Israel - Hamas war: గాజాలో ఇజ్రాయెల్ మరో దారుణం; స్కూల్ పై బాంబు దాడి; 30 మంది మృతి
06 June 2024, 11:54 IST
అంతర్జాతీయ యుద్ధ నిబంధనలను బేఖాతరు చేస్తూ గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం కొనసాగిస్తోంది. గాజాలోని ఒక పాఠశాల భవనంపై ఇజ్రాయెల్ బాంబులతో విచక్షణారహితంగా చేసిన దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ స్కూల్ ను ఐక్యరాజ్య సమితి షెల్టర్ గా ఉపయోగిస్తున్నారు. దీనిని హమాస్ కాంపౌండ్ గా ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
ఇజ్రాయెల్ దాడిలో మరణించిన వ్యక్తి వద్ద కుటుంబ సభ్యుడి ఆవేదన
Israel - Hamas war: అంతర్జాతీయ యుద్ధ నిబంధనలను బేఖాతరు చేస్తూ గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం కొనసాగిస్తోంది. సెంట్రల్ గాజాలోని పాఠశాల ఆశ్రయంపై గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐదుగురు పిల్లలతో సహా కనీసం 30 మంది మరణించారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ లో హమాస్ అక్టోబర్ 7న జరిపిన రాక్షస దాడి అనంతరం ఇజ్రాయెల్ ప్రతికూల దాడులను ప్రారంభించింది.
హమాస్ ముసుగులు అవి
గాజాలోని అల్-బాలాహ్లోని అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రిపై జరిగిన దాడిలో కనీసం 30 మంది, ఆ స్కూల్ సమీపంలోని ఒక ఇంటిపై జరిగిన దాడిలో ఆరుగురు మృతి చెందారు. ఐరాస ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ (UNRWA) నిర్వహిస్తున్న ఈ పాఠశాలను తాము లక్ష్యంగా చేసుకున్నామని, హమాస్, ఇస్లామిక్ జిహాద్ దీనిని ముసుగుగా ఉపయోగించుకున్నాయని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది.
36 వేల మంది పాలస్తీనీయుల మృతి
పాలస్తీనాలో నిర్వాసితులైన 2.3 మిలియన్ల పాలస్తీనియన్లకు UNRWA పాఠశాలలు ఆశ్రయాలుగా కొనసాగుతున్నాయి. దీర్ఘకాలంగా శరణార్థుల శిబిరంగా ఉన్న నుసేరాత్ లో గురువారం ఈ రెండు దాడులు జరిగాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, హమాస్ దాడుల్లో సుమారు 1,200 మంది ఇజ్రాయెలీలు మరణించగా, ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 36,000 మంది పాలస్తీనీయులు మరణించారు. సెంట్రల్ గాజా ఆసుపత్రుల్లో 70 మృతదేహాలు, 300 మంది క్షతగాత్రులు ఉన్నారని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ తెలిపింది.
కాల్పుల విరమణ
దశలవారీ కాల్పుల విరమణకు, బందీల విడుదలకు, చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి అమెరికా ప్రయత్నిస్తోంది. అయితే కాల్పుల విరమణ జరగాలంటే హమాస్ నాశనం కావాల్సిందేనని ఇజ్రాయెల్ పట్టుబడుతోంది. మరోవైపు, ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణకు అంగీకరిస్తే, కాల్పుల విరమణ పాటిస్తామని హమాస్ డిమాండ్ చేస్తోంది. ఇజ్రాయెల్ దళాలు డేర్ అల్-బాలాహ్ లో, బురేజ్ శరణార్థి శిబిరాల్లో చురుకుగా ఉన్నాయి, హమాస్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇజ్రాయెల్ విస్తృతమైన వైమానిక దాడులు, గ్రౌండ్ ఆపరేషన్స్ గాజాను, ముఖ్యంగా గాజా సిటీ మరియు ఖాన్ యూనిస్ లను నాశనం చేశాయి. గత శుక్రవారం జబాలియా శిబిరం నుండి వైదొలిగిన తరువాత, ఇజ్రాయెల్ దళాలు ఇప్పుడు సెంట్రల్ రఫాలో ఉన్నాయి.