abortion not legalised in US | అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు
అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. దాదాపు 50 ఏళ్లుగా అమల్లో ఉన్న చట్టాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దేశంలో అబార్షన్లకు ఉన్న చట్టబద్ధతను తొలగించింది. 1973లో రో వర్సెస్ వేడ్ కేసులో అబార్షన్‌ను చట్టబద్ధం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
అమెరికాలో గర్భవిచ్ఛిత్తి(అబార్షన్)కి చట్టబద్ధత ఉంది. 50 ఏళ్లుగా అబార్షన్‌లకు రాజ్యాంగ భద్రత ఉంది. ఈ వెసులుబాటుపై 50 ఏళ్ల నుంచి వాదోపవాదాలు, న్యాయ పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. అబార్షన్లకు వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు కూడా కొనసాగాయి. 1973లో రో వర్సెస్ వేడ్ కేసులో అబార్షన్‌ను చట్టబద్ధం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తరువాత, 1976లో అబార్షన్ కోసం భర్త అనుమతి అవసరం లేదని మరో సంచలన తీర్పు వెలువరించింది.
రో వర్సెస్ వేడ్ కేసు
రో వర్సెస్ వేడ్ కేసు అమెరికాలో చాలా పాపులర్ కేసు. అక్కడ అబార్షన్లకు చట్టబద్ధత కల్పించిన చరిత్రాత్మక కేసుగా అది రికార్డు సృష్టించింది. ఆ కేసులో 1973లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా, శుక్రవారం అదే సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇక రాష్ట్రాలు అబార్షన్లను నిషేధిస్తూ చట్టాలు చేసుకోవచ్చు. ఈ తీర్పుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తీర్పును కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో 15 వారాలు, ఆ పై వయస్సున్న గర్భాన్ని తొలగించడాన్ని నిషేధిస్తూ మిసిసిపీ రాష్ట్రం ఒక చట్టాన్నిరూపొందించింది.
డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్
ఈ తీర్పు వెనుక అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంప్రదాయవాదులైన ముగ్గురు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యేలా చూశారు. వారి చేరికతో సుప్రీంకోర్టులో సంప్రదాయవాద న్యాయమూర్తుల ప్రాబల్యం పెరిగింది.
ముందే డ్రాఫ్ట్ లీక్
అయితే, ఈ తీర్పునకు సంబంధించిన న్యాయమూర్తుల అభిప్రాయాలతో కూడిన ముసాయిదా నెల క్రితమే లీక్ అయింది. అబార్షన్ బ్యాన్‌కు అనుకూలంగా జస్టిస్ సామ్యూల్ అలిటో సహ పలువురు జడ్జీల అభిప్రాయాలు లీక్ అయిన డాక్యుమెంట్లలో ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి చేపట్టిన ఒపీనియన్ పోల్‌లో.. అబార్షన్‌లకు చట్టబద్ధ అనుమతి ఇచ్చిన గత తీర్పునే కొనసాగించాలన్న అభిప్రాయానికే ఎక్కువ మద్దతు లభించడం విశేషం.
ఇక `అబార్షన్ హక్కు` లేదు
`అబార్షన్ ను రాజ్యాంగపరమైన హక్కుగా ఇకపై గుర్తించడం కుదరదు. దీనికి సంబంధించిన గత తీర్పును కొట్టివేస్తున్నాం. అబార్షన్లను నియంత్రించే చట్టాలను ఇకపై రాష్ట్రాలు రూపొందించుకోవచ్చు` అని సుప్రీంకోర్టు తీర్పు పేర్కొంది. ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ స్టీఫెన్ బ్రేయర్, జస్టిస్ సోనియా సోటోమేయర్, జస్టిస్ ఎలీనా కాగన్ ఈ తీర్పును వ్యతిరేకించారు. అమెరికా సుప్రీంకోర్టులో వీరికి లిబరల్ వర్గంగా పేరుంది. లక్షలాది అమెరికా మహిళలకు ఇన్నాళ్లు ఉన్న రాజ్యాంగబద్ధ రక్షణ తొలగిపోతోందని బాధాతప్త హృదయంతో.. ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నాం` అని ఆ ముగ్గురు న్యాయమూర్తులు పేర్కొన్నారు.
13 వారాల్లోపే..
అమెరికాలో 90 శాతం అబార్షన్లు 13 వారాల గర్భంలోపే జరుగుతున్నాయని ఒక అధ్యయనంలో తేలింది. అందులో సగం పిల్స్ ద్వారానే జరుగుతాయని తేల్చింది.