US abortion laws : 'మహిళల కన్నా ఆయుధాలకే ఎక్కువ హక్కులు ఉన్నాయి!'
US abortion laws: అబార్షన్ చట్టాలపై సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అమెరికావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలోని ప్రముఖ నటీమణులు సైతం.. తమ గొంతును వినిపిస్తున్నారు.
US abortion laws : అమెరికా అబార్షన్ చట్టాలపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. మహిళలకు దాదాపు 50ఏళ్లుగా అందుబాటులో ఉన్న రాజ్యంగబద్ధమైన రక్షణను తొలగిస్తూ.. అమెరికా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ జాబితాలోకి హాలీవుడ్ ప్రముఖ నటీమణులు కూడా చేరుతున్నారు. మహిళలకు అండగా తమ గొంతును వినిపిస్తున్నారు.
అమెరికాలోని నటీమణిలు, సింగర్లు, రైటర్లు.. ఇలా అందరు.. ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. మహిళలు.. తమ జీవితాలను తమకు నచ్చినట్టుగా బతికే హక్కును కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
"మనం ఈ స్థితిలో ఉన్నామని ఆలోచిస్తేనే చాలా భయంగా ఉంది. మహిళలు ఎన్నో ఏళ్లుగా తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈరోజు.. పరిస్థితులు తలకిందులయ్యాయి," అని ప్రముఖ సింగర్ టేలర్ స్విప్ట్ ట్వీట్ చేశారు.
"మహిళలు అబార్షన్లు చేయించుకుంటారు. తాజా పరిణామాలతో ఏం మారదు. కానీ భద్రత, న్యాయపరమైన అబార్షన్లు మాత్రం ప్రమాదంలో పడతాయి," అని కుకరీ షో చెఫ్ పద్మ లక్ష్మి అభిప్రాయపడ్డారు.
'రాజ్యంగబద్ధమైన హక్కులను.. మహిళల నుంచి దోచుకోవడం చూస్తుంటే భయంగా ఉంది. తనకు నచ్చింది చేసేందుకు మహిళకు హక్కు ఉండాలి. తన శరీరంతో తాను ఏం చేసుకుంటుందనేది ఆ మహిళ ఇష్టం,' అని మరో నటీమణి సెలేనా గోమేజ్ ట్వీట్ చేశారు.
"చాలా కోపంగా ఉంది. సుప్రీంకోర్టు చర్యలు 'బుల్ షిట్' దీని మీద ఏదో ఒకటి చేయాలి. మహిళల కన్నా ఆయుధాలకే ఎక్కువ హక్కులు ఉన్నాయి. మహిళలపై ఎక్కుపెట్టిన ఈ యుద్ధాన్ని ఆపండి. శరీరం నుంచి చట్టాలను వేరు చేయండి. సుప్రీంకోర్టు తీర్పును నిషేధించాలి. పోస్టులు చేస్తే సరిపోదు. ఏదో ఒకటి చేయాలి," అని యాక్టర్ హాల్లే బెర్రి అన్నారు.
నిరసనలు..
మరోవైపు అబార్షన్ చట్టాలపై సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అమెరికావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు రోడ్ల మీదకొచ్చి తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రజలే కాదు.. నాయకులు సైతం సుప్రీంకోర్టు తీర్పును తప్పుబడుతున్నారు. 'ఇది చాలా తప్పు. మహిళల హక్కులను కాపాడేందుకు నా పరిధిలో ఉన్నంత వరకు చేస్తాను,' అని స్వయంగా ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామాలు కూడా.. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించారు. మిచెల్ ఒబామా.. సామాజిక మాధ్యమాల్లో పెద్ద పోస్టు పెట్టి.. కోర్టు తీర్పును ఖండించారు.
కాగా.. మరో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం.. అబార్షన్ చట్టలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మెచ్చుకున్నారు. ఇది చారిత్రక తీర్పు అని కొనియాడారు.
వాస్తవానికి.. 5-3 ఓట్ల తేడాతో తాజా తీర్పు వెలువడింది. కాగా.. తీర్పునకు అనుకూలంగా ఓటు వేసిన ఐదుగురిలో ముగ్గురు న్యాయమూర్తులు.. డొనాల్ట్ ట్రంప్ హయాంలో నియమితులైనవారే!
సంబంధిత కథనం
టాపిక్