలు నడుస్తున్నాయని, దేశ ప్రయోజనాల కోసం కృషి చేయడం లేదని మండిపడ్డారు బైడెన్.
దాదాపు 50ఏళ్లుగా ఉన్న అబార్షన్ చట్టాలను రద్దు చేస్తూ గత నెలలో సంచలన తీర్పును వెలువరించింది అమెరికా సుప్రీంకోర్టు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. అబార్షన్ అనేది తమ హక్కు అని మహిళలు రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు చేపట్టారు. వీరికి సెలబ్రిటీలు సైతం మద్దతు పలికారు. తీర్పు వెలువరించిన సమయంలోనే అబార్షన్ చట్టాల రద్దును బైడెన్ తప్పుబట్టారు.
కాగా.. రోజులు గడుస్తున్నా ఈ వ్యవహారంపై బైడెన్ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సొంత పార్టీ సభ్యుల నుంచే ఆయనపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే అబార్షన్ చట్టాల రద్దుకు వ్యతిరేకంగా తాజా ఆదేశాలపై బైడెన్ సంతకం చేశారు. తాజా ఆదేశాల ప్రకారం.. మహిళలు అబార్షన్ చేయించుకోవచ్చు. కాంట్రాసెప్షన్ కూడా వారికి అందుతుంది. అత్యవసర వైద్య సదుపాయాలు అందుతాయి. క్లినిక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అబార్షన్ చేయించుకునే మహిళల సమాచారం గోప్యంగా ఉంచుతారు.
Abortion laws in US : "ఒహాయోలో 10ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఆమె గర్భం దాల్చింది. ఇప్పుడు ఆమెకు అబార్షన్ చేసుకునే హక్కు లేదు. గర్భం తీసేసేందుకు ఒహాయో నుంచి ఇండియానాకు ప్రయాణించాల్సి వచ్చింది. ఆ చిన్న పిల్ల స్థానంలో మనం ఉంటే? ఊహించడానికే భయంగా ఉంది. రిపబ్లికెన్లు.. సుప్రీంకోర్టును అడ్డం పెట్టుకుని దేశంలో వేర్పాటువాద భావాలు పెంచుతున్నారు. కానీ వారికి అమెరికా మహిళల బలం గురించి సరిగ్గా తెలియదు," అని జో బైడెన్ అన్నారు.
ప్రభావం తక్కువే..!
కాగా.. అబార్షన్ చట్టాలకు వ్యతిరేకంగా జో బైడెన్ తీసుకొచ్చిన ఆదేశాలు ప్రభావం చాలా తక్కువే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో అధ్యక్షుడికి పెద్దగా అధికారాలు లేవు! చట్టాలను రూపొందించే విషయంలో అధ్యక్షుడి కన్నా అమెరికాలోని రాష్ట్రాలకే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. అందుకే.. 'బైడెన్ ఆదేశాలతో ఎలాంటి మార్పులు వస్తాయి?' అన్న మీడియా ప్రశ్నలకు శ్వేతసౌధం సరైన సమాధం ఇవ్వలేదు. 'సుప్రీంకోర్టు తీర్పును అధ్యక్షుడి కార్యనిర్వాహక ఆదేశాలతో మార్చలేము,' అని మాత్రం చెప్పింది.
Joe Biden : కానీ మానవ హక్కుల సంఘాలు, ప్రజలు బైడెన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇది తొలి అడుగు అని, చట్టాలను మార్చేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని పిలుపునిస్తున్నారు.